ఇండియన్ కార్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్ (Electric Vehicles) లాంచ్ చేయాలని ఇప్పుడు అన్ని ఆటోమొబైల్ కంపెనీలూ భావిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఈవీలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ (Hyundai Motor) ఇండియాలో ఈ-కార్లను లాంచ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. హ్యుందాయ్ ఇప్పటికే ఒక ఎలక్ట్రిక్ కారును భారత్‌లో విడుదల చేసింది. అయితే 2028లోగా 6 ఎలక్ట్రిక్ కార్లను ఇండియాకు తీసుకురావాలని కంపెనీ ఒక ప్లాన్ రచించింది. వీటిలో చాలా తక్కువ ధరతో అందరికీ అందుబాటులో ఉండే ఒక ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. కంపెనీ ఈ చౌకైన, చిన్న ఎలక్ట్రిక్ కారును (Small & Affordable Electric Car) డెవలప్ చేయడం ఇప్పటికే ప్రారంభించింది. దీంతో ఈ కారు త్వరలోనే దేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
దేశంలో ఇప్పటివరకు లాంచ్ అయిన ఎలక్ట్రిక్ కార్లన్నీ ప్రీమియం మోడళ్లే కావడంతో మధ్య తరగతి వారు వీటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. దీన్ని గమనించిన హ్యుందాయ్ కంపెనీ సరసమైన ధరకే ఒక ఎలక్ట్రిక్ కారును తయారు చేయడం మొదలెట్టింది. అయితే దీనిని చాలా తక్కువ కాస్ట్‌లో తీసుకురావడం కోసం స్థానికంగా విడి విభాగాలను సేకరిస్తోంది. అలానే ధర మరింత తగ్గించేందుకు కారు తయారీ ప్రక్రియ మొత్తాన్ని ఇండియాలోనే పూర్తి చేయడంపై దృష్టిసారిస్తోంది. తక్కువ ధరతో కార్లను తీసుకొస్తే, అమ్మకాలు భారీగా పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. 6 ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ కోసం హ్యుందాయ్ రూ.4 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లోని కొంత డబ్బును ఛార్జింగ్ నెట్‌వర్క్‌లు, అమ్మకాలు, స్థానిక అసెంబుల్ ప్రాసెస్, తయారీ వంటి వాటికి కంపెనీ కేటాయించనుంది.
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ కార్లతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ కార్లు చాలా తక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఈవీల సేల్ వాటా ఇండియాలో కేవలం 1% మాత్రమే ఉండటం గమనార్హం. అయితే భవిష్యత్‌లో దేశంలో ఈవీలు మాత్రమే అమ్ముడు పోయేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మరికొద్ది ఏళ్లలో ఇండియా అత్యధిక ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్న దేశంగా నిలుస్తుందనడంలో సందేహం లేదని ఇటీవలే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇండియాలో అనేక ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తూ పొల్యూషన్ తగ్గించేందుకు చాలా కంపెనీలు దోహదపడుతున్నాయి. ఇండియాలో రెండో అతిపెద్ద కార్ల కంపెనీగా వెలుగొందుతున్న హ్యుందాయ్‌తో పాటు, కొత్త ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టాటా, మహీంద్రా వంటి ఇతర సంస్థలు ముందంజలో ఉన్నాయి. ఓలా, రెనాల్ట్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేసేందుకు నడుంబిగించాయి.
ప్రస్తుతం హ్యుందాయ్ తన ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ క్రాసోవర్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఐయోనిక్ 5 దాదాపు 480 కిలోమీటర్ల రేంజ్‌తో లాంచ్ కానుంది. యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు 44,000 డాలర్లు (రూ.43 లక్షలు)కు సేల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Car, Hyundai, New cars, Tech news