గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిత్యం 12వేలకు పైనే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉద్యోగులను ఆఫీసులకు వచ్చేలా కంపెనీలు ప్రోత్సహిస్తున్నప్పటికీ, ఎక్కువగా మంది రిమోట్‌గా పని చేయడానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రముఖ ఐటీ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ ఇప్పటికే హైబ్రిడ్ మోడల్ విధానాన్ని అనుసరిస్తున్నట్లు ప్రకటించాయి.
కొన్ని ఐటీ కంపెనీలు వారంలో పరిమిత సంఖ్యలో మాత్రమే తమ ఉద్యోగులను ఆఫీసులకు వచ్చేలా వెసులుబాటు కల్పించాయి. అయితే, మెజార్టీ కంపెనీలు రిమోట్‌గా పని చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. త్వరలోనే Work From Home ముగుస్తుందనుకున్న తరుణంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ విధానం కొనసాగించక తప్పడం లేదని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.
ప్రముఖ ఎడ్టెక్ సంస్థ టీమ్‌లీజ్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. టెక్నాలజీ నుంచి తయారీ వరకు, BFSI నుంచి FMCG వరకు, రిటైల్ నుంచి ఆరోగ్యం, ఆటోమొబైల్ రంగాలకు చెందిన పరిశ్రమలు ఈ ఏడాది చివరిలోపు ఫుల్‌టైమ్ ఆఫీస్వర్క్ విధానాన్ని అమలు చేస్తాయని 58 శాతం కంటే ఎక్కువ మంది software employees విశ్వసిస్తున్నారు. మరోపక్క కేవలం 5 శాతం మంది మాత్రమే సంస్థల కోసం భవిష్యత్‌లో వర్చువల్‌గా అందుబాటులో ఉండటానికి మొగ్గు చూపుతున్నారని సర్వేలో తేలింది. 43.5 శాతం మంది హెచ్ఆర్ లీడర్లు, తమ ఉద్యోగులు తిరిగి పనిలోకి రావడానికి అంగీకరించారని సర్వే వెల్లడించింది. అయితే 76.78 శాతం ఐటీ సంస్థలు ఉద్యోగులకు వర్క్ మోడల్‌ను ఎంచుకోవడంలో ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్లు సర్వేలో తెలిపింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం
టీసీఎస్
TCS ఇప్పటికే హైబ్రిడ్ మోడల్ ఆఫ్ వర్కింగ్‌ను అమలు చేయడానికి తన ప్రణాళికను ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు ఆఫీస్‌కు రావడం వంటి రెండిటి మిశ్రమంగా ఈ విధానం ఉండనుంది. ఇటీవల ఉద్యోగులకు పంపిన లేఖలో తన హైబ్రిడ్ మోడల్ 3Es (ఎనేబుల్, ఎంబ్రేస్, ఎంపవర్) గురించి టీసీఎస్ వివరించింది. ప్రస్తుతానికి, కంపెనీ కార్యకలాపాలు ఎక్కువగా రిమోట్‌గానే కొనసాగుతున్నాయి.
ఇంటి నుంచి పని చేసే సమయంలో ఉద్యోగానికి పూర్తి సమయం కేటాయించడం సవాల్‌తో కూడుకున్నది. ఇంటి పనులు, పిల్లల చదువు, పెంపుడు జంతువుల సంరక్షణ తదితర ఇతర బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగం, ఇంటి పనుల మధ్య స్పష్టమైన విభజన ఉండాలి. దీనికి కొంత నిర్మాణాత్మక ఆలోచనతో ఉండాలి. ప్రాధాన్యతను బట్టి పనులకు సమయం కేటాయించుకుంటే సరిపోతుందని టీసీఎస్ లేఖలో పేర్కొంది.
ఎక్కడ నుంచైనా పనిచేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నా.. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో సంస్థలు అంచనా వేసుకోవాలి. ముఖ్యంగా వర్క్, ఎంటర్ ట్రైన్మెంట్మధ్య సమతుల్యతను సంస్థలు కచ్చితంగా నిర్ధారించుకోవాలి. ఉద్యోగులకు పని ఒత్తిడిని తగ్గించడానికి, పనిలో ఆనందాన్ని తీసుకురావడానికి ఐటీ సంస్థలు అనేక కార్యక్రమాలు చేపట్టవచ్చు. తద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మార్గం సుగమం అవుతుంది.
ఇన్ఫోసిస్
వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో infosys మూడు దశల ప్రణాళికను అవలంభించనుంది. మొదటి దశలో కంపెనీ DC(డెవలప్మెంట్ సెంటర్స్) ఉన్న నగరాలు లేదా వాటికి సమీపంలో ఉన్న పట్టణాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులను వారానికి రెండుసార్లు కార్యాలయానికి వచ్చేలా ప్రోత్సహించనుంది. రెండవ దశలో, DC పట్టణాలకు వెలుపల ఉన్న ఉద్యోగులను తమ బేస్ డెవలప్మెంట్ కేంద్రాలకు తిరిగి రాగలరో లేదో చూడటానికి రాబోయే కొద్ది నెలల్లో సన్నాహాలు ప్రారంభించనున్నామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ తెలిపారు. దీర్ఘ కాలంలో కరోనా పరిస్థితులు, క్లయింట్లు, ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తామన్నారు.
హెచ్‌సీఎల్
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా ప్రస్తుతం హైబ్రిడ్ మోడ్‌తో కొనసాగుతోంది. ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రత, శ్రేయస్సు తమ ప్రాధాన్యతలలో ఒకటి అని HCL ప్రకటించింది. అలాగే వ్యాపార సాధారణ స్థితిని కొనసాగించడానికి, తద్వారా క్లయింట్లకు నిరంతరాయమైన సేవలను అందించడానికి కూడా కట్టుబడి ఉన్నామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని హైబ్రిడ్ మోడల్లో పనిచేయడాన్ని ప్రోత్సహిస్తామని హెచ్‌సీఎల్ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Infosys, TCS, Work From Home