యాపిల్ సంస్థ ఐఫోన్ల కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేసింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన iOS 14.5ను యూజర్లు డివైజ్‌లో అప్డేట్ చేసుకుంటున్నారు. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో అనేక కొత్త ఫీచర్లను సంస్థ అభివృద్ధి చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖానికి మాస్కులు ధరించకుండా బయటకు వెళ్లడం కష్టంగా మారింది. ఇంట్లో సైతం మాస్కులు ధరించడం మంచిదని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ కొత్త ఐఓఎస్‌లో ఫేస్ లాక్ సిస్టమ్‌ను అప్డేట్ చేసింది. ఇప్పుడు ఐఫోన్ యూజర్లు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కోసం మాస్కులు తీయాల్సిన అవసరం లేదు. ముఖానికి మాస్కులు ధరించినా ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఫేస్‌మాస్కుతో డివైజ్‌లను అన్‌లాక్ చేసే సామర్థ్యం iOS 14.5 అప్డేట్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఐఫోన్ 10, ఆ తరువాత వచ్చిన డివైజ్‌లకు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లేదు. అందువల్ల ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను యాపిల్ మరింత సమర్థంగా పనిచేసేలా అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ ఫీచర్ పనిచేయడానికి యూజర్లు యాపిల్ స్మార్ట్ వాచ్‌ను వాడాలి.
* ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
ఐఫోన్ కస్టమర్లు ముందు డివైజ్‌లో iOS 14.5 అప్డేట్ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేయాలి. ఈ అప్డేట్ను పొందడానికి సెట్టింగ్స్‌లో జనరల్ సెట్టింగ్స్‌ను ఎంచుకోవాలి. ఈ విభాగంలో సాఫ్ట్వేర్ అప్డేట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ అప్డేట్ ఐఫోన్ X, ఆ తరువాత వచ్చిన సిరీస్‌లతో, యాపిల్ వాచ్ సిరీస్ 3, దీని తరువాత విడుదలైన స్మార్ట్ వాచ్‌లతో మాత్రమే పనిచేస్తుంది. ఫేస్‌మాస్క్ అన్‌లాక్ ఫీచర్ కోసం యాపిల్ వాచ్‌లో ఎలాంటి సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం లేదు. ఐఫోన్ సెట్టింగ్స్ ద్వారా, స్మార్ట్ వాచ్ సాయంతో ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఇందుకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి.
ముందు ఐఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేస్తే ‘Face ID & Passcode’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లో ‘అన్‌లాక్ విత్ యాపిల్ వాచ్’ అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఆన్ చేయాలి. ఈ ఫీచర్‌ను ఆన్ చేసిన తర్వాత, ఐఫోన్లో ఫేస్ ఐడీ.. యూజర్లు ఫేస్ మాస్క్ ధరించినా గుర్తిస్తుంది. ఫేస్ మాస్క్‌తో యూజర్ల ముఖాన్ని గుర్తించినప్పుడు ఐఫోన్ ఫేస్ ఐడీ అన్‌లాక్ అవుతుంది. ఈ ఫీచర్ పనిచేయడానికి యాపిల్ వాచ్‌ను కూడా అన్‌లాక్ చేయాలి. ఐఫోన్‌కు వాచ్ దగ్గర్లో ఉండాలి. ఐఫోన్ ఫేస్‌మాస్క్‌తో ముఖాన్ని గుర్తించిన తర్వాత, దాన్ని అన్‌లాక్ చేయడానికి యాపిల్ వాచ్‌కు హాప్టిక్, నోటిఫికేషన్ పంపుతుంది. మాస్కుతో ఉన్న యూజర్ల ముఖాన్ని గుర్తించడం ఐఫోన్‌కు సమస్యగా మారవచ్చు. అలాంటప్పుడు దాన్ని అన్‌లాక్ చేయడానికి యాపిల్ వాచ్ అవసరం అవుతుంది. సమస్యలు ఎదురైనప్పుడు యాపిల్ వాచ్ ద్వారా ఐఫోన్‌ను తిరిగి లాక్ చేయవచ్చు. కరోనాతో కలిసి జీవించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫీచర్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని యాపిల్ ప్రకటించింది.