Car maintenance: ఎక్కువ రోజులు కారును బయటకు తీయట్లేదా..ఈ సంరక్షణ చర్యలు పాటించండి..

Car maintenance: ఎక్కువ రోజులు కారును బయటకు తీయట్లేదా..ఈ సంరక్షణ చర్యలు పాటించండి..

(ప్రతీకాత్మక చిత్రం) (Image credit - tata motors website)

ఇంజన్ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. ఎలుకలు చేరడం, కొన్ని భాగాలు తుప్పు పట్టడం, బ్యాటరీ డిశ్చార్జ్ కావడం వంటి సమస్యలు ఎదురు కావచ్చు. వీటికి దూరంగా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించాలని మోటార్ వాహనాల నిపుణులు చెబుతున్నారు.

  • Share this:
గత కొన్నేళ్లుగా కొత్త కార్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. వాహనాలను తరచుగా నడిపితేనే వాటి పనితీరు సక్రమంగా ఉంటుంది. కానీ కరోనా కారణంగా సంవత్సరం నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు ఉంటున్నాయి. ఫలితంగా వాహనాలు ఎక్కువ రోజులు ఇళ్లకే పరిమితమవుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు ఇంటి నుంచే పనిచేస్తుండటంతో కార్లు రోడ్లమీదకి రావట్లేదు. ఫలితంగా వాటి నిర్వహణ సక్రమంగా లేక ఇంజన్ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. ఎలుకలు చేరడం, కొన్ని భాగాలు తుప్పు పట్టడం, బ్యాటరీ డిశ్చార్జ్ కావడం వంటి సమస్యలు ఎదురు కావచ్చు. వీటికి దూరంగా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించాలని మోటార్ వాహనాల నిపుణులు చెబుతున్నారు.

కనీసం వారానికి ఒకసారైనా కారును బయటకు తీయాలి
ఎక్కువ రోజులు కారును ఒకే దగ్గర పార్క్ చేసి ఉంచకూడదు. దీనివల్ల బ్రేక్ డిస్కులు, కాలిపర్లు వంటి భాగాలు తుప్పు పడతాయి. అందువల్ల కారును కనీసం వారానికి ఒకసారైనా నడపాలి. తుప్పుపట్టిన వాహనాల బ్రేకులు సరిగా పనిచేయవు. దీంతోపాటు ఒక రకమైన శబ్దం వస్తుంది. వాటిని మార్చాలంటే అదనంగా ఖర్చు అవుతుంది. వీటన్నింటికీ దూరంగా ఉండాలంటే కారును తరచుగా నడపాలి. వారానికి ఒకసారైనా డ్రైవ్‌కు వెళ్లడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇందుకు సమయం లేకపోతే కారును స్టార్ట్ చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. వవర్ విండోలు, కారు ఏసీ, ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అన్నీ ఆన్ చేసి ఉంచాలి.

టైర్లలో గాలి నింపడం
కారు టైర్ల మెయింటెనెన్స్ సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోవాలి. ఎక్కువ రోజులు కారును బయటకు తీయకపోతే టైర్లలో గాలి పోయే అవకాశం ఉంది. ఫలితంగా కారు బరువు టైర్ల మీద పడి అవి దెబ్బతింటాయి. అందువల్ల కారు టైర్లలో ఎప్పుడూ గాలి ఉండేలా చూడాలి.

ఎలుకలను నిరోధించాలి
తరచుగా బయటకు తీసే కార్లను ఎలుకలు ఆవాసంగా ఎంచుకోవు. కానీ ఎక్కువ రోజులు కదపకుండా ఉంచే కార్లలో ఎలుకలు చేరే అవకాశం ఉంటుంది. ఇవి కార్లలో వైరింగ్‌ను కొరికేస్తాయి. ఫలితంగా వాహనాల్లోని వివిధ వ్యవస్థలు పనిచేయకుండా పోతాయి. పిప్పర్‌మింట్ ఆయిల్, మౌస్ ట్రాప్‌లు, మౌస్ రిపెల్లెంట్ స్ప్రేలను ఉపయోగించడం ద్వారా ఎలుకలు కార్లలోకి రాకుండా జాగ్రత్త పడవచ్చు.

పార్కింగ్ బ్రేక్ వద్దు
ఎక్కువ రోజులు వాహనాలకు హ్యాండ్ బ్రేక్ వేసి ఉంచడం మంచిది కాదు. దీనివల్ల అవి తుప్పుపడతాయి. ఫలితంగా బ్రేకింగ్ సిస్టమ్ దెబ్బతింటుంది. చదునుగా ఉన్న ప్రాంతంలో పార్క్ చేసిన కార్లకు హ్యాండ్ బ్రేక్ వేయకూడదు.

కవర్లను వాడాలి
ఇంట్లో పార్కింగ్ ప్లేస్ లేనివారు వేరే ప్రాంతాల్లో కార్లను పార్కింగ్ చేస్తారు. అక్కడ నీడలోనే వాహనాలను నిలిపి ఉంచాలి. ఎక్కువ రోజులు ఎండ ప్రభావానికి గురికావడం వల్ల కార్ల రంగు పోయే అవకాశం ఉంది. దీంతోపాటు దుమ్ము, ధూళి చేరకుండా కారును ప్రొటెక్షన్ కవర్‌తో కప్పి ఉంచాలి.

లోపల శుభ్రత అవసరం
కనీసం వారానికి ఒకసారి అయినా కారును శుభ్రం చేయాలి. పోర్టబుల్ వాక్యూం క్లీనర్ సాయంతో వాహనాల లోపల, సీట్లపై పేరుకుపోయే దుమ్మును శుభ్రం చేయాలి. దీనివల్ల దుర్వాసన దూరమవుతుంది.

ఇంజన్ ఆయిల్ మార్చాలి
కారు ఇంజన్ లోపలి భాగాలను ఇంజన్ ఆయిల్ సంరక్షిస్తుంది. హెల్తీ ఇంజన్ కోసం ఆయిల్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. నిర్ణీత దూరం తిరిగిన తరువాత ఆయిల్‌ను తప్పనిసరిగా మార్చాలి. కనీసం 90 రోజుల తరువాత అయినా దీన్ని మార్చాలని నిపుణులు చెబుతున్నారు.

అన్ని భాగాలను పరీక్షించాలి
ఎక్కువ రోజులు నడపని కారు స్టార్ట్ కానప్పుడు.. దాన్ని పదేపదే స్టార్ట్ చేయకూడదు. ఒక మెకానిక్ సాయంతో సమస్య ఏంటో తెలుసుకోవాలి. డ్రైవ్ బెల్టులు, హోస్‌లను తనికీ చేయాలి. బ్రేకులు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో గుర్తించాలి. బ్రేకుల హైడ్రాలిక్ ఫ్లూయిడ్‌ను తీసివేయాలి. చాలా రోజుల తరువాత బయటకు తీసిన కారును తక్కువ వేగంతో నడుపుతూ, స్పీడ్ పెంచుకోవాలి.
First published:

అగ్ర కథనాలు