ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp)లో ప్రైవసీ ఉండదనే విమర్శ ఈ రోజుల్లో ఎక్కువగా వినిపిస్తోంది. కొన్ని నెలల క్రితం ప్రైవసీ పాలసీ మారుస్తామని వాట్సాప్ చెప్పడం ఈ అనుమానాలను కాస్త బలపరిచింది. దీనిపై భారీ ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అయితే తమ యూజర్ల డేటా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో చాలా భద్రంగా ఉంటుందని, మూడో వ్యక్తి ఆ డేటాను ఎప్పటికీ యాక్సెస్ చేయలేరని వాట్సాప్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్‌పై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ డ్యూరోవ్ (Pavel Durov) చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. వాట్సాప్ సేఫ్ కాదని.. దీనిని 13 ఏళ్లుగా ఒక నిఘా సాధనం(Surveillance tool)గా ఉపయోగిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తానేమీ వాట్సాప్ పట్ల పక్షపాతం చూపించడం లేదని, తన మెసేజింగ్ యాప్‌లోకి యూజర్లను మారిపోమని కూడా చెప్పడం లేదని వ్యాఖ్యానించారు.
యూజర్లు వాట్సాప్ జోలికి వెళ్లకపోవడమే చాలా మంచిదని, లేదంటే మీ ఫోన్లోని మొత్తం డేటాను హ్యాకర్ల చేతిలో పెట్టిన వారవుతారని ఆయన హెచ్చరించారు. వాట్సాప్ గత నెలలో వెల్లడించిన సెక్యూరిటీ ఇష్యూను హైలైట్ చేస్తూ, వాట్సాప్ యూజర్ల డేటాను ప్రమాదంలో పడేస్తోందని అన్నారు. ఇలాంటి సెక్యూరిటీ ఇష్యూ వల్ల యూజర్ల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. వాట్సాప్ మినహా మరే ఇతర ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌నైనా ఉపయోగించాలని ఆయన ప్రజలను కోరారు.
WhatsApp: ఇక, వాట్సాప్ లో అలా చేయలేరు.. యూజర్ల ప్రైవసీ కోసం సరికొత్త ఫీచర్!
ఆరోపణలు ఇవే..
పావెల్ డ్యూరోవ్ తన టెలిగ్రామ్ ఛానల్లో ఒక మెసేజ్ ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మెసేజ్‌లో "వాట్సాప్ సెక్యూరిటీ ఇష్యూ వల్ల హ్యాకర్ హానికరమైన వీడియోను పంపడం ద్వారా లేదా వీడియో కాల్ని స్టార్ట్ చేయడం ద్వారా యూజర్ల డివైజ్‌ను కంట్రోల్ చేయగలుగుతార"ని ఆయన అభిప్రాయపడ్డారు. వాట్సాప్ ఈ సాంకేతిక లోపానికి ఫిక్స్ విడుదల చేసిందని దానిని అప్డేట్ చేసుకున్నా సరే యూజర్లు సేఫ్‌గా ఉండే ఛాన్సే లేదన్నారు. వాట్సాప్ గతంలో 2017, 2018, 2019, 2020లో ఇలాంటి సెక్యూరిటీ సమస్యలను వెల్లడించిందని ఆ తర్వాత వీటిని పరిష్కరించిందని అఫిషియల్ లింక్స్‌తో సహా అతను వెల్లడించారు.
2017 నుంచి ఒక్కో సంవత్సరంలో ఇలాంటి సెక్యూరిటీ సమస్యలు బయటపడటం చూస్తుంటే వాట్సాప్ ఏ మాత్రం సేఫ్‌గా లేదని పేర్కొన్నారు. ఈ లోపాలు హ్యాకర్లు యూజర్లు ఫోన్ యాక్సెస్ చేయడానికి తలుపులు తెరుస్తాయని అన్నారు. వాట్సాప్‌లో కనిపించే భద్రతా సమస్యలు ఉద్దేశపూర్వకంగా కలిగించినవని.. ఈ ప్లాంటెడ్ బ్యాక్డోర్లు ప్రభుత్వాలు, పాలసీ మేకర్లు, హ్యాకర్లు ఎన్క్రిప్షన్, ఇతర భద్రతా చర్యలను దాటి యూజర్ డేటాను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తాయని ఆరోపించారు.
ఈ ఆందోళనలన్నింటినీ హైలైట్ చేస్తూ, ఈ కారణాలతో తన డివైజ్ నుంచి కొన్నేళ్ల క్రితమే వాట్సాప్‌ను తొలగించాలని తెలిపారు. టెలిగ్రామ్‌ని ఉపయోగించేలా ప్రజలను కన్విన్స్ చేయడానికి తాను ప్రయత్నించడం లేదని, తన ప్లాట్ఫామ్లో ఇప్పటికే 700 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని, దీనికి ప్రమోషన్ అవసరం లేదని పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయడం డ్యూరోవ్కి ఇదేం మొదటిసారి కాదు. అతను ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా వాట్సాప్ వాడటం యూజర్లు మానేయలేదు సరికదా ఎక్కువ యూజర్స్ యాడ్ అయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cyber security, Telegram, Whatsapp