#HashtagDay: హ్యాపీ బర్త్ డే #హ్యాష్‌‌ట్యాగ్

ఇవాళ హ్యాష్‌ట్యాగ్ 11వ బర్త్‌డే. 11 ఏళ్లల్లో కొన్ని వందల కోట్ల హ్యాష్‌ట్యాగ్స్ పుట్టుకొచ్చాయి. నెటిజన్లు రోజూ పన్నెండున్నర కోట్ల హ్యాష్‌ట్యాగ్స్ షేర్ చేసుకుంటారని అంచనా.

Santhosh Kumar S | news18-telugu
Updated: August 24, 2018, 11:51 AM IST
#HashtagDay: హ్యాపీ బర్త్ డే #హ్యాష్‌‌ట్యాగ్
ఇవాళ హ్యాష్‌ట్యాగ్ 11వ బర్త్‌డే. 11 ఏళ్లల్లో కొన్ని వందల కోట్ల హ్యాష్‌ట్యాగ్స్ పుట్టుకొచ్చాయి. నెటిజన్లు రోజూ పన్నెండున్నర కోట్ల హ్యాష్‌ట్యాగ్స్ షేర్ చేసుకుంటారని అంచనా.
  • Share this:

  • సంతోషానికి ఓ హ్యాష్ ట్యాగ్... #happy


  • బాధకు ఓ హ్యాష్ ట్యాగ్... #sad

  • నవ్వుకో హ్యాష్ ట్యాగ్... #lol

  • కోపానికో హ్యాష్ ట్యాగ్... #angry

  • నిగ్గదీసి అడిగేందుకు ఓ హ్యాష్ ట్యాగ్... #justasking

  • బాధితులమని చెప్పుకునేందుకు ఓ హ్యాష్ ట్యాగ్... #MeTooఇది హ్యాష్ ట్యాగ్ ప్రపంచం. ఏ భావాన్ని వ్యక్తం చేయాలన్నా దానికి ముందు ఓ హ్యాష్ ట్యాగ్ తగిలించడం ఈ రోజుల్లో కామన్. ఇప్పుడు హ్యాష్‌‌‌ట్యాగ్ గురించి ఎందుకింతలా చెప్పుకుంటున్నామంటే... ఇవాళ(ఆగస్ట్ 23) హ్యాష్ ట్యాగ్ బర్త్‌డే. వాస్తవానికి ఇది నెంబర్ సైన్. పౌండ్ సైన్ అని కూడా పిలుస్తుంటారు. కానీ హ్యాష్‌ట్యాగ్‌ని సోషల్ మీడియా మరోలా వాడేస్తోంది. ఇప్పుడు కాదు... 2007 మొదలైంది ఈ ట్రెండ్. తొలిసారిగా అమెరికాకు చెందిన సోషల్ మీడియా ఎక్స్‌పర్ట్ క్రిస్ మెస్సినా ట్విట్టర్‌లో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ మొదలుపెట్టాడు. 2007 ఆగస్ట్ 23న #barcamp ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు.
అంతే... ఆ ట్రెండ్ అలా కంటిన్యూ అయింది. తను సృష్టించిన హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్‌కు ఇంత క్రేజ్ వస్తుందని క్రిస్ మెస్సినా కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా హ్యాష్ ట్యాగ్ చుట్టూ తిరుగుతుందనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఒక టాపిక్‌పై ఒకరు క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్‌ని మిగతావాళ్లు ఫాలో అవుతుంటారు. దీనివల్ల ఉపయోగమేంటంటే ఆ హ్యాష్‌ట్యాగ్స్‌తో మిగతావాళ్లు ఏం పోస్ట్ చేశారో తెలుసుకోవడం సులువు అవుతుంది. #metoo హ్యాష్‌ట్యాగ్‌ని సెర్చ్ చేస్తే ఎవరెవరు తమ బాధను పంచుకున్నారో తెలుస్తుంది.

#metoo
రోజూ కొన్ని లక్షల హ్యాష్ ట్యాగ్స్ పుట్టుకొస్తుంటాయి. నెటిజన్లు రోజూ పన్నెండున్నర కోట్ల హ్యాష్‌ట్యాగ్స్ షేర్ చేసుకుంటారని ఓ అంచనా. అయితే వాటిలో బాగా ట్రెండ్ అయ్యే ట్యాగ్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. ట్రెండ్ అవడమే కాదు... ఉద్యమాలకు ఊపిరిపోసే ఆయుధాలుగా మారుతుంటాయి ఈ హ్యాష్ ట్యాగ్స్. ఇందుకు #metoo హ్యాష్ ట్యాగ్ ఓ పెద్ద ఉదాహరణ. ఈ ఉద్యమాన్ని 2006లోనే అమెరికాకు చెందిన సామాజిక కార్యకర్త టరానా బుర్కే ప్రారంభించారు. మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ధైర్యంగా మాట్లాడటమే కాకుండా అలాంటి బాధితులందర్ని ఏకతాటిపైకి తీసుకురావడం ఆ ఉద్యమం లక్ష్యం. అయితే me too పేరుతో కొనసాగుతున్న ఉద్యమానికి #metoo హ్యాష్ ట్యాగ్ ఓ ఊపునిచ్చింది. అమెరికాకు చెందిన స్టార్ హీరోయిన్ అలిస్సా మిలానో తను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే అని వెల్లడించడంతో సోషల్ మీడియాలో #metoo హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండైంది. ఆ తర్వాత అనేక మంది #metoo హ్యాష్ ట్యాగ్‌తో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి ధైర్యంగా చెప్పుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే హాలీవుడ్ మొఘల్‌గా పేరుతెచ్చుకున్న హార్వే వైన్‌స్టీన్ లైంగిక వేధింపుల బాగోతాన్ని #metoo ఉద్యమం బయటపెట్టింది. ఆ తర్వాత అనేకమంది హీరోయిన్లు ఆయనపై ఆరోపణలు చేసి #metoo ఉద్యమంలో చేతులు కలిపారు. ఆ తర్వాత ఈ ఉద్యమం ఇండియాలోనూ కనిపించింది. పలువురు హీరోయిన్లు తమ బాధను పంచుకున్నారు.

#NotInMyName
హర్యానాలో బీఫ్ తిన్నాడన్న నెపంతో 15 ఏళ్ల జునైద్‌ను దారుణంగా చంపిన తర్వాత #NotInMyName పేరుతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ముస్లింలు, దళితుల హత్యలను భారత పౌరులు వ్యతిరేకిస్తున్నారన్న నినాదంతో సాగింది ఈ ఉద్యమం. మొదట ఢిల్లీలో మొదలైన నిరసనలు దేశమంతా పాకాయి.

#MakeInIndia
మేకిన్ ఇండియా... కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ నినాదాల్లో ఒకటి. భారతదేశంలో నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు, ప్రపంచంలోని పెద్ద కంపెనీలు ఇండియాలోనే తమ ఉత్పత్తులు తయారు చేసేలా ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అప్పట్నుంచి సోషల్ మీడియాలో #MakeInIndia హ్యాష్‌ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది.

#MannKiBaat
మన్ కీ బాత్... భారతదేశ ప్రజలతో ప్రధాన మంత్రి నేరుగా మాట్లాడటం, వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు రూపొందించిన కార్యక్రమం ఇది. డీడీ నేషనల్, ఆలిండియా రేడియో, డీడీ న్యూస్‌లో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. #MannKiBaat హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

#justasking
సినీనటుడు ప్రకాష్ రాజ్ మొదలుపెట్టిన ఉద్యమం #justasking. వివిధ సమస్యలపై గళమెత్తుతూ ట్వీట్ల వర్షం కురిపించాడు ప్రకాష్ రాజ్. ఆ తర్వాత అందరూ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. విమర్శించేందుకు, నిలదీసేందుకు #justasking హ్యాష్‌ట్యాగ్‌ను వాడుతున్నారు.

#StandWithKerala
గత 10 రోజులుగా #StandWithKerala హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. వరద బీభత్సంతో అతలాకుతలమైన కేరళకు మద్దతుగా నిలిచి ఆదుకోవాలంటూ #StandWithKerala హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా ప్రచారం చేస్తున్నారు.

ఇవే కాదు... ఇలా #Greenchallenge, #kikichallenge, #MumbaiRains, #TripleTalaq, #GST లాంటి హ్యాష్ ట్యాగ్స్ ప్రాచుర్యం పొందాయి. హ్యాష్‌ట్యాగ్‌కి ఇంత ప్రాచుర్యం రావడంతో 2014లో ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో # సైన్‌ని పొందుపర్చారు. అసలు హ్యాష్ ట్యాగ్ పెట్టడం కూడా ఓ కళ. ఇప్పటివరకు ఎవరూ ఉపయోగించని హ్యాష్‌ట్యాగ్‌ని సృష్టించడం ఓ పెద్ద సవాల్. సులువుగా అర్థమయ్యేవి, గుర్తుంచుకోగలిగే హ్యాష్‌ట్యాగ్స్ ఎక్కువగా ట్రెండ్‌లోకి వస్తాయి. క్రియేటీవ్‌ హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం ఎలా అన్న అంశంపై గూగుల్‌లో కొన్ని వేల ఆర్టికల్స్ కనిపిస్తాయి. అంతలా హ్యాష్ ట్యాగ్‌ ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఈ తరం యూత్. హ్యాష్ ట్యాగ్‌ ట్రెండ్‌ ఎక్కువగా ఫాలో అయ్యేది ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లోనే. ఆ తర్వాత ఫేస్‌బుక్, యూట్యూబ్‌, పింట్రెస్ట్, గూగుల్+ లాంటి మిగతా సోషల్ మీడియా సైట్లల్లో కూడా ఈ అలవాటు మొదలైంది. అలా 2007లో మొదలైన హ్యాష్‌‌ట్యాగ్ ప్రయాణం పదకొండేళ్లు దాటింది. మరి భవిష్యత్తులో ఈ సైన్ ఇంకెన్ని ఉద్యమాలకు ఊపిరిపోస్తుందో చూడాలి.
Published by: Santhosh Kumar S
First published: August 24, 2018, 11:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading