కేంద్రం కొత్త రూల్స్.. ఇక సోషల్ మీడియాలో అలా చేస్తే ఇట్టే దొరికిపోతారు..

ప్రతీకాత్మక చిత్రం

Guidelines for Social Media, OTT Platforms: కేంద్రం తీసుకువచ్చిన కొత్త మార్గదర్శకాలు సోషల్ మీడియలో అసత్య ప్రచారానికి దిగే వారికి చెక్ పెట్టనున్నాయి. వారిని సులభంగా అధికారులకు పట్టించనున్నాయి.

 • Share this:
  హైదరాబాద్‌లో భారీ ప్రమాదం జరిగిందని నిన్న ఓ వార్త వాట్సప్‌తో పాటు ఇతర సోషల్ మీడియాల్లో చక్కర్లు కొట్టింది. బాలానగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలిందన్న ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. ఇది నిజమనుకుని నమ్మి అనేక మంది షేర్ చేయడంతో ఏ వాట్సాప్ గ్రూప్ చూసినా ఇందుకు సంబంధించిన వీడియో కనిపించింది. దీంతో అధికారులే రంగంలోకి దిగి అది ఫేక్ వీడియో అని ప్రకటన విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఈ ఒక్కటే కాదు నిత్యం ఇలాంటి అనేక ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడో జరిగిన హింసాత్మక, ప్రమాదాలకు సంబంధించిన సంఘటనలను ఇక్కడే జరిగాయంటూ కొందరు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేస్తూ అసత్య ప్రచారానికి దిగుతున్నారు. కొద్ది గంటల్లోనే ఆయా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. అది నిజమా కాదా అని నిర్ధారించుకోకుండానే ఇతరులకు ఈ సమాచారాన్ని చేరవేయాలన్న తొందరలో అనేక మంది ఆయా పోస్టులను షేర్ చేస్తున్నారు.

  ఈ తప్పుడు పోస్టుల విషయంపై కేసులు నమోదైన సమయంలో ఇలా షేర్ చేసిన వారు సైతం అరెస్టు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వీటిని మొదట పోస్ట్ చేసింది ఎవరనే విషయం తెలుసుకోవడం కొన్ని సార్లు కష్టంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సోషల్ మీడియా, ఓటీటీలపై తీసుకువచ్చిన మార్గదర్శకాలు ఈ సమస్యకు చెక్ పెట్టనుంది. ఈ మార్గ దర్శకాల్లో సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై నియంత్రించాలని ఆయా సోషల్ మీడియా సంస్థల యాజమాన్యాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

  అసత్య ప్రచారం ప్రారంభించే తొలి వ్యక్తి వివరాలు కచ్చితంగా తమకు చెప్పాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. 24 గంటలు దర్యాప్తు సంస్థలకు ఆయా సోషల్ మీడియా సంస్థల అధికారులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. కేంద్రం ఫిర్యాదులను పరిష్కరించే అధికారులు దేశంలోనే ఉండాలని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన ఈ మార్గదర్శకాలతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వారు సులభంగా చిక్కనున్నారు. అబద్ధపు వార్తలను సృష్టించి, వాటిని సోషల్ మీడియాలో ఉంచి ఆనందించే వారి ఆటలకు అడ్డుకట్ట పడనుంది.
  Published by:Nikhil Kumar S
  First published: