Google's 21st birthday : ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే... గుండ్రంగా ఉండే బ్రౌజర్ ఐకాన్ క్లిక్ చేసేవాళ్లు. ఇప్పుడో... మొబైల్ హోంస్క్రీన్పై కనిపించే గూగుల్‌ను క్లిక్ చేస్తున్నారు. అలా... ఇంటర్నెట్టే గూగుల్ అన్నంతగా ప్రజల మనసుల్లో గూడు కట్టుకుంది సెర్చ్ ఇంజిన్ గూగుల్. ఇంటర్నెట్లో రారాజుగా మారిన గూగుల్... 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. మీకు తెలుసా... చాలా దేశాల్లో 21 ఏళ్లు దాటిన వాళ్లు మాత్రమే మద్యం తాగేందుకు అర్హత ఉంటుంది. అంటే... ఆయా దేశాల్లో గూగుల్ కూడా ఆ అర్హత సాధించిందన్నమాట. అఫ్కోర్స్ మద్యం ఆరోగ్యానికి హానికరం కాబట్టి... గూగుల్ దాని జోలికి వెళ్లదని మనకు తెలుసు. పుట్టిన రోజు సందర్భంగా... గూగుల్... తనకు తానే ప్రత్యేక డూడుల్ తయారుచేసుకుంది. ఇందులో... వింటేజ్ కంప్యూటర్ అందులో గూగుల్ బ్రౌజర్ విండోను ఉంచింది.
స్టాండ్ఫర్డ్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేసిన లారీ పేజ్, సెర్జీ బ్రిన్... వర్శిటీలోని ఓ డార్మ్ రూంలో 1998 సెప్టెంబర్ 27న గూగుల్‌ను స్థాపించారు. నిజానికి సెప్టెంబర్ 7నే గూగుల్ ప్రారంభమైంది. ఐతే... కంపెనీకి... కార్పొరేట్ కంపెనీగా గుర్తింపు లభించింది మాత్రే సెప్టెంబర్ 27న. ఈ గుర్తింపు వేగంగా లభించేందుకు లారీపేజ్, సెర్జీ బ్రిన్ ఆ 20 రోజులూ చాలా కష్టపడ్డారు.
గూగుల్‌కి ఆ పేరు... గూగోల్ అనే పదం నుంచీ వచ్చింది. 1 పక్కన 100 సున్నాలు పెడితే... ఆ సంఖ్యను గూగోల్ అంటారు. భారీ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభిస్తున్న ఉద్దేశంతో... వాళ్లు గూగుల్ అనే పేరు పెట్టారు. గూగుల్ ప్రధాన లక్ష్యం ఒకటే. ప్రపంచంలోని సమాచారం మొత్తాన్నీ ఓ క్రమ పద్ధతిలో పెట్టి... అది అందరికీ చేరేలా చేసి... అందరూ దాని నుంచీ ప్రయోజనం పొందేలా చెయ్యడమే.
గూగుల్ ప్రారంభమైన కొత్తలో... యాహూ, ఆస్క్ జీవ్స్, బింగ్ వంటి చాలా సెర్చ్ ఇంజిన్ల నుంచీ విపరీతమైన పోటీ ఎదురైంది. అలాంటిది ఇప్పుడు గూగుల్ ప్రపంచమంతా ఉంది. 100 పైగా భాషల్లో సేవలు అందిస్తోంది. రోజూ లక్షల కోట్ల ఆన్సర్లు ఇస్తోంది. ఏటా గూగుల్ వాడకం పెరుగుతోంది.
Published by:Krishna Kumar N
First published:September 27, 2019, 09:19 IST