గూగుల్ మిమ్మల్ని వెంటాడుతోంది!

వదల బొమ్మాళీ వదల... నిను వీడని నీడను నేను అన్నట్టుగా... స్మార్ట్‌ఫోన్ వాడేవాళ్లందర్నీ గూగుల్ వెంటాడుతోంది. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ట్రాక్ చేస్తోంది.

news18-telugu
Updated: August 15, 2018, 5:10 PM IST
గూగుల్ మిమ్మల్ని వెంటాడుతోంది!
(image: Reuters)
  • Share this:
సీన్-1
మీరు ఓ హోటల్‌కు వెళ్తారు. భోజనం చేస్తారు. మీరు ఇంటికి వెళ్లేలోపే మీ స్మార్ట్‌ఫోన్‌లో 'ప్లీజ్ రేట్ దిస్ హోటల్' అని ఓ మెసేజ్ కనిపిస్తుంది. అది గూగుల్ నుంచి వచ్చిన మెసేజ్. మరి మీరు ఆ హోటల్‌కు వెళ్లినట్టు గూగుల్‌కు ఎలా తెలిసిపోయింది?

సీన్-2

మీరు గుడికో, టూరిస్ట్ స్పాట్‌కో వెళ్తారు. కాసేపు అక్కడ గడిపి సెల్ఫీలు తీసుకుంటారు. అక్కడి అందాలనూ మీ స్మార్ట్‌ఫోన్‌లో బంధిస్తారు. కాసేపటికే మీ స్మార్ట్‌ఫోన్‌కు 'ప్లీజ్ యాడ్ ఫోటోస్ టు మ్యాప్' అని మెసేజ్ వస్తుంది. మీరు అక్కడికి వెళ్లారని, ఫోటోలు దిగారని గూగుల్ ఎలా పసిగట్టింది?ఇవే కాదు... ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. సిటీలో ఏదో ఓ బస్టాప్‌లో కాసేపు నిలబడితే బస్సుల వివరాలు వెంటనే మెసేజ్‌లో కనిపిస్తాయి. రైల్వేస్టేషన్‌లోనూ ఇదే సీన్. ఇదంతా ఎలా సాధ్యం అంటే గూగుల్ మిమ్మల్ని అడుగడుగునా ట్రాకింగ్ చేస్తోంది కాబట్టి. మీ ఫోన్‌లో లొకేషన్ ఆన్‌లో ఉంచితే రోజులో 24 గంటలు మీ కదలికలన్నీ గూగుల్ గుప్పిట్లో ఉన్నట్టే. మీరు ప్రైవసీ సెట్టింగ్స్ చేసుకున్నా సరే గూగుల్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు గూగుల్ ప్రతీ క్షణం తెలుసుకుంటోంది.

ఆండ్రాయిడ్ డివైజ్‌లు, ఐఫోన్లలో గూగుల్ సేవలపై అసోసియేటెడ్ ప్రెస్ ఓ అధ్యయనం జరిపింది. మీరు ప్రైవసీ సెట్టింగ్స్‌లో లొకేషన్ ఆపేసినా సరే గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేస్తోందని సదరు అధ్యయనంలో తేలింది. ప్రిన్స్‌టన్‌కు చెందిన కంప్యూటర్ సైన్స్ పరిశోధకులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. వాస్తవానికి గూగుల్ ముందుగానే లొకేషన్ ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు అనుమతి అడుగుతుంది. గూగుల్ మ్యాప్స్ లాంటి యాప్స్ నేవిగేషన్ కోసం లొకేషన్ యాక్సెస్ కోసం అడుగుతుంటాయి. మీరు అంగీకరిస్తేనే లొకేషన్ టైమ్ రికార్డవ్వాలి. కానీ గూగుల్ మీ అనుమతి లేకుండానే లొకేషన్ డేటా సేవ్ చేసుకుంటుంది. ఈ డేటాను అడ్వర్‌టైజ్‌మెంట్ కోసం ఉపయోగించుకుంటుంది.

మీ లొకేషన్ ఎప్పటికీ ఆన్‌లో ఉన్నట్టైతే ఒకసారి మీరు గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్లి ఆప్షన్స్‌లో ఉన్న 'టైమ్‌లైన్‌'పై క్లిక్ చేయండి. మీరు స్మార్ట్‌ఫోన్‌లో లొకేషన్ ఆన్‌లో పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఏ సమయంలో ఎక్కడెక్కడ తిరిగారు? ఎక్కడెక్కడ ఎంత సేపు ఉన్నారు? అన్న వివరాలన్నీ అందులో ఉంటాయి.
"మీ లొకేషన్ హిస్టరీని ఎప్పుడైనా ఆఫ్ చేయొచ్చు. లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసిన తర్వాత మీరు వెళ్లే ప్రాంతాలు స్టోర్ చేయబోము" అని గూగుల్ చెబుతుంది. కానీ అది వాస్తవం కాదు. మీరు లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసినా సరే... గూగుల్ యాప్స్ కొన్ని మీ లొకేషన్ డేటాను సేకరిస్తుంటాయి. మీరు ఎక్కడైనా మ్యాప్ ఓపెన్ చేశారంటే చాలు... గూగుల్ ఆ స్క్రీన్ షాట్‌ని తీసుకుంటుంది. దాని ద్వారా మీరు ఎక్కడున్నారో గూగుల్‌కు తెలిసిపోయినట్టే కదా. వాటి ఆధారంగానే మీరు ఉన్న ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందన్న వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తుంటాయి. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా మీరు సరిగ్గా ఎక్కడ ఉన్నారో ట్రాక్‌ చేయగలుగుతుంది గూగుల్. ఆ వివరాలను మీ గూగుల్ అకౌంట్‌లో సేవ్ చేస్తుంది. గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ ఉపయోగిస్తున్న 200 కోట్ల మంది యూజర్లతో పాటు ఐఫోన్‌ ఉపయోగిస్తున్న కోట్లాది మంది గూగుల్ మ్యాప్స్ లేదా సెర్చ్ వాడుతూనే ఉంటారు. వారందరి లొకేషన్ డేటాను గూగుల్ స్టోర్ చేస్తుండటం కలవరపరుస్తోంది. "యూజర్ల ప్రాధాన్యతల్ని ఉల్లంఘిస్తూ ఇలా లొకేషన్ డేటా స్టోర్ చేసుకోవడం తప్పు. 'లొకేషన్ హిస్టరీ' ఆఫ్ చేయడం అంటే వాళ్లు వెళ్తున్న ప్రాంతాలను ట్రాక్ చేయకుండా ఉండాలి" అని ప్రిన్స్‌టన్ కంప్యూటర్ సైంటిస్ట్ జొనాథన్ మేయర్ అభిప్రాయపడ్డారు.

యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు వేర్వేరు మార్గాల్లో లొకేషన్ హిస్టరీ, వెబ్, యాప్ యాక్టివిటీని ఉపయోగించుకుంటున్నాం. వీటికి సంబంధించి ఆన్ లేదా ఆఫ్ చేసుకునేందుకు ఆప్షన్స్ కూడా ఇస్తున్నాం. ఈ హిస్టరీని ఎప్పుడైనా డిలిట్ చేసుకోవచ్చు.
గూగుల్ వివరణ


ఇలా లొకేషన్ స్టోర్ చేసుకోకూడదు అంటే "వెబ్, యాప్ యాక్టివిటీ" సెట్టింగ్‌ని కూడా టర్న్ ఆఫ్ చేయాలంటోంది గూగుల్. ఈ సెట్టింగ్‌లో గూగుల్ యాప్స్, వెబ్‌సైట్స్‌కు సంబంధించిన చాలా సమాచారం గూగుల్ అకౌంట్‌లో స్టోర్ అవుతుంది. మీ యాక్టివిటీ ఎక్కడ స్టోర్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే myactivity.google.com లో లాగిన్ అవ్వాలి.

ఇవి కూడా చదవండి:

గూగుల్‌లో మీ డేటాను ఎలా డిలిట్ చేయాలో తెలుసా?

గూగుల్ అసిస్టెంట్‌లో మరింత లోతుగా గూగుల్ న్యూస్!

మీ ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ ఉందా? ఈ న్యూస్ మీకోసమే!

Video: 'ఆండ్రాయిడ్ 9.0 పై'  ఫీచర్స్ చూడండి!

స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూస్తే కళ్లు పోతాయ్!
First published: August 14, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు