యూజర్లను ట్రాక్ చేసి కేసులో బుక్కైన గూగుల్!

యూజర్ల అనుమతి లేకుండా వారి కదలికల్ని ట్రాక్ చేస్తున్న గూగుల్... ఇప్పుడు కేసులో ఇరుక్కుంది. గూగుల్ ట్రాకింగ్‌‍‌పై ఓ వ్యక్తి శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో కంప్లైంట్ ఇచ్చాడు.

news18-telugu
Updated: August 21, 2018, 12:05 PM IST
యూజర్లను ట్రాక్ చేసి కేసులో బుక్కైన గూగుల్!
(Image: REUTERS/Charles Platiau)
  • Share this:
మీ ఫోన్‌లో లొకేషన్ ఆన్‌లో ఉంచితే రోజులో 24 గంటలు మీ కదలికలన్నీ గూగుల్ గుప్పిట్లో ఉన్నట్టే. మీరు ప్రైవసీ సెట్టింగ్స్ చేసుకున్నా సరే గూగుల్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు గూగుల్ ప్రతీ క్షణం తెలుసుకుంటోంది. గూగుల్ సేవలపై అసోసియేటెడ్ ప్రెస్ అధ్యయనం జరిపి ఆ ఫలితాలను ఇటీవల బయటపెట్టింది. ప్రైవసీ సెట్టింగ్స్‌లో లొకేషన్ ఆపేసినా సరే గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేస్తోందని ఆ అధ్యయనంలో తేలింది. వాస్తవానికి గూగుల్ ముందుగానే లొకేషన్ ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు అనుమతి అడుగుతుంది. గూగుల్ మ్యాప్స్ లాంటి యాప్స్ నేవిగేషన్ కోసం లొకేషన్ యాక్సెస్ కోసం అడుగుతుంటాయి. మీరు అంగీకరిస్తేనే లొకేషన్ టైమ్ రికార్డవ్వాలి. కానీ గూగుల్ మీ అనుమతి లేకుండానే లొకేషన్ డేటా సేవ్ చేసుకుంటుంది. ఈ డేటాను అడ్వర్‌టైజ్‌మెంట్ కోసం ఉపయోగించుకుంటోంది.

ఈ వ్యవహారం గతవారం ప్రపంచమంతా సంచలనంగా మారింది. ఆ తర్వాత గూగుల్ కూడా ఇదే విషయాన్ని ఒప్పుకొంది. అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో గూగుల్ తన హెల్ప్ పేజీలో కొన్ని వాక్యాలను మార్చింది. "గూగుల్ ఎక్స్‌పీరియెన్స్‌ని మెరుగుపర్చేందుకు" యూజర్ల లొకేషన్ డేటా ట్రాక్ చేస్తున్నామని వివరిస్తోంది. అంతకుముందు "మీ లొకేషన్ హిస్టరీని ఎప్పుడైనా ఆఫ్ చేయొచ్చు. లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసిన తర్వాత మీరు వెళ్లే ప్రాంతాలు స్టోర్ చేయబోము" అని గూగుల్ పేజీలో కనిపించేది. కానీ ప్రస్తుతం "ఈ సెట్టింగ్ మీ డివైజ్‌లోని గూగుల్ లొకేషన్ సర్వీసెస్, ఫైండ్‌ మై డివైజ్, మిగతా లొకేషన్ సర్వీసులపై ప్రభావం చూపించదు. సెర్చ్, మ్యాప్స్‌లాంటి సేవల్ని మెరుగుపర్చేందుకు మీ లొకేషన్ డేటాలో కొంత భాగాన్ని సేవ్‌ చేస్తుంటాం" అని పేజీలో కనిపిస్తోంది. అంటే గూగుల్ వివరణ చూస్తే... యూజర్ల ప్రమేయం లేకుండా లొకేషన్ ట్రాక్ చేస్తుందని అర్థమవుతోంది.

"లొకేషన్ హిస్టరీ" ఫీచర్ ఆపేసినా గూగుల్ ట్రాక్ చేయడంతో యూజర్లు మండిపడుతున్నారు. లక్షలాది మంది ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్ల కదలికల్ని అక్రమంగా ట్రాక్ చేస్తోందంటూ శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ప్రైవసీ చట్టాలను గూగుల్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి యూజర్లకు తీవ్ర నష్టం కలిగిస్తోందని, "రహస్యంగా మానిటర్" చేస్తోందని ఫిర్యాదుదారుడి వాదన. ఈ కంప్లైంట్‌పై గూగుల్ స్పందించాల్సి ఉంది.

ఇది కూడా చదవండి:గూగుల్‌లో మీ డేటాను ఎలా డిలిట్ చేయాలో తెలుసా?
First published: August 21, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు