Google Pixel 7: టెక్ దిగ్గజం గూగుల్ గత కొన్నేళ్లుగా పిక్సెల్ సిరీస్ స్మార్ట్ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థ నుంచి కొత్త సిరీస్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. సరికొత్త గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో మోడళ్లను కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేసింది. కస్టమర్లు ఈ రెండు డివైజ్‌లను ఇప్పుడు ప్రీ- బుకింగ్ చేసుకోవచ్చు. వీటి సేల్స్ ఫ్లిప్‌కార్ట్‌లో, అక్టోబర్ 13 నుంచి ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్డ్ ఫీచర్లతో వచ్చిన ఈ ప్లాగ్‌షిప్ ఫోన్ల ధరలు, ఫీచర్లు, ఇతర ప్రత్యేకతలు తెలుసుకుందాం.
డిజైన్
గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ఫోన్లు కొత్తగా రూపొందించిన టెన్సర్ G2 చిప్‌తో పనిచేస్తాయి. వీటిలో కెమెరా ముందు భాగంలో కొన్ని మార్పులు చేశారు. వీటి డిజైన్ గత సంవత్సరం రిలీజ్ అయిన పిక్సెల్ 6 ఫ్లాగ్షిప్ లైనప్ మాదిరిగానే ఉంది కానీ కొన్ని చిన్న మార్పులు ఉన్నాయి. పిక్సెల్ 3 సిరీస్ తర్వాత ఇండియాలో లాంచ్ అయిన గూగుల్ ఫ్లాగ్షిప్ ఫోన్లు ఫోన్లు ఇవే కావడం విశేషం.
పిక్సెల్ 7 ప్రో స్పెసిఫికేషన్లు
పిక్సెల్ 7 ప్రో ఫోన్ QHD+ రిజల్యూషన్‌ను అందించే 6.7 అంగుళాల LTPO డిస్ప్లేతో వస్తుంది. ఇది 10Hz నుంచి 120Hz మధ్య మారే 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ 12GB RAMతో పెయిర్ అయిన గూగుల్ టెన్సార్ G2 చిప్సెట్తో పనిచేస్తుంది. ఇది ఫోన్ పనితీరును మరింత పెంచుతుంది. ప్రో మోడల్ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50 MP ప్రైమరీ సెన్సార్, 12 MP అల్ట్రావైడ్ షూటర్, 48 MP టెలిఫోటో యూనిట్ ఉంటాయి. దీంట్లోని 10.8 MP సెల్ఫీ కెమెరా క్వాటిలీ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. ఈ ఫోన్లో 30W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మంచి బ్యాకప్‌ను అందిస్తుంది.
పిక్సెల్ 7 ఫీచర్లు
పిక్సెల్ 7 ఫోన్ FHD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.3 అంగుళాల OLED డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAMతో పెయిర్ అయిన కొత్త గూగుల్ టెన్సార్ G2 చిప్సెట్తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్లో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీల కోసం 11 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెల్ఫీ స్నాపర్‌ను అందించారు. ఈ ఫోన్లో 4,355 mAh బ్యాటరీ ఉంటుంది.
ధర ఎంత?
ఇండియాలో పిక్సెల్ 7 ఫోన్ 8GB + 128GB వేరియంట్లో, పిక్సెల్ 7 ప్రో మోడల్ 12GB + 128GB వేరియంట్లో లభిస్తాయి. గూగుల్ పిక్సెల్ 7 ఫోన్ ధర రూ. 59,999, పిక్సెల్ 7 ప్రో ధర రూ. 84,999గా ఉంది. వీటిపై కంపెనీ లిమిటెడ్ పీరియడ్ లాంచ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. పిక్సెల్ 7 కొనుగోలుపై కస్టమర్లు రూ. 6,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పిక్సెల్ 7 ప్రో కొనుగోలుపై రూ. 8,500 క్యాష్‌బ్యాక్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ , ఇతర సెల్లింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో మరిన్ని ఆఫర్లతో తాజా ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, New smartphone, Smartphones