యూజర్ల డేటా ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ టెక్ కంపెనీలు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా గూగుల్ ఫోటోస్ యూజర్లకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది టెక్ దిగ్గజం గూగుల్. గూగుల్ లాక్డ్ ఫోల్డర్ పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఈ ఫీచర్ మీ యూజర్ గ్యాలరీలోని ప్రైవేట్ ఫోటోలు ఇతరులకు కనిపించకుండా దాచిపెడుతుంది. తద్వారా మీ పర్సనల్ ఫోటోలు ఇతరులకు కనిపించకుండా కాపాడుకోవచ్చు. ఈ అద్భుతమైన లాక్డ్ ఫోల్డర్ ఫీచర్‌ను మొదట గూగుల్ పిక్సెల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే దీన్ని త్వరలోనే ఇతర ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు సైతం అందుబాటులోకి తేనుంది. ఆండ్రాయిడ్ 6 లేదా తర్వాతి వెర్షన్లపై పనిచేస్తున్న డివైజెస్‌లో ఈ ఫీచర్ రానుంది. దీంతో త్వరలోనే షియోమి, ఒప్పో, వన్‌ప్లస్, శామ్సంగ్ వంటి ఇతర ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.
ఇప్పటికే కొంతమంది వన్‌ప్లస్, శామ్సంగ్ యూజర్లు ఈ ఫీచర్‌ను అందుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫీచర్‌ను గత మే నెలలో నిర్వహించిన గూగుల్ ఇన్పుట్/అవుట్‌పుట్ ఈవెంట్లోనే ప్రకటించింది. దీని ద్వారా ఇతరులు చూడకూడదని యూజర్లు అనుకున్న ఫోటోలకు లాకర్ ఫోల్డర్‌తో భద్రత కల్పించవచ్చని తెలిపింది. మీ మిత్రులు ఎవరైనా మీ ఫోన్లో ఫోటో గ్యాలరీ చూస్తున్నప్పుడు లాకర్ ఫోల్డర్లో ఉంచిన ఫోటోలు కనిపించకుండా కాపాడుకోవచ్చు. గూగుల్ ఫోటోస్‌లో ప్రవేశపెట్టిన లాక్ ఫోల్డర్ ఫీచర్‌తో మీరు పాస్‌కోడ్ సేఫ్టీ స్పేస్‌కు ఫోటోలను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తద్వారా మీరు మీ ఫోన్లోని ఫోటోలు లేదా ఇతర యాప్‌లను స్క్రోల్ చేసే క్రమంలో వాటిని ఇతరులకు కనిపించకుండా చేయవచ్చు.
నాన్ ఫిక్సెల్ ఫోన్లలో సైతం అందుబాటులోకి..
స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ ఫీచర్ కోసం ముందుగా గూగుల్ ఫోటోస్ ఓపెన్ చేసి దానిలోని లైబ్రరీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో యుటిలిటీస్‌పై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే లాకర్ ఫోల్డర్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేశాక పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. తర్వాత లాకర్ ఫోల్డర్లో ఉంచాలనుకున్న ఫోటోలను సెలెక్ట్ చేసి అందులోకి తరలించాలి. ఈ ఫీచర్లో స్టోర్ చేసిన ఫోటోలు బ్యాకప్‌లో కనిపించవు. ఒకవేళ ఈ ఫోటోలను మీరు స్టోర్ చేయాలనుకుంటే ప్రత్యేక ఫోల్డర్లో స్టోర్ చేసుకోవాలని గూగుల్ సూచించింది.
ఒకవేళ ఫోన్ నుంచి గూగుల్ ఫోటోస్ యాప్ డిలీట్ చేస్తే, లాకర్ ఫోల్డర్‌లోని ఫోటోలు కూడా ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయని గూగుల్ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ డివైజ్‌లలో, నాన్ పిక్సెల్ ఫోన్లలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్.. ఈ ఏడాది చివరి నాటికి ఐఓఎస్ వెర్షన్లో కూడా అందుబాటులోకి రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.