ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల్లో కోట్లాది మంది విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. అలాంటి వారికి అనువుగా ఉండేలా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్తగా The Anywhere School అనే దాన్ని తీసుకొచ్చింది. గూగుల్ మీట్, క్లాస్ రూమ్, జీ సూట్ వంటి వాటిలో 50 కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 250 దేశాల్లో గూగుల్ వినియోగదారుల కోసం దీన్ని ప్రవేశపెట్టింది. వచ్చే సెప్టెంబర్‌లో గూగుల్ వీడియో కాలింగ్ యాప్ గూగుల్ మీట్లో కొత్త అప్ డేట్స్ రానున్నాయి. 49 వరకు ఒకేసారి కనిపించేలా, ఇంటిగ్రేటెడ్ జామ్ బోర్డు వైట్ బోర్డు ఫీచర్ రానుంది. కొత్త కంట్రోల్స్‌ను కూడా వినియోగదారులకు అందించనుంది. దీని వల్ల మోడరేటర్స్ ఎప్పుడూ ముందే జాయిన్ కావచ్చు. అందరికీ ఒకేసారి మీటింగ్ కట్ చేయవచ్చు. ఇన్ మీటింగ్ చాట్‌ను డిజేబుల్ చేయవచ్చు. ఇలాంటి ఇలాంటి చాలా ఫీచర్లు రానున్నాయి. అక్టోబర్‌లో గూగుల్ మీట్లో కస్టమ్, బ్లర్డ్ బ్యాక్ గ్రౌండ్స్ అందుబాటులోకి తేనుంది. బ్రేక్ ఔట్ రూమ్స్, అటెండెన్స్ ట్రాకింగ్ లాంటి ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే ఏడాది జీ సూట్ ఎంటర్ప్రైజ్ ఎడ్యుకేషన్ కస్టమర్స్ కోసం సరికొత్త ఫీచర్స్ తేనుంది. వీటితోపాటు తాత్కాలికంగా రికార్డు చేసుకునే ఫీచర్‌ను కూడా ప్రవేశపెడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా గూగుల్ క్లాస్ రూమ్ ప్లాట్ ఫాంను చాలా మంది వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో వారి కోసం ‘చేయాల్సిన పనులు’ పేరిట క్లాసెస్ పేజీకి అదనంగా జోడించింది. దీని వల్ల విద్యార్థులకు తర్వాత ఏం వస్తుంది, మనం ఏం మిస్ అయ్యాం అనే అంశాలపై క్లారిటీ రానుంది. అలాగే టీచర్లు విద్యార్థులను తన క్లాస్‌లో జాయిన్ కావడానికి లింక్ ద్వారా ఆహ్వానించవచ్చు. గూగుల్ క్లాస్ రూమ్ ప్రస్తుతం 44 భాషల్లో అందుబాటులో ఉండగా, మరో పది భాషల్లో త్వరలో వినియోగదారులకు సేవలు అందించనుంది.