ఎక్కడో పెట్టి మరచిపోయిన, లేదంటే అపహరణకు గురైన ఆండ్రాయిడ్ మొబైల్‌ను ఆన్లైన్ వెతికి పట్టుకోవడానికి ‘ఫైండ్ మై డివైజ్’ అనే సర్వీసు ఉంది. దీనికి మరిన్ని అదనపు ఫీచర్లను జోడించి యాపిల్ ‘ఫైండ్ మై నెట్వర్క్’ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందులో కొత్త కొత్త ఫీచర్లను యాడ్ చేశారు. ఆండ్రాయిడ్ సర్వీసు కంటే యాపిల్ కొత్త సర్వీసులోనే ఎక్కువ ఫీచర్లే ఉన్నాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో గూగుల్ తన ‘ఫైండ్ మై డివైజ్’ సర్వీసును మరింత అప్డేట్ చేయాలని చూస్తోందట.
గూగుల్ ఫైండ్ మై డివైజ్‌లో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ డివైజెస్, ట్యాబ్స్‌ను ట్రాక్ చేయొచ్చు. ఆ డివైజ్‌లో లాగిన్ అయి ఉన్న మెయిల్ ఐడీతో ‘ఫైండ్ మై డివైజ్’ సర్వీసు/యాప్‌లో లాగిన్ అయ్యి... ఆ డివైజ్ ఎక్కడ ఉందనేది తెలుసుకోవచ్చు. అయితే ఆ మొబైల్‌కు నెట్వర్క్ కనెక్టివిటీ ఉండాలి. ఒకవేళ నెట్వర్క్ లేకపోయినా, స్విచ్ఛాఫ్ అయినా ఆఖరిగా కనెక్టివిటీ ఆగిన ప్లేస్చూపిస్తుంది. ఈ ఫీచర్లకు అదనంగా కొన్ని జోడిస్తూ... యాపిల్ కొత్త సర్వీసును తెచ్చింది. ఈ క్రమంలో ఐఫోన్లు, ఐప్యాడ్, యాపిల్ వాచ్, ఎయిర్ పాడ్స్‌తో ఇతర యాపిల్ డివైజ్‌లను ట్రాక్ చేయొచ్చు.
యాపిల్ తీసుకొచ్చిన కొత్త సర్వీసుకు ఫీడ్ బ్యాక్ బాగా వస్తుండటం, ఫైండ్ మై డివైజ్ సర్వీసులో మార్పులు చేసి చాలా రోజులు అయ్యిందనో... అందులో కొత్త ఫీచర్లు యాడ్ చేయడానికి గూగుల్ ప్లాన్ చేస్తోందట. అందులో ఆసక్తికరమైన ఓ ఫీచర్‌ను జోడిస్తోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అదే సొంత ఆండ్రాయిడ్ డివైజ్‌లతోపాటు ఇతరుల డివైజ్‌లను కూడా ట్రాక్ చేయొచ్చట. వినడానికి ఆసక్తికరంగా ఉన్న ఈ ఫీచర్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా... యూజర్ ప్రైవసీ, సెక్యూరిటీ సమస్యలు ఉంటాయని కొంతమంది భావిస్తున్నారు.
ఒకవేళ గూగుల్ ఇలా ఇతరుల మొబైల్స్‌ను ఫైండ్ మై డివైజ్‌లో తీసుకొస్తే... యాపిల్ ‘ఫైండ్ మై నెట్వర్క్’ కంటే ఎక్కువ ఫీచర్లు ఇచ్చినట్లే అవుతుంది. అయితే ఇప్పటికే గూగుల్ తన ప్లే సర్వీసెస్ కొత్త వెర్షన్లో ఈ మార్పులు చేసిందని సమాచారం. 21.24.13 (బీటా) వెర్షన్లో ఈ అదనపు ఫీచర్‌కు సంబంధించిన కోడింగ్ ఉందని అంటున్నారు. అయితే ఈ సర్వీసు బీటా పరీక్షల వరకే ఆగిపోతుందా.. లేక లైవ్‌లోకి వస్తుందా అనేది చూడాలి. అయితే ఇతరుల డివైజ్ వివరాలను చూడటానికి గూగుల్ అదనంగా ఏదైనా సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకొచ్చి.. అప్పుడే ఈ ఆప్షన్‌ను లైవ్‌లోకి తీసుకురావచ్చని తెలుస్తోంది. అంటే బ్యాకప్ కోడ్స్ లాంటివి అన్నమాట.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.