టాప్ సెర్చ్ ఇంజన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ యూజర్ల నుంచి వారి వ్యక్తిగత ఫేస్‌బుక్ వివరాలను తస్కరిస్తున్న కొన్ని యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇందులో కొన్ని ఇమేజ్-ఎడిటింగ్ యాప్స్ ఉండగా.. జాతకం, దిన ఫలాలు తెలిపే యాప్స్, పెర్ఫామెన్స్ ఆప్టిమైజేషన్ ఫీచర్లతో కూడిన యాప్స్ కొన్ని ఉన్నాయి. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ డాక్టర్ వెబ్ ఈ వివరాలను వెల్లడించింది. ఫేస్‌బుక్ వివరాలను తస్కరిస్తున్న తొమ్మిది యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించిందని పేర్కొంది. యూజర్లు ఈ యాప్స్‌పై క్లిక్ చేయగానే ఫేస్‌బుక్ సైన్ ఇన్ పేజ్ ఓపెన్ అవుతుందని, ఆ సైన్ ఇన్ పేజ్‌లో లాగిన్ అయితే ఆ వివరాలను సదరు యాప్స్ తస్కరిస్తున్నాయని డాక్టర్ వెబ్ వివరించింది. అందుకే.. ప్లే స్టోర్‌లో ఉన్న యాప్స్ అయినా సరే నమ్మకమైన వాటిని మాత్రమే డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించాలని డాక్టర్ వెబ్ సూచిస్తోంది. ఇదిలా ఉంటే.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్స్‌ను తొలగించినప్పటికీ మళ్లీ మరో పేరుతో రావనే గ్యారంటీ లేదని, డెవలపర్ అకౌంట్ కోసం మరో కొత్త పేరుతో కేవలం 25 డాలర్లు చెల్లించి మళ్లీ చొరబడే అవకాశం లేకపోలేదని డాక్టర్ వెబ్ చెబుతోంది. అందుకే.. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
గూగుల్ బ్యాన్ చేసిన ఈ యాప్స్‌లో PIP Photo అనే యాప్‌ను ఎక్కువ మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. PIP Photo అనే యాప్‌ను 5.8 మిలియన్ల సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిసింది. Processing Photo అనే యాప్‌కు కూడా 500,000 సార్లుకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తేలింది. ఇక మిగిలిన యాప్స్ విషయానికొస్తే.. Rubbish Cleaner అనే యాప్ 100,000 పైగా downloads, Inwell Fitness అనే యాప్ 100,000 పైగా downloads, Horoscope Daily అనే యాప్ 100,000 పైగా downloads, App Lock Keep అనే యాప్ 50,000 పైగా downloads, Lockit Master అనే యాప్ 5,000 పైగా downloads, Horoscope Pi అనే యాప్ 1,000 downloads, App Lock Manager అనే యాప్‌కు 10 downloads ఉన్నట్లు డాక్టర్ వెబ్ గుర్తించింది.
ఈ తొమ్మిది యాప్స్‌పై గూగుల్ తాజాగా నిషేధం విధించింది. ఈ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించడమే కాకుండా, డెవలపర్స్‌ను కూడా బ్యాన్ చేసినట్లు గూగుల్ ప్రతినిధి తెలిపారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్స్‌ను తమ ఫోన్ల నుంచి అన్ ఇన్‌స్టాల్ చేసుకోవడం శ్రేయస్కరం. ప్లే స్టోర్‌లో గూగుల్ బ్యాన్ చేసిన తొమ్మిది యాప్స్ జాబితా ఇదే..
1. PIP Photo
2. Processing Photo
3. Rubbish Cleaner
4. Inwell Fitness
5. Horoscope Daily
6. App Lock Keep
7. Lockit Master
8. Horoscope Pi
9. App Lock Manager
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FAKE APPS, Google, Google Play store, Technology