గూగుల్ సంచలనం: డ్రోన్ ద్వారా హోం డెలివరీ

రెండు, మూడు నెలల్లో తొలి పార్శిల్ డెలివరీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించింది.

news18-telugu
Updated: April 24, 2019, 1:11 PM IST
గూగుల్ సంచలనం: డ్రోన్ ద్వారా హోం డెలివరీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాడే బ్రౌజర్ దగ్గర నుంచి ఫోన్‌లో, టీవీలో చివరికి కిచెన్‌లోకి కూడా గూగుల్ దూరిపోయింది. ఇప్పుడు గాలిలోనూ చక్కర్లు కొడుతూ గుమ్మం వద్దకు డెలివరీ సేవలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఏదైనా ఆర్డర్ చేస్తే కొరియర్ బాయ్ వచ్చి డెలివరీ చేస్తున్నాడు. త్వరలో వారి స్థానంలో గూగుల్ డ్రోన్లు వచ్చి వస్తువులను వినియోగదారులకు డెలివరీ చేయనున్నాయి. ఇప్పటికే షూటింగులు, వివాహ వేడుకల్లో డ్రోన్ల వినియోగం పెరగ్గా, గగనతలం నుంచి కస్టమర్ల ఇంటి ముందు పార్శిళ్లను నేరుగా దించేందుకు ఆ సంస్థకు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌ఏఏ) సోమవారం అనుమతులు మంజూరు చేసింది. దీని ద్వారా ఎయిర్‌లైన్ అనుమతులు పొందిన తొలి డ్రోన్‌ ఆపరేటర్‌గా గూగుల్ రికార్డు సృష్టించింది. డ్రోన్ నిబంధనల ప్రకారం అమెరికాలో రద్దీ ప్రాంతాలు, నగరాలు, పట్టణాల్లో డ్రోన్లు ఎగరేయడం ఇప్పటి వరకు నిషిద్ధం.

తొలుత చిన్న చిన్న పార్శిళ్లను గమ్యం చేర్చేలా గూగుల్ ప్లాన్ చేస్తోంది. అనుమతులు దక్కడంపై ఆ సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. రెండు, మూడు నెలల్లో తొలి పార్శిల్ డెలివరీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించింది. అయితే, ప్రస్తుతానికి గూగుల్ డ్రోన్ సేవలకు యూఎస్‌లోని వర్జీనియాలోనే అనుమతి ఉండగా, దేశం మొత్తం తమ డ్రోన్లను వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఎఫ్ఏఏను కోరినట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు ‘ప్రాజెక్టు వింగ్’ అని పేరు పెట్టింది.

మరోవైపు, అమెజాన్, ఉబెర్, యూపీఎస్ తదితర సంస్థలు కూడా డ్రోన్ డెలివరీ అనుమతుల కోసం ఎఫ్ఏఏను సంప్రదిస్తున్నాయి. ‘డ్రోన్ డెలివరీ’ పేరుతో వస్తువులను వినియోగదారుల గుమ్మం ముందు చేర్చుతామని గతంలోనే అమెజాన్ పేర్కొంది. కానీ, దాని పరిశోధనలు ప్రయోగ దశలోనే ఉండిపోయాయి. 2013 డిసెంబరులోనే డ్రోన్ డెలివరీ చేయాలని భావించింది. కానీ మార్కెట్‌లోకి రాలేకపోయింది. కాకపోతే, డ్రోన్ ఎగురుతున్నపుడే రీచార్జ్ చేసే పేటెంటును 2018 సెప్టెంబరులో అమెజాన్ దక్కించుకుంది. భారత్‌లో జొమాటో కూడా డ్రోన్ డెలివరీపై ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉండగా, ఐస్‌లాండ్‌లో ఫ్లైట్రెక్స్ డ్రోన్ కంపెనీ ఏడాది కాలంగా డెలివరీ సేవల్ని అందిస్తోంది.

First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...