అత్యంత శక్తివంతమైన చాట్‌జీపీటీ(ChatGPT) లాంచ్ టైమ్ నుంచీ తనకెదీ సాటిలేదని ప్రతిసారీ నిరూపిస్తోంది. ఈ ఏఐ చాట్‌బాట్ యూజర్ల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అంతేకాదు, దీనికి ఎన్నో ఏఐ చాట్‌బాట్స్ పోటీగా వస్తున్నా.. దాని సామర్థ్యాల ముందు అవన్నీ తేలిపోతున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ (Google) కూడా చాట్‌జీపీటీని తలదన్నే సామర్థ్యాలతో చాట్‌బాట్‌ను తీసుకురాలేకపోయింది. ఈ సంస్థ ఇటీవల లాంచ్ చేసిన బార్డ్ ఏఐ (Bard AI) ఏఐ రేస్‌లో చాట్‌జీపీటీకి దరిదాపుల్లో కూడా లేదు. దీనిపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ బార్డ్ ఏఐ అంత శక్తివంతమైనదిగా లేదని ఒప్పుకుంటూ దానిని అప్‌గ్రేడ్ చేయనున్నామని పేర్కొన్నారు. బార్డ్ ఏఐ అప్‌గ్రేడ్ గురించి సుందర్ పిచాయ్ మరిన్ని వివరాలను న్యూయార్క్ టైమ్స్ పాడ్‌కాస్ట్ (Podcast)లో పంచుకున్నారు.
మరింత సమర్థంగా బార్డ్
ఏఐ చాట్‌బాట్ బార్డ్ ప్రస్తుతం లామ్‌డా (LaMDA) అనే లాంగ్వేజ్ మోడల్‌లో తక్కువ శక్తివంతమైన వెర్షన్‌ను ఉపయోగిస్తోందని సుందర్ పిచాయ్ తెలిపారు. అయితే, దీనిని త్వరలో PalM అనే మరింత అధునాతన మోడల్‌కి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అప్‌గ్రేడ్ మానవ భాషను అర్థం చేసుకోవడంలో, ప్రతిస్పందించడంలో చాట్‌బాట్‌ను మరింత సమర్థంగా తీర్చిదిద్దుతుందని వివరించారు. బార్డ్ కొత్త వెర్షన్ మరిన్ని సామర్థ్యాలను పొందుతుందని, మ్యాథ్స్ సమస్యలకు మెరుగైన సమాధానాలను ఇస్తుందన్నారు. వారం రోజుల్లో ఈ మార్పులు కనిపిస్తాయని పిచాయ్ పేర్కొన్నారు.
గూగుల్ భవిష్యత్తులో రంగంలోకి దింపనున్న కొత్త మోడల్ PaLMతో పోలిస్తే బార్డ్ AI చాట్‌బాట్‌లో ఉపయోగించిన ప్రస్తుత లాంగ్వేజ్ మోడల్ (LaMDA) తక్కువ శక్తివంతమైనదని వివరించడానికి సుందర్ పిచాయ్ ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. పిచాయ్ బార్డ్‌ను రిపేర్ చేసిన సివిక్ కారుతో, PaLMని మరింత శక్తివంతమైన కారుతో పోల్చి నవ్వులు పూయించారు. అలానే కోడింగ్, రీజనింగ్ వంటి పనులలో PalM మెరుగ్గా పని చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా పిచాయ్ ప్రకారం, మరింత అధునాతన మోడల్‌కి అప్‌గ్రేడ్ చేయడానికి ముందు తాము అప్లికేషన్లు, టాస్క్‌లను చక్కగా హ్యాండిల్ చేయగలమా లేదా అనేది నిర్ధారించుకోవడానికే గూగుల్ ఉద్దేశపూర్వకంగా తక్కువ శక్తివంతమైన మోడల్‌తో బార్డ్‌ను లాంచ్ చేసింది.
ఏఐ సమాజానికి ముప్పు!
గూగుల్ AI చాట్‌బాట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో కంపెనీ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ పాలుపంచుకున్నారని గూగుల్ CEO సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ఇటీవలి "కోడ్ రెడ్" సంఘటన మొత్తం కంపెనీ నిర్ణయం కాదని, కంపెనీలోని చిన్న సమూహం లేదా వ్యక్తి చేసిన అంతర్గత సూచన మాత్రమేనని పిచాయ్ స్పష్టం చేశారు. AI సాంకేతికత వేగవంతమైన పురోగతి, సమాజంపై దాని ప్రభావం గురించి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. దానిపై కూడా గూగుల్ సీఈఓ స్పందించారు. పిచాయ్ ఈ విషయంపై ఆందోళనలను వ్యక్తం చేస్తూ.. ఏఐ అభివృద్ధి చాలా వేగంగా జరుగుతోందని, ఇది సమాజానికి ముప్పు కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chatgpt, Google bard, Sundar pichai