Google: గూగుల్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ ఫోన్లలో గూగుల్ యాప్స్ పనిచేయవు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది 2.3.7 జింజర్‌బ్రెడ్, 2011లోపు విడుదలైన ఆండ్రాయిడ్ వెర్షన్‌లను ఉపయోగిస్తున్నారు. వీరంతా సైన్ ఇన్ చేయడానికి ప్రయత్నిస్తే ఎర్రర్స్ కనిపిస్తాయని గూగుల్ తెలిపింది.

  • Share this:
గూగుల్ సంస్థ తమ వినియోగదారుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. యూజర్లకు కట్టుదిట్టమైన భద్రత అందించడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా గూగుల్ మరో కొత్త నిర్ణయం తీసుకుంది. పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లపై నడుస్తున్న ఫోన్లలో సైన్-ఇన్ చేయడానికి యూజర్లను అనుమతించబోమని గూగుల్ ప్రకటించింది. ఇకపై ఆండ్రాయిడ్ 2.3.7 జింజర్‌బ్రెడ్, అంతకంటే తక్కువ ఆండ్రాయిడ్ వెర్షన్‌లపై పనిచేసే ఫోన్లలో గూగుల్ అకౌంట్‌కు సైన్-ఇన్ చేయడం కుదరదని వెల్లడించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 27,2021 నుంచి అమల్లోకి రానుంది. వినియోగదారుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది.

ఈ నిర్ణయం అమల్లోకి రాగానే గూగుల్ పేర్కొన్న ఫోన్లలోని యూట్యూబ్, జీమెయిల్, గూగుల్ మ్యాప్, గూగుల్ ప్లే స్టోర్ తదితర గూగుల్ యాప్ లలో సైన్ ఇన్ చేయడం కుదరదు. ఒకవేళ వినియోగదారులు సెప్టెంబర్ 27 తర్వాత గూగుల్ అప్లికేషన్లలో సైన్-ఇన్ చేయడానికి ప్రయత్నిస్తే.. యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ "ఎర్రర్" అని కనిపిస్తుంది. స్టాట్ కౌంటర్ ప్రకారం, ఐస్‌క్రీం శాండ్‌విచ్‌ (ఆండ్రాయిడ్ 4.0) కంటే ముందుగా (2011) విడుదలైన స్మార్ట్‌ఫోన్లను కేవలం 0.1 శాతం మాత్రమే వినియోగిస్తున్నారు. దీన్నిబట్టి గూగుల్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతమంది యూజర్లపై ప్రభావం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక కొత్తగా విడుదలయ్యే ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్నీ కూడా ఆండ్రాయిడ్ 10 వెర్షన్ తో వస్తున్నాయి. దీనివల్ల కొత్త యూజర్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.

ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది 2.3.7 జింజర్‌బ్రెడ్, 2011లోపు విడుదలైన ఆండ్రాయిడ్ వెర్షన్‌లను ఉపయోగిస్తున్నారు. వీరంతా సైన్ ఇన్ చేయడానికి ప్రయత్నిస్తే ఎర్రర్స్ కనిపిస్తాయని గూగుల్ తెలిపింది. అయితే అప్లికేషన్లలో సైన్ ఇన్ చేయడం కుదరక పోయినా బ్రౌజర్ ద్వారా సైన్ ఇన్ చేయొచ్చని గూగుల్ పేర్కొంది. మొబైల్ ఫోన్లను కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ (3.0+)కి అప్‌గ్రేడ్ చేయగలిగితే.. చేయండి అని గూగుల్ సంస్థ చెబుతోంది. ఆండ్రాయిడ్‌ 3.0 హనీకోంబ్‌ వెర్షన్, అంతకంటే ఎక్కువ వెర్షన్లపై నడుస్తున్న మొబైల్ ఫోన్లలో గూగుల్ అప్లికేషన్లు యాక్సెస్ చేయొచ్చని గూగుల్ తెలిపింది.

ఇకపోతే, ప్రముఖ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఆండ్రాయిడ్‌ను గూగుల్ సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఎన్నో అద్భుతమైన అప్‌డేట్స్ వచ్చాయి. అనతికాలంలోనే ఆండ్రాయిడ్ వెర్షన్స్ పేరిట కళ్ళు చెదిరే అప్‌డేట్స్ రిలీజ్ అయ్యాయి. మూడేళ్ల వ్యవధిలోనే ఆండ్రాయిడ్ 1.0, ఆండ్రాయిడ్ కప్ కేక్, దోనట్, ఎక్లయిర్, జింజర్ బ్రెడ్ వెర్షన్లు విడుదలయ్యాయి. ఇంకా ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ యాడ్ చేస్తూ గడిచిన దశాబ్ద కాలంలో 10 వెర్షన్లు విడుదల అయ్యాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 11 వెర్షన్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 12 కూడా విడుదల కాబోతోంది. దీన్నిబట్టి ఆండ్రాయిడ్ ఓఎస్ ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు.అయితే కొందరు ఇప్పటికీ పదేళ్ల కిందటి ఆండ్రాయిడ్ వెర్షన్లపై నడుస్తున్న మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. నిజానికి ఈ ఫోన్లలో ఎలాంటి భద్రత ఉండదు. హ్యాకర్లు విపరీతంగా తెలివిమీరిన నేపథ్యంలో బలహీనమైన సెక్యూరిటీ గల ఓల్డర్ ఆండ్రాయిడ్ ఫోన్లను వాడటం శ్రేయస్కరం కాదు. అందుకే గూగుల్ కొత్త ఫోన్ వెర్షన్ కల్గిన ఫోన్లకు అప్‌గ్రేడ్ కావాలని ప్రోత్సహిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published: