ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. డిజిటల్ ఇండియా కోసం రాబోయే 5-7 ఏళ్లలో ఇండియా డిజిటైజేషన్ ఫండ్ పేరుతో రూ.75వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎకోసిస్టమ్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఈ పెట్టుబడులు పెడతామని ఆయన చెప్పారు. ఇండియా డిజిటైజేషన్ కోసం ప్రత్యేక నాలుగు అంశాలపై దృష్టిపెట్టినట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.
ప్రతి భారతీయుడు తమ మాతృభాషలో సమాచారాన్ని పొందడం, భారత్‌కు అవసరమైన కొత్త సేవలు, ఉత్పత్తులను ప్రారంభించడం, డిజిటల్ చెల్లింపుల దిశగా వ్యాపారులను ప్రోత్సహించడంతో పాటు అధునాతన టెక్నాలజీతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలను కొత్త పుంతలు తొక్కించడం వంటి అంశాలపైనే ప్రధానంగా దృష్టిపెట్టినట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు.
ఇండియా డిజిటల్ ఎకానమిని పరుగులు పెట్టించేందుకు 10 బిలియన్ డాలర్లు (రూ.75,000 కోట్లు)తో డిజిటైజేషన్ ఫండ్‌ను ప్రకటిస్తున్నాం. ప్రధాని మోదీ విజన్ డిజిటల్ ఇండియాకు మద్దతిస్తున్నందుకు మేం గర్వపడుతున్నాం.
అంతకుముందు ప్రధాని మోదీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వర్చువల్ భేటీ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై వీరివురు కీలక చర్చలు జరిపారు. కరోనాతో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు.. ఆఫీసుల్లో కొత్త వర్క్ కల్చర్‌పై చర్చించారు. వ్యాపారవేత్తలు, యువత, రైతుల జీవితాలను టెక్నాలజీ ఎలా మార్చగలదన్న దానిపై సమాలోచలు చేశారు. డేటా సెక్యూరిటీ, సైబర్ సేఫ్టీపైనా చర్చించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సుందర్ పిచాయ్‌తో ఫలప్రదమైన చర్చలు జరిగాయని పేర్కొన్నారు.