ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. నెట్‌ఫ్లిక్స్ నెలవారీ మెంబర్షిప్ ఫీజు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. డిస్నీ+హాట్‌స్టార్ (Disney+ Hotstar), అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్విట్టర్ వేదికగా తెలిపింది. యూజర్ల సంఖ్యను మరింత పెంచుకోవడంలో భాగంగా సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలను తగ్గించింది. కొత్తగా సభ్యత్వం తీసుకునేవారికి గరిష్టంగా 60 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ గతంలో నెలకు రూ.199 ఉండగా.. ఇప్పుడు 25 శాతం తగ్గించి కేవలం రూ.149 వద్దే అందుబాటులోకి తెచ్చింది.
మరోవైపు, బేసిక్ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌పై కూడా ఆఫర్ ప్రకటించింది. గతంలో ఈ ప్లాన్ కోసం నెలకు రూ. 649 చెల్లించాల్సి ఉండగా.. దీనిపై 23 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్టాండర్డ్ ప్లాన్ నెలకు రూ. 499 వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా ఒకేసారి రెండు వేర్వేరు డివైజెస్‌లో 1080p క్వాలిటీ గల కంటెంట్ ఆస్వాదించవచ్చు. ఇక, ప్రీమియం ప్లాన్ గతంలో రూ. 799 వద్ద ఉండగా దీన్ని రూ. 649కి తగ్గించింది. ఈ ప్రీమియం ప్లాన్ కింద నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను ఒకేసారి నాలుగు వేర్వేరు డివైజెస్‌లో వీక్షించవచ్చు. కాగా, ఈ కొత్త ప్లాన్లను 'హ్యాపీ న్యూ ప్రైసెస్' పేరుతో ప్రవేశపెట్టింది. మరోవైపు, నెట్‌ఫ్లిక్స్ ప్రధాన పోటీదారుగా ఉన్న అమెజాన్ ప్రైమ్ నెలవారీ ప్లాన్‌ను నెలకు రూ. 179 వద్ద అందిస్తోంది.
కొత్త ప్లాన్లపై నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ "ఎక్కువ మంది యూజర్లను చేరుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ధరలను తగ్గించాలని నిర్ణయించాం. గత మూడు వారాలుగా మా ప్లాట్‌ఫామ్ నుంచి అనేక కొత్త వెబ్‌సిరీస్‌లు, నూతన కంటెంట్లు రిలీజవుతున్నాయి. అందుకే, ఎక్కువ మంది వాటిని వీక్షించేలా ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నాం. భారత ఓటీటీ ప్లాట్ఫామ్లో మరింత విస్తరించడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నాం. యూజర్లకు అందుబాటు ధరలోనే వినోదం అందించాలన్నదే మా ముందున్న ఏకైక లక్ష్యం" అని చెప్పారు.
కాగా, నెట్‌ఫ్లిక్స్ ఇటీవల ది హార్డర్ దే ఫాల్, ది ప్రిన్సెస్ స్విచ్ వంటి అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్లను విడుదల చేసింది. అతి త్వరలోనే భారతదేశానికి చెందిన ధమాకా, మీనాక్షి సుందరేశ్వర్ వంటి సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకానున్నాయి. వీటిని త్వరలోనే స్ట్రీమింగ్ చేయనుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.