ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ఆండ్రాయిడ్ యాప్ ‘గో ఎస్ఎంఎస్ ప్రో’ యాప్ ను గూగుల్ తన ప్లే స్టోర్ నుండి తీసివేసింది. ఇటీవల గూగుల్ ప్లే స్టోర్‌లో యూజర్లకు అందుబాటులో ఉన్న యాప్ లలో హానికరమైన వాటిని తొలిగిస్తూ వస్తోంది. అయినప్పటికీ కొన్ని యాప్స్ ఇంకా ప్లే స్టోర్‌లో ఉన్నాయి. ఇలాంటి హానికరమైన యాప్‌లలో ఒకటి చైనాకు చెందిన ‘గో ఎస్ఎంఎస్ ప్రో’ యాప్. మోస్ట్ పాపులర్ టెక్ట్స్ యాప్‌గా ప్రసిద్ధికెక్కిన ఈ యాప్ ఇప్పటివరకు100 మిలియన్లకు పైగా డౌన్స్లోడ్స్ను పూర్తి చేసుకుంది. అయితే, ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న యూజర్ల డేటాకు ప్రమాదం పొంచి ఉందని సింగపూర్‌కు చెందిన ట్రస్ట్వేవ్ సంస్థ సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఇటీవల వెల్లడించారు. ఈ యాప్ వినియోగించి యూజర్లు ఎక్స్ఛేంజ్ చేసుకున్న ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైళ్ళ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని వినియోగదారులను హెచ్చరించింది. ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారుల సున్నితమైన డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళి బహిర్గతం అయ్యే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. యాప్‌లోని భద్రతా లోపాల ఎత్తిచూపుతూ ‘గో ఎస్ఎంఎస్ ప్రో’కు చెందిన డెవెలపర్లకు ఆగస్టులోనే సమాచారం అందించామని భద్రతా పరిశోధకులు తెలిపారు. కాగా, భద్రతా లోపాలను పరిష్కరించుకోవడానికి ట్రస్ట్వేవ్ సంస్థ ‘గో ఎస్ఎంఎస్ ప్రో’కు 90 రోజుల గడువు ఇచ్చింది. అయినప్పటికీ, గో ఎస్ఎంఎస్ ప్రో ఎటువంటి భద్రతా చర్యలను తీసుకోలేదు. అందువల్లనే యూజర్లకు ఇప్పుడు ఈ సమాచారాన్ని చెప్పక తప్పడం లేదని సైబర్ సెక్యూరిటీ సంస్థ ట్రస్ట్ వేవ్ వెల్లడించింది.
యాప్ యూజర్లు వెంటనే డిలీట్ చేయండి..
ఏదేమైనా, గో ఎస్ఎంఎస్ ప్రో యాప్ ద్వారా యూజర్లు ఇప్పటివరకు పంపుకున్న సమస్త సమాచారం పట్ల ఏమీ చేయలేమని, అది ఆల్రెడీ పబ్లిక్‌గా లభిస్తుందని, సమాచారాన్ని ఒక యూఆర్ఎల్ లింక్ ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక డీకోడ్ లింక్ ద్వారా వినియోగదారులు ఇప్పటివరకు పంపుకున్న ఫోన్ నంబర్స్, బ్యాంక్ లావాదేవీ స్క్రీన్ షాట్స్, అరెస్ట్ రికార్డ్ వంటి సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చని వారు పేర్కొన్నారు. వీటితో పాటు యూజర్ల ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్, బ్యాంకింగ్ వంటి సున్నితమైన సమాచారానికి చెందిన వివరాలు కూడా హ్యాక్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఆ మొత్తం డేటా ఇప్పుడు పబ్లిక్‌గా ఎవరికైనా లభిస్తుందని వెల్లడైంది. అందువల్ల ఈ యాప్‌ను వాడుతున్న వారు వెంటనే దాన్ని డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Krishna Adithya
First published:November 24, 2020, 3:26 pm IST