వన్‌ప్లస్ కోఫౌండర్ కార్ల్ పీ స్థాపించిన టెక్ బ్రాండ్ నథింగ్ త్వరలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతుంది. నథింగ్ సంస్థ తన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. అయితే, కంపెనీ దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు. కానీ, కార్ల్ పీ తాజాగా చేసిన ట్వీట్లో దీనికి సంబంధించిన చిన్న హింట్ ఇచ్చాడు. "బ్యాక్ ఆన్ ఆండ్రాయిడ్" అని ట్వీట్ చేశారు.
అంతేకాదు, ఆండ్రాయిడ్, క్రోమ్‌పై పనిచేస్తున్న నథింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హిరోషి లాక్ హైమర్‌ను ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్‌కు ఆండ్రాయిడ్ అధికారిక హ్యాండిల్ రిప్లై ఇస్తూ ‘‘కార్ల్ ఐడియాపై పనిచేసేందుకు మేం సిద్దంగా ఉన్నాం." అని పేర్కొంది. మరోవైపు, ఇటీవల నథింగ్ ఇండియా జీఎం, వైస్ ప్రెసిడెంట్ ఓ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వూలోనూ దీని గురించి మాట్లాడాడు. స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసే ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నట్లు చెప్పాడు. తమ మార్కెట్‌ను విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేశాడు. దీంతో, త్వరలోనే నథింగ్ నుంచి ఓ సరికొత్త ఆండ్రాయిడ్ ఫోన్ రానుందనే పుకార్లు సోషల్‌మీడియా అంతటా వ్యాపించాయి.
Back on Android
— Carl Pei (@getpeid) February 15, 2022
ఇక, నథింగ్ నుంచి రానున్న తొలి స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఫీచర్లు ఇవేనంటూ ఆన్లైన్ లీకులు వస్తున్నాయి. ఆన్లైన్ లీకేజీలను బట్టి చూస్తే.. నథింగ్ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. మరోవైపు, ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌పై పనిచేయనుంది. కాగా, నథింగ్ ప్రస్తుతం ఇయర్‌బడ్స్ మార్కెట్లోనే ఉంది. అయితే, 2022 ఏడాదిని కార్ల్ పీ మార్కెట్ విస్తరణకు అనువైన సంవత్సరంగా భావిస్తున్నారు. ఈ బ్రాండ్ ద్వారా ఐదు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.
ఇందులో భాగంగానే నథింగ్ కంపెనీ 2021లో ఆండీ రూబిన్‌కు చెందిన ఎసెన్షియల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను కూడా కొనుగోలు చేసింది. ఇది సమీప భవిష్యత్తులో నథింగ్ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ గురించి మరింత అంచనాలను పెంచింది. కార్ల్ తన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి సోషల్ మీడియాను ఒక గొప్ప సాధనంగా ఉపయోగించుకుంటున్నాడు. అందుకే, వ్యూహం ప్రకారమే స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌పై ట్వీట్ చేసినట్లు టెక్ అనలిస్ట్‌లు చెబుతున్నారు. ఏదేమైనా, నథింగ్ నుంచి రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్‌పై మరింత స్పష్టత రావాలంటే.. నథింగ్ ఇయర్ 1 వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను లాంచింగ్ వరకు వేచి చూడక తప్పదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nothing, ONE PLUS, Smartphone