Andhra pradesh: విశాఖ మీదుగా తొలి ప్రైవేటు రైలు: పరుగులు పెట్టేది ఎప్పుడు? ధర ఎంతో తెలుసా?

విశాఖ మీదుగా తొలి ప్రైవేటు ట్రైన్

విశాఖ మీదుగా తొలి ప్రైవేట్ రైలు కూత పెట్టనుంది. విశాఖ మీదుగా ప్రయాణించే రైళ్లలో ఆదాయం ఎక్కువగా వస్తుండడంతో మొదట ఈ లైన్లపైనే ఫోకస్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ప్రైవేటు రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

  • Share this:
    ఇప్పటి వరకు ప్రైవేటు విమానాలు, ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం సాగిస్తున్నాం.. ఇకపై ప్రైవేటు రైళ్లూ కూత పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే విశాఖ మీదుగా వెళ్లేందుకు పలు రైళ్లను ప్రతిపాదించారు. విశాఖ మీదుగా ప్రయాణించే రైళ్లలో ఆదాయం ఎక్కువగా వస్తుండడంతో మొదట ఈ లైన్లపైనే ఫోకస్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ప్రైవేటు రైళ్లు పరుగులు పెట్టనున్నాయి..

    దేశవ్యాప్తంగా 2023 నుంచి ప్రైవేటు రైళ్లను తీసుకురావాలనేది రైల్వే మంత్రిత్వ శాఖ ప్రణాళిక.. అయితే ఇది ఒకేసారి కాకుండా ప్రతీ ఏటా విడతల వారీగా పలు రైళ్లను అనుమతించాలని భావిస్తున్నారు. అయితే తొలి ఏడాది విశాఖ మీదుగానే ట్రైన్ నడపాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌ వయా చర్లపల్లి టు శ్రీకాకుళం వరకు ప్రైవేటు రైలు వచ్చే అవకాశాలున్నట్టు వాల్తేరు డివిజన్ అధికారులు చెబుతున్నారు. వాల్తేరు డివిజన్‌ మీదుగా నడిచే తొలి ప్రైవేటు రైలు ఇదే కానుందని చెబుతున్నారు.

    మరో రెండేళ్లలో వాటిలో ప్రయాణాలు మొదలవనున్నట్లు వాల్తేరు రైల్వే అధికారులకు సమాచారం అందింది. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న ప్రతిపాదనల ప్రకారం.. తెలంగాణ, ఏపీ మధ్య విశాఖ మీదుగా పలు రైళ్లను ప్రతిపాదించారు. వీటితో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు వెళ్లే రైళ్లు విశాఖ మీదుగా నడవనున్నాయి.

    ప్రైవేటు ట్రైన్లు ఎలా ఉంటాయి?

    త్వరలోనే పట్టాలు ఎక్కుతున్నప్రైవేటు రైళ్లకు 16 కోచ్‌లే ఉండేలా డిజైన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇవన్నీ కూడా ఏసీ కోచ్‌లతోనే ఉంటాయట. ఈ రైళ్లను 160 కి.మీ వేగంతో నడిచేందుకు వీలుండేలా తెస్తున్నట్లు చెబుతున్నారు. సగటు వేగాన్ని అందుకున్నా.. ఇతర రైళ్లతో పోల్చితే కనీసం 10 శాతం నుంచి 20శాతం సమయం ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటిని రైల్వే పైలెట్‌లు, గార్డులే తీసుకెళ్లనున్నారు.

    ధరలు ఎలా ఉంటాయి?

    ఇప్పటికే రైల్వే ఛార్జీలు పెరిగాయని ప్రయాణికులు లబోదిబో అంటున్నారు.. ఫ్లాట్ ఫాం ధర నుంచి సాధరణ ట్రైన్ల వరకు అన్ని రేట్లు పెరిగాయి. ఇప్పుడు ప్రైవేటు రేట్లు అంటే రేట్లకు హద్దే ఉండదు అన్న సంగతి తెలిసిందే. దీంతో ధరలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి అందరిలో పెరుగుతోంది. ధరల్ని విపరీతంగా పెంచేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటి విషయమై రైల్వే అధికారులు స్పందించడానికి ఇష్టపడడం లేదు. రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వేబోర్డు ఆదేశాల మేరకు ధరల నిర్ణయం ఉంటుందని, ప్రైవేటువారు ఎలా పడితే అలా పెంచేయడానికి వీలులేదని చెబుతున్నారు. దీనిపై కచ్చితమైన మార్గదర్శకాలు వస్తాయని అంటున్నారు. మరోవైపు ఈ రైళ్లను 95శాతానికి తగ్గకుండా సమయపాలన పాటించేలా నియమాల్ని రూపొందిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు కంపెనీల తప్పిదాలకూ పెనాల్టీలు వేయనున్నారు. పారిశుద్ధ్యం, ఇతర వ్యవస్థల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు చేపట్టేలా చర్యలుంటాయని చెబుతున్నారు.

    త్వరలో పట్టాలు ఎక్కుతున్న ప్రైవేటు రైళ్లు ఇవే..
    సికింద్రాబాద్‌-శ్రీకాకుళం (డైలీ)
    విశాఖపట్నం-విజయవాడ (డైలీ)
    విశాఖపట్నం-తిరుపతి (వారానికి 3రోజులు)
    విశాఖపట్నం-బెంగళూరు (వారానికి రెండ్రోజులు)
    సికింద్రాబాద్‌-హావ్‌డా (డైలీ)
    విజయనగరం-పూరి (వారానికి 3 రోజులు)
    మైసూరు-భువనేశ్వర్‌ (డైలీ)
    హౌరా-చెన్నై (డైలీ)
    హౌరా-బెంగళూరు (డైలీ)
    షాలిమార్‌-బెంగళూరు (డైలీ)
    హటియా-బెంగళూరు (వీక్లీ)
    Published by:Nagesh Paina
    First published: