ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్ల (E-commerce Websites)లో ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలంటే మొదటగా దాని రివ్యూలు (Reviews) చదివే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే ఆ రివ్యూలే ఫేక్ (Fake Reviews) అయితే ఈ-కామర్స్ కంపెనీలతో పాటు కొనుగోలుదారులు కూడా మోసపోతారు. ఇలా వినియోగదారులు మోసపోకుండా ఫేక్ రివ్యూలకు అడ్డుకట్టవేసేందుకు భారత ప్రభుత్వం (Government) నడుం బిగించింది. ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టే కొత్త ఫ్రేమ్‌వర్క్ లేదా మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు తాజాగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ (Union Ministry of Consumer Affairs, Food and Public Distribution) తెలిపింది.
భారత్‌లోని ఈ-కామర్స్ సంస్థలు అనుసరిస్తున్న ప్రస్తుత మెకానిజం, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసిన తర్వాతనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ (DoCA) ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై ఫేక్ రివ్యూల సమస్యపై చర్చించడానికి మే 27న వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పలువురు వాటాదారులతో సమావేశమయ్యారు. మరుసటి రోజే ఈ మార్గదర్శకాల రూపకల్పన గురించి ప్రకటన వచ్చింది.
కొనుగోలు చేసిన రివ్యూలు, అన్‌వెరిఫైడ్ రివ్యూలు, ప్రోత్సాహక రివ్యూలు, నిజమైన రివ్యూలు గుర్తించడం కస్టమర్లకు కష్టతరమవుతుందనే అంశాల గురించి సమావేశంలో అధికారులు చర్చించారు. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) సహకారంతో ఈ-కామర్స్ సంస్థలు, కన్జ్యూమర్ ఫారం, న్యాయ విశ్వవిద్యాలయాలు, న్యాయవాదులు, ఎఫ్ఐసీసీఐ (FICCI), సీఐఐ (CII), వినియోగదారుల హక్కుల కార్యకర్తలు, ఇతరుల వంటి వివిధ వాటాదారులు వెబ్‌సైట్‌లలోని ఫేక్ రివ్యూల గురించి సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) సీఈఓ మనీషా కపూర్ వివిధ రకాల మోసపూరిత, తప్పుదారి పట్టించే సమీక్షలు, అలాగే అవి వినియోగదారుల ఆసక్తిని ఎలా ప్రభావితం చేస్తాయో చర్చించారు. ఈ-కామర్స్ సైట్స్‌లో ప్రొడక్ట్స్ ఫిజికల్‌గా చెక్ చేయడం అసాధ్యం. అందుకే కస్టమర్లు ఇప్పటికే ఉత్పత్తులు లేదా సేవలను కొనుగోలు చేసిన వ్యక్తుల అభిప్రాయం, అనుభవాలను చూడటానికి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై పోస్ట్ చేసిన రివ్యూలపై పూర్తిగా ఆధారపడుతుంటారని ప్రకటన పేర్కొంది. ఇలా రివ్యూలపై ఆధారపడటం వల్ల రెండు సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రివ్యూ ఇచ్చిన వ్యక్తి ఎవరు అనేది తెలియడం లేదు. అలానే ఫ్లాట్‌ఫామ్ రివ్యూల విషయంలో సరైన చర్యలు తీసుకోవడం లేదు. అయితే న్యాయమైన, పారదర్శక పద్ధతిలో ఈ-కామర్స్ సంస్థలు మోస్ట్ యూజ్‌ఫుల్ రివ్యూలను కస్టమర్లకు స్పష్టంగా కనిపించేలా ఎలా ఎంచుకున్నాయో వెల్లడించాలని అధికారులు పేర్కొన్నారు.
ఈ సమస్యను నిరంతరం పర్యవేక్షించాలని, కొనుగోలుదారుల మోసపోకుండా ఫేక్ రివ్యూల కోసం తగిన మార్గదర్శకాలను రూపొందించాలని స్టేక్ హోల్డర్లందరూ అభిప్రాయపడ్డారని ఓ నోటిఫికేషన్ పేర్కొంది. "ఫేక్ రివ్యూలను పర్యవేక్షించే మార్గదర్శకాలు తమ వద్ద ఉన్నాయని... ఈ సమస్యపై చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో పాల్గొనడానికి ఈ-కామర్స్ కంపెనీలకు చెందిన వాటాదారులు పాజిటివ్ గా స్పందిస్తున్నారని పేర్కొన్నారు" అని ప్రకటన వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: E-commerce, FAKE APPS, Reviews, Tech news