FACEBOOK META TURNED WORST COMPANY OF THE YEAR 2021 IN SURVEY FULL DETAILS HERE PRN GH
Facebook-Meta: 2021లో అత్యంత చెత్త కంపెనీగా నిలిచిన ఫేస్బుక్-మెటా.. సర్వేలో ఏం తేలిదంటే..!
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ సోషల్ మీడియా (Social Media) దిగ్గజంఫేస్ బుక్ (Facebook) ఈ ఏడాది చాలా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాదిలోనే విజిల్‌బ్లోయర్ ఫ్రాన్సెస్ హాగెన్ పలు అంతర్గత పత్రాలను లీక్ చేసి ఫేస్‌బుక్‌ను మరింత ఇరకాటంలోకి నెట్టింది.
ప్రముఖ సోషల్ మీడియా (Social Media) దిగ్గజంఫేస్ బుక్ (Facebook) ఈ ఏడాది చాలా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాదిలోనే విజిల్‌బ్లోయర్ ఫ్రాన్సెస్ హాగెన్ పలు అంతర్గత పత్రాలను లీక్ చేసి ఫేస్‌బుక్‌ను మరింత ఇరకాటంలోకి నెట్టింది. దీంతో ఫేస్ బుక్ కదలికలపై నిఘా బాగా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫేస్ బుక్ తన మాతృ సంస్థ పేరును మెటా (Facebook-Meta) గా మార్చుకుంది. అయినప్పటికీ ఈ ఏడాది మొత్తంలో మెటా కంపెనీయే అత్యంత చెత్త కంపెనీగా నిలిచింది. ఇటీవల యాహు ఫైనాన్స్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ ఘనతను మెటా సొంతం చేస్తుంది. ఈ సర్వేలో పాల్గొన్న రీడర్లు మెటా(Meta)ను వరస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ (2021)గా పేర్కొన్నారు.
డిసెంబర్ 4, 5 తేదీల్లో యాహు ఫైనాన్స్‌లో “ఓపెన్-ఎండ్” సర్వే జరిగింది. ఇందులో 1,541 మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సర్వేలో ఫేస్‌బుక్‌కు కేవలం 8% ఓట్లు మాత్రమే వచ్చాయి. రాబిన్‌హుడ్ ట్రేడింగ్ యాప్ పై కూడా యాహు ఫైనాన్స్ రీడర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ ట్రక్ స్టార్టప్ కంపెనీ నికోలా గతేడాది యాహు ఫైనాన్స్ సర్వేలో చెత్త కంపెనీగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కూడా నికోలాకి ఓటర్ల ఆగ్రహావేశాల సెగ తగిలింది.
మెటా అపకీర్తిని మూటగట్టుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ “ఫేస్బుక్ ఈ ఏడాది చాలా వివాదాల్లో నిలిచింది” అని యాహు ఫైనాన్స్ పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలోనే మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తన సరికొత్త ప్రైవసీ పాలసీని ప్రకటించింది. యూజర్ల సమాచారాన్ని సేకరించి థర్డ్ పార్టీ యాప్‌లతో షేర్ చేస్తానని ప్రకటించింది. దాంతో యూజర్ల నుంచి పెద్దయెత్తున వ్యతిరేకత వచ్చింది. విజిల్‌బ్లోయర్, మాజీ ఫేస్బుక్ ఉద్యోగి ఫ్రాన్సిస్ ఫేస్బుక్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. లాభార్జనకే ప్రాధాన్యమిస్తూ ప్రజా ప్రయోజనాలను ఫేస్బుక్ కంపెనీ పణంగా పెట్టిందని ఆమె ఆరోపించింది. ఈ కంపెనీ సమస్యాత్మక పద్ధతులను బట్టబయలు చేసే అంతర్గత పత్రాలను లీక్ చేసింది. దీనికితోడు మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ టీనేజ్ అమ్మాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వెల్లడైంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ పెద్దగా చేసిందేమీ లేదు.
"సంప్రదాయవాదులతో సహా కొంతమంది విమర్శకుల గొంతులను ఫేస్బుక్ అణచివేసిందని చాలామంది చెప్పారు." అని యాహు ఫైనాన్స్ మెటా పక్షపాత ధోరణిని హైలైట్ చేస్తుంది. కాపిటల్ బిల్డింగ్ అల్లర్లకు దారితీసిన ద్వేషపూరిత ప్రసంగాన్ని అరికట్టలేకపోయినందుకు విమర్శకులు ఫేస్బుక్ తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కూడా నిందించారు. అయితే ఇంత జరిగినా దాదాపు 30 శాతం యాహు ఫైనాన్స్ రీడర్లు ఫేస్బుక్ లేదా మెటా తన తప్పులను సరిదిద్దుకుని చెడ్డ పేరును తొలగించుకోవచ్చని సలహా ఇచ్చారు. తన నిర్లక్ష్యానికి కంపెనీ అధికారికంగా క్షమాపణలు చెప్పవచ్చు. దాని నష్టాన్ని తిప్పికొట్టడంలో భాగంగా దాని లాభాలలో కొంత మొత్తాన్ని ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వవచ్చని ఒక రీడర్ సూచించారు. మరోవైపు, యాహు ఫైనాన్స్ లీడర్లు మైక్రోసాఫ్ట్‌ను కంపెనీ ఆఫ్ ది ఇయర్ (2021)గా ఎంచుకున్నారు. సత్య నాదెళ్ల నేతృత్వంలోని కంపెనీ ఈ ఏడాది ట్రిలియన్ మార్కును తాకింది. అలాగే బెస్ట్ అప్గ్రేడ్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. విండోస్ 11 ఓఎస్ అప్డేట్ రిలీజ్ చేసి వినియోగదారులను మెప్పించింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.