ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కచ్చితంగా ఆ యూజర్ వయసు 13 ఏళ్లు దాటి ఉండాలి. అంత కంటే చిన్నవారికి ఫేస్బుక్ ఖాతా ఇవ్వదు. అయితే కొంతమంది తమ వయసు తప్పుగా చూపించి ఖాతాలు తెరుస్తున్నారు. ఈ విషయంలో చాలా రోజులుగా ఫేస్బుక్ సూచనలు చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఇలాంటి వాటికి చెక్ చెప్పడానికి ఫేస్బుక్ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను సిద్ధం చేస్తోందని సమాచారం. దాని ప్రకారం వయసు తప్పుగా చెప్పేస్తే గుర్తు పట్టేస్తుందట.
ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరవాలంటే 13 ఏళ్లు నిండి ఉండాల్సిందే. ఇలా కాకుండా తక్కువ వయసు ఉన్నవారు ఓపెన్ చేసిన అకౌంట్లను గుర్తించడానికి ఫేస్బుక్ ఏఐని సిద్ధం చేస్తోంది. దాంతో యూజర్ల వయసు తెలుసుకొని.. ఒకవేళ 13 ఏళ్ల కంటే తక్కువ ఉంటే... వారికి ప్రత్యేకమైన ఫీచర్లు అందించడానికి ప్రయత్నాలు చేస్తోందట. దీని కోసం ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో కలసి ఫేస్బుక్ పని చేయబోతోంది. దీంతోపాటు ఇంటర్నెట్ బ్రౌజర్లు, ఇతర సంస్థలతో సమాచారాన్ని షేర్ చేసుకొని... వాళ్ల నుంచి అవసరమైన సమాచారం తెలుసుకొని యూజర్ల వయసు లెక్కిస్తారట. ఈ కొత్త టూల్‌పై ఫేస్బుక్ మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
సోషల్ మీడియా ఖాతాల ఓపెనింగ్‌కి ఐడీ తీసుకోవాలనే వాదన కూడా ఉంది. దీనిపై ఫేస్బుక్ టీమ్ స్పందించింది. అయితే ఇలా ఐడీలు తీసుకోవడం వల్ల సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు నిపుణులు. అలా అని సరైన ఐడీలు సబ్మిట్ చేస్తారని కూడా నమ్మలేం అని చెబుతున్నారు. అలాగే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచినప్పుడు పుట్టిన తేదీ అడుగుతున్నాం.. అయితే అక్కడ ఇచ్చే తేదీ నిజమేనా అనేది క్రాస్ చెక్ చేయడం అంత సులభం కాదు అని ఫేస్బుక్ టీమ్ చెబుతోంది. వయసు తప్పు చెప్పినవాళ్లను అడగడం కాకుండా.. వారి వయసు తెలుసుకొని తాము ఉత్తమ సర్వీసులు ఇవ్వాలని అనుకుంటున్నామని చెప్పారు.
ఒకవేళ పిల్లలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడుతుంటే... వారి తల్లి దండ్రుల ఆధ్వర్యంలో ఉత్తమంగా మా సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నామని ఫేస్బుక్ టీమ్ చెబుతోంది. తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పిల్లలు సోషల్ మీడియాను వాడితే వచ్చే ఉపయోగం చెప్పడమే తమ ఉద్దేశమని చెబుతున్నారు. ప్రస్తుతం ఫేస్బుక్ 18 ఏళ్ల లోపు యూజర్లు, 18 ఏళ్లు దాటిన యూజర్లను గుర్తించే సాంకేతికను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 13 ఏళ్ల లోపు యూజర్లను గుర్తించే ప్రక్రియ జరగనుంది. దీని కోసం మెనూలో ఓ ఆప్షన్ కూడా ఇస్తారట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.