ప్రముఖ సోషల్ మీడియా వేధిక ట్విట్టర్ (Twitter) ను టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం (Indian Government) తాజాగా స్పందించింది. మేనేజ్మెంట్లతో సంబంధం లేకుండా సోషల్ మీడియా (Social Media) వేధికలు పాటించాల్సిన నిబంధనలు, చట్టాలు అలాగే కొనసాగుతాయని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. యజమానులుగా ఎవరు ఉన్నా కూడా దేశ చట్టాలను పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అతి త్వరలో సవరించిన ఐటీ నిబంధనలు విడుదల కానున్నట్లు మంత్రి వివరించారు. ఇదిలా ఉంటే.. ప్రముఖ సోషల్ నెట్వర్క్ కంపెనీ 'ట్విటర్' (Twitter) టెస్లా సీఈవో ఎలన్ మస్క్ (Elon Musk) చేతుల్లోకి వెళ్లింది. ట్విటర్ కొనుగోలు డీల్‌ను పూర్తిచేస్తామని చెప్పిన ఆయన.. గురువారం శాన్ఫ్రాన్సిస్కోలోని హెడ్ ఆఫీస్‌కు వెళ్లారు.
ఆ తర్వాత ట్విటర్‌ను పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఆయన ఆఫీసుకు వెళ్లిన కొన్ని గంటల్లోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ (Parag Agrawal), సీఎఫ్‌వో నెడ్ సెగల్ (Ned Segal),లీగల్ పాలసీ, ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగం అధిపతి విజయ గద్దె (Vijaya Gadde), జనరల్ కౌన్సెల్ సియాన్ ఎడ్జెట్‌ను ఎలన్ మస్క్ తొలగించారు. పరాగ్ అగర్వాల్, నెడ్ సెగల్ ఇప్పటికే ఆఫీసును వదిలిపెట్టి వెళ్లిపోయారు. పరాగ్ అగర్వాల్, విజయ గద్దె.. వీరిద్దరు భారతీయులు.
పరాగ్ అగర్వాల్ దాదాపు పదేళ్లుగా ట్విటర్లో పనిచేస్తున్నారు. గతంలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న ఆయన.. గత ఏడాది నవంబరులో ట్విటర్ సీఈవోగా బాధత్యలు చేపట్టారు. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను తొలగించడంలో లీగల్ పాలసీ, ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగం అధిపతిగా విజయ గద్దె కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆమెను కూడా విధుల నుంచి ఎలన్ మస్క్ తప్పించడం చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central governmennt, Social Media, Twitter