Instagram Influencers: ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాకే..!

ఇన్‌స్టాగ్రామ్ లోగో

Instagram: ఫాలోవర్ల సంఖ్యను బట్టి ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆదాయంలో భారీ తేడాలు ఉంటాయని సర్వేలో వెల్లడైంది.

  • Share this:
ఫొటో షేరింగ్ ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ లో ఇన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనితో ఇన్‌స్టాగ్రామ్ మార్కెట్ లో గతంలో కంటే ఎక్కువ పోటీ కనిపిస్తోంది. అయితే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ నిజంగా ఎంత డబ్బు సంపాదించగలరు? అనే ఆసక్తికరమైన విషయాలను తాజాగా హైప్ ఆడిటర్ సర్వే వెల్లడించింది.

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లను మినీ సెలబ్రిటీలుగా పేర్కొనవచ్చు. వీరు తమ టాలెంట్‌తో లక్షలాది ఫాలోవర్లను సంపాదిస్తారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్స్ ని ప్రభావితం చేయగలరు. వీరు తమ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్స్ ని ఆకర్షణీయమైన పోస్టులు, అద్భుతమైన వార్డ్‌రోబ్‌ల(బట్టలగది) ఫొటోలతో నింపేస్తుంటారు. పలు కంపెనీల నుంచి తమకు అందే ఎన్నో బహుమతులకు సంబంధించి పోస్టులు పెడుతుంటారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వారి లైఫ్ స్టైల్ పరిశీలిస్తేనే.. వారు బాగా డబ్బు సంపాదిస్తున్నారని సులభంగా అర్థమవుతుంది. కానీ, వారు నిజంగా ఎంత డబ్బు సంపాదిస్తున్నారు? అనే విషయాన్ని తెలుసుకోవడానికి హైప్ ఆడిటర్ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో 1,865 మంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పాల్గొన్నారు. ఈ సర్వేలో వారి సంపాదన, పని భారం, వెచ్చించిన సమయం, మెయిన్ ఇన్‌కమ్ సోర్స్ గురించి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 1,865 ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో 45.74% ఆడవారు ఉన్నారు. వారిలో 28% మంది వయసు 25 నుంచి 34 సంవత్సరాలలోపే ఉండటం విశేషం. తాము ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా డబ్బులు సంపాదిస్తామని సర్వేలో పాల్గొన్న ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో 48.5 శాతం మంది వెల్లడించారు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ సగటున నెలకు 2,970 డాలర్లు (సుమారు రూ.2.2 లక్షలు) సంపాదిస్తారని సర్వేలో తేలింది. అయితే ఫాలోవర్ల సంఖ్యను బట్టి ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆదాయంలో భారీ తేడాలు ఉంటాయని సర్వేలో వెల్లడైంది.

1000 నుంచి 10,000 మంది ఫాలోవర్లు ఉన్నవారిని మైక్రో-ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అంటారు. వీరు నెలకు సగటున 1,420 డాలర్లు సంపాదిస్తారు. పదిలక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నవారిని మెగా-ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అంటారు. వీరు నెలకు సగటున 15,356 డాలర్లు సంపాదిస్తారని సర్వే తెలిపింది. మైక్రో-ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా డబ్బులు సంపాదించడం చాలా అరుదని సర్వే గణాంకాల ప్రకారం తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్న మైక్రో-ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో కేవలం 22.99% మంది మాత్రమే తాము ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నామని వెల్లడించారు. 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఫాలోవర్స్ కలిగివున్న వినియోగదారులలో 68.75% డబ్బులు సంపాదిస్తున్నారు.

ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏ రంగంలో కొనసాగుతున్నారనే విషయాలు కూడా నెలవారీ ఆదాయాన్ని నిర్దేశిస్తాయి. ఉదాహరణకు సగటు ఇన్‌ఫ్లుయెన్సర్ గంటకు $39 సంపాదిస్తే.. బ్యూటీ రంగానికి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రం గంటకు $60 సంపాదిస్తాడు. ఇంకో రంగానికి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ గంటకి 187 డాలర్లు సంపాదించగలడు. యానిమల్స్, బిజినెస్, మార్కెటింగ్, ఫిట్‌నెస్, క్రీడ రంగాలకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్లు బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా బాగా డబ్బులు సంపాదిస్తున్నారని సర్వేలో తేలింది.

సర్వే ప్రకారం, 4.27% మంది మాత్రమే కేవలం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వచ్చిన డబ్బుతోనే జీవిస్తున్నారు. వీరంతా కూడా నెలకు సగటున $5,912.8 సంపాదిస్తున్నారు. కరోనా సమయంలో వీరి ఆదాయం మరింత పెరిగింది. ఏది ఏమైనా, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు లక్షల రూపాయలు సంపాదిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published: