ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఎయిర్ ఇండియాను(Air India) ఇటీవలే వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎయిర్ ఇండియా విమాన సంస్థ తన ప్రయాణికులను ఓ విషయంపై అలర్ట్ చేసింది. బిల్డర్ ఏఐ అనే కంపెనీ తమ సంస్థ పేరు చెప్పుకుని తప్పుడు ప్రకటనను ప్రచారం చేస్తోందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని ప్యాసింజర్లను కోరింది. ఎయిర్ ఇండియా విమానంలో ఉచితంగా టికెట్లను అందుకునే అవకాశముందని, ఇందుకోసం ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని బిల్డర్ ఏఐ(Builder ai) అనే కంపెనీ ఓ యాడ్‌ను ప్రచారం చేస్తోంది. ఎయిర్ ఇండియా కోసం ఓ ప్రొటోటైప్ యాప్‌ను(Prototype App) రూపొందించామని, ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే ఉచితంగా టికెట్ లభిస్తుందని అడ్వర్టైజ్మెంట్‌లో పేర్కొంది.
అయితే అలాంటి ఆఫర్ ఏం లేదని ఎయిర్ ఇండియా తన స్పందనను తెలియజేసింది ఎవ్వరికీ ఉచితంగా టికెట్లు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. బిల్డర్ ఏఐ పేరుతో రన్ చేస్తున్న యాప్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదని, ప్రయాణికులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తన అధికారిక ట్విట్టర్ పేజీలో పేర్కొంది. బిల్డర్ ఏఐతో తమకు ఎలాంటి భాగస్వామ్యం లేదని, ప్రకటనపై వారికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపింది.
Hey @airindiain it’s finally here!
Our gift made with ? for you: https://t.co/Q52po3NgRx #BuilderLovesAirIndia pic.twitter.com/9I3HPYxNoR
— Builder.ai (@Builderai) February 17, 2022
ట్విట్టర్‌లో ఎయిర్ ఇండియా స్పష్టత..
"ప్రొటోటైప్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఉచిత టికెట్లు లభిస్తాయనే వార్త నిజం కాదు. ప్రింట్, డిజిటల్ మీడియాలో ఈ ప్రకటనకు సంబంధించిన ప్రచారం నడుస్తోంది. బిల్డర్ ఏఐ అనే కంపెనీ ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా కోసం పనిచేస్తుందని తెలిపింది. అంతేకాకుండా కొన్ని వార్తాపత్రికల్లో క్యూఆర్ కోడ్‌ను కూడా పెట్టింది. ఆ కోడ్ డైరెక్టుగా ప్రొటోటైప్ యాప్‌కు లింక్ అవుతుంది. ఫలితంగా మీ డేటా చౌర్యానికి గురయ్యే అవకాశముంది. అక్కడ ఎయిర్ ఇండియా లోగో కూడా ఉంది. ఆ యాప్‌ను మాకు తెలియకుండా రూపొందించారు. కాబట్టి సదరు యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మోసపోవాల్సి వస్తుంది. ఇందుకు ఎయిర్ ఇండియా బాధ్యత వహించదు. మీ డేటాను మిస్ యూజ్ చేయవచ్చు, ఆర్థిక మోసాలకు వినియోగించవచ్చు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి" అని ఎయిర్ ఇండియా తన ట్విట్టర్‌లో ప్రకటనను విడుదల చేసింది.
#FlyAI : Public Notice regarding advertising campaign of @Builderai pic.twitter.com/5JpVguXgvS
— Air India (@airindiain) February 17, 2022
ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న వేళ సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ విషయంపై జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఉచితంగా వస్తున్న ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అపరిచిత సందేశాలు, సైట్ లింక్స్ వస్తే వాటిని చూసిన వెంటనే డిలీట్ చేయడం మంచిది. ఎవరైనా ఫోన్ చేసి మీ వ్యక్తిగత బ్యాంక్ సమాచారం లేదా మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ లాంటివి చెప్పమంటే వాటిని అస్సలు చెప్పకూడదు. అన్ ఆథరైజ్డ్ సోర్స్ నుంచి ఎలాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Air India, Flight tickets