మొబైల్ లేదా ట్యాబ్ కొన్న కొద్దిరోజుల్లోనే పని చేయకపోతే.. వాటిని రీప్లేస్/భర్తీ చేయించాలంటే భారీగా డబ్బులు కట్టక తప్పదు. లేదా రిపేర్ (Repair) చేయదలిస్తే సర్వీస్ సెంటర్ వెతుక్కుంటూ చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి వినియోగదారులు వాటిని బయట షాపుల్లో రిపేర్ చేయిస్తుంటారు. వాటిలో మళ్లీ పెద్ద సమస్య తలెత్తితే.. వేరే దగ్గర రిపేర్ చేయించారని చెబుతూ వాటిని బాగు చేసేందుకు అధికారిక కంపెనీలు ఒప్పుకోవు. అప్పుడు కొత్తవి కొనాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే భారత ప్రభుత్వం తీసుకురానున్న 'రిపేరు హక్కు (Right to Repair)' సాయంతో మీరు సరిగా పనిచేయని మీ మొబైల్ (Mobile)లేదా ట్యాబ్‌ను ఎక్కువ ఖర్చు లేకుండా ఎక్కడైనా రిపేర్ చేయించుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఈ హక్కు అమల్లోకి వస్తే ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీదారులు తమ వస్తువుల రిపేర్‌పై కృత్రిమంగా లేదా ఉద్దేశపూర్వకంగా పరిమితులు విధించలేరు. అంటే పాడైపోయిన వస్తువులను కంపెనీ అవుట్‌లెట్స్‌లోనే రిపేర్ చేయాలని, లేదంటే వారంటీ, గ్యారంటీ వర్తించదనే రూల్స్ పెట్టలేరు. తద్వారా పాత వాటిని తక్కువ ఖర్చులో కావాల్సిన చోట రిపేర్ చేయించడం వినియోగదారులకు సాధ్యపడుతుంది. అలానే కొత్త మోడల్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం రాదు. ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లు మాత్రమే కాదు ఏ ఎలక్ట్రానిక్ వస్తువులైనా సరే వాటిని రిపేర్ చేయించుకునేలా ప్రభుత్వం విధివిధానాలను తీసుకురానుంది.
వినియోగదారులు తమ వస్తువులను ఎక్కువకాలం వాడేందుకు, రిపేర్ రంగంలో ఉపాధి అవకాశాలు సృష్టించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ 'రైట్ టు రిపేర్ (Right To Repair)'పై సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మరమ్మతు హక్కు విధివిధానాల గురించి కమిటీ సమాలోచనలు చేస్తోంది. ఈ మేరకు తొలి సమావేశం కూడా నిర్వహించింది.
జులై 13న జరిగిన మొదటి సమావేశంలో వ్యవసాయ పరికరాలు (Farming Equipment), మొబైల్ ఫోన్లు, టాబ్లెట్‌లు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్స్, ఆటోమొబైల్ పరికరాలు వంటి వివిధ రంగాలను రైట్ టు రిపేర్ కిందకు తీసుకురావాలని కమిటీ భావిస్తోంది. తయారీదారుల పారేసే సంస్కృతికి స్వస్తి చెప్పడం కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనర్థం కంపెనీలు రిపేర్ వస్తే వస్తువులను పడేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఒక నిర్దిష్ట సమయం దాటిన ఎలక్ట్రానిక్ వస్తువులను పక్కన పారేసేలా బలవంతం చేస్తాయి. అయితే ఆ సంస్కృతిని ఇకపై మార్చేసి వస్తువులు రిపేరొచ్చినా లేదా బాగా పాతవైనా వాటిని మళ్లీ బాగు చేయించుకొని వాడుకునే సంస్కృతి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రిపేర్లు చేయడానికి వినియోగదారులు, రిపేర్ షాపులకు సహాయపడే మాన్యువల్‌లను ప్రచురించడానికి కంపెనీలు ఒప్పుకోవడం లేదు. విడిభాగాలపై యాజమాన్య నియంత్రణ, మరమ్మతులపై గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే కమిటీ సమావేశంలో ఈ అంశాలు ప్రత్యేక దృష్టికి వచ్చాయి. ఈ మాన్యువల్స్ లేకపోవడం వల్ల ఇతరులు సరిగా రిపేరు చేయలేకపోతున్నారు. లేదా రిపేర్ చేసే సమయంలో ఎలక్ట్రానిక్(Electronic) ప్రొడక్ట్స్ పాడైపోతున్నాయి. అయితే కంపెనీలు మాన్యువల్స్‌ను ప్రచురించి, విడిభాగాలు యూజర్లకు, రిపేరు షాపు ఓనర్లకు అందుబాటులో ఉంచితే బాగు చేసుకోవడం సులభమవుతుంది. ఈ విషయాలనే కమిటీ సమావేశంలో అధికారులు చర్చించారు. నిజానికి భారతదేశంలో రీసైకిల్, రీయూజ్ విలువను నొక్కిచెప్పే 'లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ (LiFe)' అనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలో 'రిపేర్ హక్కు' ఒక భాగంగా ఉంటుంది.
ఈ హక్కును ఇప్పటికే విదేశాలు అమలు చేస్తున్నాయి. కాగా కొత్త కమిటీ అంతర్జాతీయంగా అత్యుత్తమ అభ్యాసాల నుంచి నేర్చుకోవడం.. వాటిని భారతీయ మార్కెట్లకు అనుగుణంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కమిటీకి వినియోగదారుల వ్యవహారాల అదనపు కార్యదర్శి నిధి ఖరే అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కమిటీలో జస్టిస్ పరమజీత్ సింగ్ ధలివాల్, పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రొఫెసర్ GS బాజ్‌పాయ్ తదితరులు భాగంగా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gadgets, Mobiles, New smartphone, Tech news