E-Vehicles Subsidies: విద్యుత్తు వాహనాలపై రాయితీలు.. రాష్ట్రాలు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం..

ప్రతీకాత్మక చిత్రం

కాలుష్యాన్ని అరికట్టడానికి ఇంధన వాహనాల కంటే విద్యుత్తు వాహనాల వినియోగం ఉత్తమం అని నిపుణులు చాలా రోజులుగా సూచిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో విద్యుత్తు వాహనాల వినియోగం మొదలైంది. దీంతో వీటి వినియోగాన్ని ప్రోత్సహించానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించాయి. అవేంటో చూద్దాం!

  • Share this:
కాలుష్యాన్ని అరికట్టడానికి ఇంధన వాహనాల కంటే విద్యుత్తు వాహనాల వినియోగం ఉత్తమం అని నిపుణులు చాలా రోజులుగా సూచిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో విద్యుత్తు వాహనాల వినియోగం మొదలైంది. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో వీటి వినియోగం చాలా తక్కువే అని చెప్పాలి. దీంతో వీటి వినియోగాన్ని ప్రోత్సహించానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించాయి. అవేంటో చూద్దాం! మన దేశంలో విద్యుత్తు వాహనాల వినియోగం తక్కువ. దీనికి ప్రధాన కారణం వాటి ధరలు. ఇంధన ఆధారిత వాహనాల కంటే విద్యుత్ వాహనాల ధర ఎక్కువగా ఉంటోంది. దీంతో ఫ్యూయల్ వేకిల్స్‌కు వీటిని ప్రత్యామ్నాయంగా ఎవరూ చూడటం లేదు. దీంతోపాటు మౌలిక సదుపాయల లేమి మరో కారణం. తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌కు సరైన ఏర్పాట్లు లేవు. పెద్ద ఎత్తున వాహనాల విక్రయం జరిగితే దానికి తగ్గట్టుగా ఛార్జింగ్‌ స్టేషన్లు, సదుపాయాలు అందుబాటులో లేవు. విద్యుత్తు వాహనాలు అంటే కొత్త టెక్నాలజీ. మన దేశంలో ఇంకా ఈ టెక్నాలజీ మీద ప్రజలకు అంతగా అవగాహన రాలేదు.

ఇది కూడా ఎలక్ట్రిక్ వేకిల్స్‌కు అవరోధంగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అవసరమైన మౌలిక సదుపాయాలు అందించే ప్రయత్నాలు చేస్తోంది. అలాగే విద్యుత్తు వాహనాల వినియోగం వల్ల పర్యావరణానికి జరిగే మేలు, ఇంధనానికి అయ్యే తక్కువ ఖర్చు లాంటి విషయాలను ప్రచారం ద్వారా ప్రజలకు చేరవేస్తోంది. దీని కోసం కేంద్రం సబ్సిడీలు ఇవ్వడానికి FAME- II పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో పాటు రాష్ట్రాలు ఆఫర్లు, అదనపు రాయితీలు ఇస్తున్నాయి. అయితే ఇవి ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల గురించే తీసుకుంటే... ఆంధ్రప్రదేశ్‌లో ఒకలా, తెలంగాణలో మరోలా ఉన్నాయి. అవేంటో చూద్దాం!

దృష్టి సారించిన కేంద్రం
తొలుత కేంద్రం ప్రవేశపెట్టిన FAME II గురించి చూస్తే... హైబ్రిడ్‌, విద్యుత్తు వాహనాల తయారీని పెంచే దిశగా ఈ పథకాన్ని తెచ్చారు. 2019లో FAMEను తొలుత తీసుకొచ్చారు. ఆ తర్వాత 2019లో FAME- IIగా అప్‌డేట్‌ చేశారు. ఇందులో కిలోవాట్‌అవర్‌ బ్యాటరీ ఉన్న ద్విచక్రవాహనాలకు ₹15 వేలు ప్రోత్సాహకం ఇస్తారు. అంటే వాహనం ధరలో గరిష్ఠంగా 40 శాతం వరకు రాయితీ ఇస్తారు. కిలో వాట్‌ అవర్‌ బ్యాటరీ ఉన్న ఫోర్‌ వీలర్స్‌కి అయితే ₹10 వేలు తగ్గింపు ఉంటుంది. అన్ని విద్యుత్తు వాహనాలకు ఐదు శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. తొలిసారి కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు ఆదాయపుపన్ను చట్టంలోని 80ఈఈబీ ద్వారా 1.5 లక్షల వరకు పన్ను రాయితీ పొందొచ్చు.

తెలుగు రాష్ట్రాలు రాయితీలు ఇస్తున్నాయా?
విద్యుత్తు వాహనాలకు సంబంధించిన ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతి చూస్తే... ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు వాహనాలకు ప్రత్యేకంగా రాయితీలు ఏవీ ఇవ్వడం లేదు. విద్యుత్తు వాహనాల కోసం ప్రత్యేకంగా పాలసీ కూడా విడుదల చేయలేదు. అయితే రిజిస్ట్రేషన్‌ ఫీజు, రోడ్‌ ట్యాక్స్‌ను వసూలు చేయడం లేదు. తెలంగాణ విషయానికొస్తే... ఇక్కడ కూడా విద్యుత్తు వాహనాల కోసం పాలసీ లాంటిది ఏమీ లేదు. అయితే రోడ్డు ట్యాక్స్‌ మినహాయింపు, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు లాంటివి ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో వేరేలా ఉన్నాయి.

ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
దిల్లీలో ప్రభుత్వం కిలో వాట్‌ అవర్‌ బ్యాటరీ ఉన్న టూవీలర్లకు ఐదు వేలు రాయితీ, 5 వేలు స్క్రాపేజ్‌ బెనిఫిట్‌ ఇస్తోంది. కిలోవాట్‌అవర్‌ బ్యాటరీ ఉన్న ఫోర్‌ వీలర్లకు అయితే ₹పది వేలు ఇస్తోంది. త్రీవలర్లకు అయితే ₹30 వేల వరకు రాయితీ ఇస్తోంది. దీంతోపాటు రిజిస్ట్రేషన్‌ ఫీజు, రోడ్డు ట్యాక్స్‌ రద్దు చేసింది. గుజరాత్‌లో టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌కు ₹10 వేలు, త్రీవీలర్‌కు ₹50వేలు రాయితీ ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు, రోడ్డు ట్యాక్స్‌ రద్దు ఎలాగూ ఉన్నాయి. మహారాష్ట్రలో కిలో వాట్‌ అవర్‌ బ్యాటరీ ఉన్న టూవీలర్లకు ₹10వేలు రాయితీ, ₹15 వేలు ఎర్లీ బర్డ్‌ ఇన్సెంటివ్‌, ₹7వేలు స్క్రాపేజ్‌, ₹12 వేలు ఇతర ఇన్సెంటివ్‌లు ఇస్తారు. ఫోర్‌ వీలర్లకు 1.5 లక్షల డిస్కౌంట్‌ ఇస్తారు. దీంతోపాటు 25 వేల స్క్రాపేజ్‌, 1.5 లక్షల ఎర్లీ బర్డ్‌ ఇన్సెంటివ్‌ ఇస్తారు. త్రీవీలర్స్‌కి అయితే ₹30 వేలు రాయితీ ఉంటుంది. రిజిస్ట్రేషన్‌, రోడ్‌ ట్యాక్స్‌ మినహాయింపు ఉంటాయి. రాజస్థాన్‌లో ఇటీవల విద్యుత్తు వాహనాల పాలసీని ప్రకటించారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇది బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. వాహనం కొనుగోలు చేసినప్పుడు రాయితీ ఉండదు.

అయితే రాష్ట్ర జీఎస్టీ నుండి రాయితీ అందుతుంది. అంటే ఆ మొత్తానికి తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. రెండు కిలోవాట్స్‌ బ్యాటరీ ఉన్న ఫోర్‌ వీలర్స్‌కు ₹ ఐదు వేలు, ఐదు కిలో వాట్స్‌ బ్యాటరీ ఉన్న వాహనాలకు ₹పది వేలు రాయితీ ఇస్తారు. త్రీవీలర్స్‌కు అయితే 3కిలోవాట్‌ బ్యాటరీలున్న వాటికి ₹10 వేలు, 5 కిలోవాట్‌ బ్యాటరీ ఉన్నవాటికి ₹20 వేలు ఇస్తారు. మేఘాలయలో కిలోవాట్‌ బ్యాటరీ కెపాసిటీ ఉన్న వాహనాలకు ₹10 వేలు రాయితీ ఇస్తారు. కార్లకు అయితే ఒక్కో కిలో వాట్‌ కెపాసిటీకి ఒక్కో నాలుగు వేల రూపాయలు వస్తుంది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, రోడ్డు ట్యాక్స్‌ ఛార్జీల మినహాయింపు ఉంటుంది. కర్ణాటకలో చూస్తే... నేరుగా వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వరు. రోడ్డు ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు మాత్రమే ఇస్తారు.
Published by:Veera Babu
First published: