CONFEDERATION OF ALL INDIA TRADERS CAIT OPPOSES GUJARAT GOVERNMENT DEAL WITH AMAZON SS
Amazon Deal: గుజరాత్‌తో అమెజాన్ ఒప్పందం... ట్రేడర్స్ నుంచి విమర్శలు
Amazon Deal: గుజరాత్‌తో అమెజాన్ ఒప్పందం... ట్రేడర్స్ నుంచి విమర్శలు
(image: Amazon)
Amazon Deal with Gujarat Government | అమెజాన్‌తో గుజరాత్ ప్రభుత్వం చేసుకున్న వ్యాపార ఒప్పందం (Business Deal) వివాదాస్పదం అవుతోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఈ డీల్‌ను వ్యతిరేకిస్తోంది.
కాంపిటీషన్లో వ్యతిరేక పద్ధతులు పాటిస్తున్న అమెజాన్‌తో గుజరాత్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) విమర్శల వర్షం కురిపిస్తోంది. అమెరికాకు చెందిన ఇ-కామర్స్ (e-commerce)దిగ్గజం అయిన అమెజాన్ (Amazon) వ్యాపారంలో పోటీ విషయంలో పాటిస్తున్న పద్ధతులపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) చాలాకాలంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం వివాదాస్పదం అవుతోంది. గుజరాత్ నుంచి ఇ-కామర్స్ ఎగుమతుల్ని చేసేందుకు గుజరాత్‌లోని పరిశ్రమలు, గనుల శాఖతో అమెజాన్ ఒప్పందం చేసుకుంది.
గుజరాత్ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అమెజాన్ శిక్షణ ఇచ్చి వారిని అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్లాట్ఫామ్లోకి తీసుకురానుంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల్ని 200 దేశాల్లోని కోట్లాది అమెజాన్ కస్టమర్లకు అందించడమే లక్ష్యంగా అమెజాన్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి చెందిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా-CCI, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్-ED లాంటి చట్టబద్ధమైన సంస్థలు అమెజాన్ నిర్వహిస్తున్న యాంటీ కాంపిటీటీవ్ చర్యలు, ఇ-కామర్స్ నియమనిబంధనల ఉల్లంఘన లాంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో అమెజాన్ తమ సేల్స్ పెంచుకోవడానికి గుజరాత్ ప్రభుత్వంతో చేతులు కలపడం ఈ వివాదానికి కారణమైంది.
ఈ ఒప్పందంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) గుర్రుగా ఉంది. చట్టాలకు వ్యతిరేకంగా నడిచే కంపెనీతో గుజరాత్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంతో గుజరాత్ వ్యాపారులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులను మోసం చేసినట్టైందని, తాము ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రకటించింది.
ఓవైపు కేంద్ర ప్రభుత్వానికి చెందిన లాయర్లు అమెజాన్ చేస్తున్న చట్టవిరుద్ధమైన చర్యల్ని సుప్రీం కోర్టుతో పాటు ఇతర కోర్టుల్లో బయటపెడుతుంటే మరోవైపు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం అత్యంత విచారం కలిగిస్తోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అభిప్రాయ పడింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్తామని, గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉండబోయే రాజకీయ పరిణామాలను వివరిస్తామని వెల్లడించింది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.