చైనా ప్రభుత్వం తమ దేశ ప్రజలపై చాలా కఠినంగా వ్యవహరిస్తుంటుంది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన దేశ పౌరులను కఠినంగా శిక్షిస్తుంది ఆ ప్రభుత్వం. ఈ కరోనా సమయంలో ప్రజలపై ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇది చాలదన్నట్టు మరిన్ని ఆంక్షలు ప్రవేశపెడుతూనే ఉంది. తాజాగా పిల్లలు వారంలో మూడు గంటల కంటే ఎక్కువసేపు ఆన్‌లైన్, వీడియో గేమ్‌లను ఆడటాన్ని నిషేధిస్తూ చైనా తాజాగా విధివిధానాలు తీసుకొచ్చింది. గేమింగ్ ఇండస్ట్రీపై ఇప్పటివరకు విధించిన ఆంక్షల్లో ఇదే అత్యంత కఠినమైనదని తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ తేదీ నుంచి చైనాలోని మైనర్లు ప్రతీ శుక్రవారం, వీకెండ్స్, ప్రభుత్వ సెలవు దినాల్లో రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గేమ్స్ ఆడుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ ప్రెస్ అండ్ పబ్లికేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక నోటీసు విడుదల చేసింది. 2019లో జారీ చేసిన నిబంధన ప్రకారం, 18 ఏళ్ల వయస్సులోపు మైనర్‌లు రోజుకు గంటన్నర పాటు గేమ్‌లు ఆడుకునేవారు. ప్రభుత్వ సెలవు దినాలలో మాత్రం మూడు గంటలు ఆడుకునేలా చైనా ప్రభుత్వం అనుమతించింది.
కానీ ఇప్పుడు 2019 నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ గేమింగ్‌ని వారానికి మూడు గంటలకే పరిమితం చేసింది. దాంతో గేమింగ్ సంస్థలు సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. ఈ సరికొత్త ఆంక్షలతో గేమింగ్ దిగ్గజం టెన్సెంట్, నెట్ ఈజ్ (NetEase), అలీబాబా వంటి చైనాలోని పెద్ద టెక్నాలజీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుంది. గేమింగ్ రెగ్యులేటర్ ప్రకటన విడుదల చేయక ముందు సోమవారం టెన్సెంట్ (Tencent) స్టాక్ ధర 0.6% తగ్గి 465.80 హాంకాంగ్ డాలర్ల వద్ద ముగిసింది. టెన్సెంట్ 573 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫిబ్రవరి నుంచి 300 బిలియన్లకు పైగా పతనం అయ్యింది. మార్కెట్ ప్రారంభంలో న్యూయార్క్ NetEase స్టాక్ ధర సుమారు 9% క్షీణించింది.
China Apps: అలర్ట్... మళ్లీ ఇండియాలోకి సైలెంట్‌గా ప్రవేశిస్తున్న చైనా యాప్స్
ప్రస్తుతం చైనాలో టెక్నాలజీ కంపెనీలపై కొనసాగుతున్న అణిచివేతలో భాగంగానే గేమింగ్ ఆంక్షలను విధించినట్లు తెలుస్తోంది. టెక్నాలజీ కంపెనీలు మెసేజింగ్, చెల్లింపులు, గేమింగ్ సేవలను అందిస్తూ సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయేమో అనే ఆందోళనల మధ్య చైనా ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల చైనా ప్రభుత్వ అనుబంధ పత్రిక గేమింగ్ ఇండస్ట్రీపై తీవ్ర విమర్శలు చేసింది.
పిల్లలకు గేమ్‌లు అనేవి మత్తుమందుగా పేర్కొంటూ ధ్వజమెత్తింది. దాంతో హడలిపోయిన టెన్సెంట్ మైనర్ పిల్లలు రోజులో కేవలం గంట సమయం ఆడేలా చర్యలు చేపట్టింది. 12 ఏళ్లలోపు పిల్లలు గేమ్ లోని ఏ ఐటమ్స్ కూడా కొనకుండా నిషేధించింది. చైనా ప్రభుత్వం గేమింగ్ కంపెనీలపై పర్యవేక్షణ మరింత బలోపేతం చేసేందుకు నడుం కట్టింది. అక్కడి ఈ కామర్స్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థలను అణచివేయడం ప్రారంభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, China App Ban, China Products, Video Games