టిక్‌టాక్, హలో యాప్ యూజర్లకు చేదు వార్త. వాటిని బ్యాన్ చేసేందుకు కేంద్రం సహా 5 రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టిక్‌టాక్ యాప్ నిషేధపుటంచులను తాకి వచ్చిన సంగతి తెలిసిందే. చైల్డ్ పోర్నోగ్రఫీ, విద్వేషపూరిత వీడియోలు జోరుగా చేస్తుండటం, వాటి వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆగ్రహంతో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యాప్‌పై కొరడా ఝులిపించేందుకు సిద్ధమయ్యాయి. టిక్‌టాక్‌కే చెందిన హలో యాప్‌లో కూడా ఇలాంటివే ఎక్కువ అవుతున్నందున వాటిని బ్యాన్ చేయాలని చూస్తున్నాయి. చైనా కంపెనీ బైట్ డ్యాన్స్‌కు చెందిన ఈ యాప్‌లపై తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాలు నిషేధం విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వీటితో పాటు పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు కూడా వీటిని బ్యాన్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. విద్వేష పూరిత సందేశాలను వ్యాప్తి చేయడానికి ఈ యాప్‌లను వాడుతున్నారని, అయినా ఆ కంపెనీ వాటి నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో కొరడా ఝులిపించనున్నట్లు తెలుస్తోంది. ‘కొన్ని రాష్ట్రాలు టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలని కేంద్రాన్ని కోరాయి. వీటి ద్వారా విద్వేషం, చైల్డ్ పోర్న్ ఘటనలు జరిగినట్లు ఆధారాలు కూడా సమర్పించాయి. ఈ యాప్‌లను బ్యాన్ చేయడం ద్వారానే వాటిని తగ్గించవచ్చని భావించాయి’ అని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు, కేంద్రం కూడా టిక్‌టాక్, హలో సంస్థలకు 24 ప్రశ్నలను సంధిస్తూ నోటీసులు జారీ చేసింది. వాటికి తగిన జవాబు ఇవ్వలేకపోతే వీటిని బ్యాన్ చేస్తామని హెచ్చరించింది. ఆరెస్సెస్‌కు చెందిన స్వదేశీ జాగరన్ మంచ్.. ప్రధాని మోదీకి చేసిన ఫిర్యాదుతో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, టిక్‌టాక్, హలో సంయుక్తంగా మరో మూడేళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేసిన క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Children, Mobile App, Porn ban, Tiktok