న్యూఢిల్లీ: వాట్సప్ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై ఇంటా బయటా తీవ్రమైన చర్చ జరుగుతోంది. 2021 ఫిబ్రవరి 8వ తారీఖులోపు కొత్త ప్రైవసీ రూల్స్ ను అంగీకరించకపోతే వినియోగదారులు వాట్సప్ ను వాడుకోలేరు. వాట్సప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరిస్తే, యూజర్లు వాడే ఫోన్ మోడల్ ఏంటో కూడా వాట్సప్ కు తెలిసిపోతుంది. అంతేకాదు ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంత్, యాప్ వర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్, కనెక్షన్ ఇన్ఫర్మేషన్, భాష, టైమ్ జోన్, ఐపీ అడ్రస్ లాంటి వివరాలన్నింటీన వాట్సప్ తెలుసుకోగలదు. దీనిపైనే వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రైవసీకి భంగం వాటిల్లుతోందంటున్నారు. దీంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) రంగంలోకి దిగింది. వాట్సప్ తోపాటు, ఫేస్ బుక్ ను కూడా భారత్ లో బ్యాన్ చేయాలంటూ కేంద్రానికి లేఖరాసింది.
వాట్సప్ కొత్తగా ప్రవేశ పెట్టిన ప్రైవసీ పాలసీని భారత్ లో అమలు చేయకుండా చూడాలంటూ కేంద్ర టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు సీఏఐటీ లేఖ రాసింది. యూజర్ల వ్యక్తిగత డేటాను దొడ్డిదారిలో చౌర్యం చేయడం దారుణమని పేర్కొంది. యూజర్ల లావాదేవీలు, చెల్లింపులు, వారి ఫోన్లలోని ఇతర కాంటాక్టులను యాక్సెస్ చేయడం వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించినట్టేనని తెలిపింది. వాట్సప్, ఫేస్ బుక్ వంటి కంపెనీలు యూజర్ల వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయడం అనేది యూజర్లకే కాకుండా దేశ భద్రతకు కూడా తీవ్రమైన ముప్పేనని సీఏఐటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘గతంలో వందల ఏళ్ల క్రితం ఉప్పును మాత్రమే అమ్మడానికి భారత్ లోకి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. ఆ తర్వాత దేశాన్నంతటినీ ఆక్రమించి పాలించింది. ప్రస్తుతం దేశ పౌరుల వ్యక్తిగత వివరాలను చౌర్యం చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను వారి చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది దేశానికి మంచిది కాదు.‘ అని సీఏఐటీ వివరించింది.
మొదట్లో ఎటువంటి చార్జీలు చెల్లించనవసరం లేదంటూ వాట్సప్, ఫేస్ బుక్ ను యూజర్లకు అందించారనీ, దానికి ప్రజలు అలవాటయిన తర్వాత ఇప్పుడు వ్యక్తిగత వివరాలను చౌర్యం చేస్తున్నారనీ సీఏఐటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫేస్ బుక్, వాట్సప్ లను భారత్ లో నిషేధించాలని కోరింది. కాగా, ప్రేవసీ పాలసీపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతుండటంతో వాట్సప్ స్పందించింది. పారదర్శకంగా ఉండటానికి, బిజినెస్ ఫీచర్స్‌ను వివరించడానికి తమ ప్రైవసీ పాలసీని అప్డేట్ చేశామని వాట్సప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ వెల్లడించారు. డేటా షేరింగ్‌కి సంబంధించి ఎలాంటి మార్పులు లేవని, యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎప్పట్లాగే కమ్యూనికేషన్లో ఉండొచ్చని, వారిపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు.