స్మార్ట్‌ఫోన్... రోజువారీ జీవితంలో ఓ భాగం. ఒక్క రోజు కాదు కదా... ఓ గంట స్మార్ట్‌ఫోన్ లేకుండా ఉండగలరా? అస్సలు ఉండలేరు. స్మార్ట్‌ఫోన్ లగ్జరీ కాదు... అత్యవసరం. కొందరైతే స్మార్ట్‌ఫోన్‌కు ఎంతలా అడిక్ట్ అయిపోతారంటే... బాత్రూమ్కు వెళ్లినా వెంట తీసుకెళ్తారు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఓ 10 నిమిషాలు లేకపోతే ప్రపంచం తలకిందులైపోయినట్టు ఆందోళన చెందుతుంటారు. యువతీయువకులే కాదు... పెద్దలు కూడా స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అవుతున్నారు. మీరు కూడా స్మార్ట్‌ఫోన్‌కు ఇలాగే అడిక్ట్ అయ్యారా? మీకు కూడా స్మార్ట్‌ఫోన్ వ్యసనంగా మారిపోయిందా? మరి ఆ వ్యసనం నుంచి ఎలా బయటపడాలి? ఈ 5 టిప్స్ ఫాలో అవండి.
1. స్మార్ట్‌ఫోన్ వాడకం జూదం లాంటిదే
అవును... మీకు మాత్రమే కాదు. అందరికీ అంతే. స్మార్ట్‌ఫోన్ వాడటం జూదంతో సమానం. ఆ ఫోన్ అలా ఉంటుంది కాబట్టే దానికి బానిసలు అవుతుంటారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ నోటిఫికేషన్లు నాన్‌స్టాప్‌గా వస్తుంటే స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోవడం తప్ప ఏం చేయగలరు. వాట్సప్‌లో ఓ మెసేజ్ వచ్చిందని చూడటం మొదలుపెడితే... ఆ తర్వాత మరిన్ని మెసేజ్‌లు చూస్తూనే ఉంటారు. యూట్యూబ్‌లో ఒక్క వీడియో చూద్దామనుకొని, మిమ్మల్ని మీరే మర్చిపోతుంటారు. ఎవరికైనా ఈ సమస్య మామూలే. టైంపాస్ కోసమో, కాసేపు రిలాక్స్ అవుదామనో ఇలా సోషల్ మీడియాకు అలవాటుపడిపోతుంటారు. దీన్నే 'టెడ్డీ బియర్ సిండ్రోమ్' అంటారు సైకాలజిస్టులు. అంటే పిల్లలు టెడ్డీ బియర్తో ఎలా కంఫర్ట్‌గా ఉంటారో... మీరూ స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని అంతే కంఫర్ట్‌గా ఫీలవుతుంటారని అర్థం. అయితే స్మార్ట్‌ఫోన్ అతిగా వాడకుండా ఎలా నియంత్రించుకుంటారన్నది మీ చేతుల్లో ఉంటుంది.
2. నోటిఫికేషన్లను నియంత్రించుకోండి
మీరు వాట్సప్, ఫేస్బుక్ లాంటివి వాడటం తప్పనిసరి అయితే నోటిఫికేషన్లను నియంత్రించడం మంచిది. వాట్సప్ గ్రూప్స్‌లో వచ్చే మెసేజ్‌లను మ్యూట్ మోడ్‌లో పెట్టొచ్చు. ఫేస్బుక్ నుంచి నోటిఫికేషన్లు రాకుండా ఆఫ్ చేసుకోవచ్చు. ఏ యాప్ అయినా సరే ఇలా సెట్టింగ్స్ మార్చడం వల్ల నోటిఫికేషన్లు తగ్గుతాయి. చాలావరకు యాప్స్‌కి మీకు నోటిఫికేషన్లే అవసరం లేదు. వాటిని ఆపేస్తే మంచిది. ఇ-మెయిల్ నోటిఫికేషన్లు కూడా ఆపెయ్యాలి.
3. మీ టైమ్ షెడ్యూల్ చేసుకోండి
ఏ సమయంలో ఫోన్ ఉపయోగించకూడదో మీకు ఓ స్పష్టత ఉండాలి. రోజంతా మీకు ఏ సమయంలో ఫోన్ అవసరమో అప్పుడే వాడాలి. అవసరం లేనప్పుడు ఫోన్ వైపు చూడకపోవడమే మంచిది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయాల్లో స్మార్ట్‌ఫోన్ అస్సలు వాడకూడదన్న నియమం పెట్టుకోవాలి.
4. డిజిటల్ వెల్బీయింగ్ కోసం యాప్స్
పైన చెప్పినవన్నీ చేయడం మీ వల్ల కావట్లేదా? సైక్రియాట్రిస్ట్ దగ్గరకేమీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ కోసమే డిజిటల్ వెల్బీయింగ్ యాప్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటే చాలు. మీరు స్మార్ట్‌ఫోన్ వాడే సమయం తగ్గుతుంది. యాపిల్ డీవైజ్లల్లో ఉన్న స్క్రీన్ టైమ్, గూగుల్‌కు చెందిన డిజిటల్ వెల్బీయింగ్ యాప్స్ వాడుతూ మానిటర్ చేయొచ్చు. ఏ యాప్ మీరు ఎంతసేపు వాడాలో అందులో టైమ్ సెట్ చేసి పెట్టుకోవచ్చు. యాప్ స్టోర్‌లో ఇలాంటి యాప్స్ చాలానే ఉన్నాయి. ఇవన్నీ మీ స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని తగ్గించేవే.
5. 30 రోజుల డిజిటల్ డిటాక్స్ ఛాలెంజ్
పైన చెప్పినవన్నీ ట్రై చేసినా స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని వదిలించుకోలేకపోతున్నారా? అయితే ఫోర్బ్స్ 30 రోజుల డిజిటల్ డిటాక్స్ ఛాలెంజ్ ట్రైచేయండి. మొదటి రోజు నుంచి 30వ రోజు వరకు ఏం చేయాలో రోజువారీగా 30 రోజుల డిజిటల్ డిటాక్స్ ఛాలెంజ్‌లో వివరిస్తారు. ఆ ఛాలెంజ్ మీరు ఫేస్ చేయగలిగితే స్మార్ట్‌ఫోన్ వ్యసనం వదిలినట్టే.
ఇవి కూడా చదవండి:
మీకూ నోమోఫోబియా ఉందా? స్మార్ట్‌ఫోన్‌తో ఈ రోగం ఖాయమా?
వాట్సప్‌లో స్టేటస్ వాడుతున్నవారికి బ్యాడ్ న్యూస్
2019లో ట్యాక్స్ సేవింగ్ ఐడియాలు ఇవే... ఇప్పుడే జాగ్రత్తపడండి
2019లో లాంగ్ వీకెండ్స్ జాబితా ఇదే... టూర్ ప్లాన్ చేసుకోండిలా...