మహీంద్రా(Mahindra) కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిపెట్టింది. సంస్థ ఆటోమోటివ్ విభాగమైన మహీంద్రా అండ్ మహీంద్రా ఐదు ఎలక్ట్రిక్ SUVలను రూపొందిస్తోంది. వీటిలో రెండింటిని వచ్చే నెలలో ఆవిష్కరించే అవకాశం ఉంది. అయితే ఈ వెహికల్స్ ఫోటోలను కంపెనీ తాజాగా టీజ్ చేసింది. ఆగస్టు 15న నిర్వహించనున్న ప్రోగ్రామ్‌లో వీటిని సంస్థ అధికారికంగా ఆవిష్కరించనుంది. కార్‌మేకర్ EV వింగ్ తాజా టీజర్‌లో వీటిని చూపించింది. బ్లాక్ షేడ్ ఫోటోలో కనిపించే ఒక ఎలక్ట్రిక్ SUV క్రాస్ఓవర్ లాంటి బాడీ షేప్‌తో వస్తుంది. మరో ఎస్‌యూవీ XUV700 లాంటి బాడీ ఫ్రేమ్‌తో ఉంది.
మహీంద్రా ఎలక్ట్రిక్ ఇంతకుముందే ఇండియాలో రిలీజ్ చేయనున్న మరో మూడు EVలను టీజ్ చేసింది. ఇందులో XUV300 SUV ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ఉంది. అయితే దీని పేరును కంపెనీ XUV400గా మార్చనుంది. XUV400 అనేది కంపెనీ విడుదల చేసిన మొదటి ఎలక్ట్రిక్ SUVలలో ఒకటి. మహీంద్రా XUV300 ఎలక్ట్రిక్ వెర్షన్ ఈ సంవత్సరం చివరి నాటికి ఇండియన్ మార్కెట్ల(Market)లోకి వస్తుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
వచ్చే నెలలో ఆవిష్కరణ..
ఈ ఎలక్ట్రిక్ SUVలను కంపెనీ ఆగస్టు 15న బ్రిటన్‌లో అధికారికంగా ఆవిష్కరించనుంది. అప్పుడే వీటి గురించి మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించనుంది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో XUV400ని ఆవిష్కరించనున్నారు. 2027 నాటికి ప్రతి 10 కార్లకు కనీసం రెండు నుంచి మూడు ఎలక్ట్రిక్ SUVలను విక్రయించాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. XUV400 మోడల్ టాటా(Tata) నెక్సాన్ EV, MG ZS EV, హ్యుందాయ్ కోనా EV వంటి వెహికల్స్‌తో పోటీ పడనుంది. బోర్న్ ఎలక్ట్రిక్ (Born Electric) రేంజ్‌లో రానున్న ఏడు ఎలక్ట్రిక్ SUV ఫ్లీట్‌లో XUV300 ఆల్-ఎలక్ట్రిక్ ఒకటి.
బ్రిటీష్ సంస్థతో ఒప్పందం
మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే యూకే గవర్నమెంట్‌కు చెందిన డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ ‘బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్’తో ఒప్పందం చేసుకుంది. ఇండియాలో రిలీజ్ చేయనున్న ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి పెట్టుబడులు పెట్టడం ఈ ఒప్పందం లక్ష్యం. బోర్న్ ఎలక్ట్రిక్ బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ EVలను తయారు చేసేందుకు ఈ బ్రిటిష్ సంస్థ నుంచి మహీంద్రా రూ.1,925 కోట్ల పెట్టుబడులు పొందుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం మహీంద్రా కొత్త కంపెనీని ఏర్పాటు చేయనుంది. బ్రిటిష్ సంస్థ కొత్త EV కంపెనీలో ఐదు శాతానికి మించకుండా వాటాను కలిగి ఉంటుంది. మహీంద్రా కొత్త EV కంపెనీ 2024 నుంచి 2027 మధ్య మొత్తం రూ.8,000 కోట్ల పెట్టుబడులు పొందుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anand mahindra, Electric cars, Mahindra, SUV