Hyderabad Metro Rail : హైదరాబాద్‌కి తలమానికం మెట్రోరైల్ సర్వీసులు. ఇవి వచ్చాక... రోజూ లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించి గమ్య స్థానాలకు చేరుతున్నారు. ఇలాంటి మెట్రో రైళ్లలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే... అది అందరికీ ఇబ్బంది కరమే. తాజాగా మెట్రో సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. శనివారం మియాపూర్ నుంచి ఎల్బీనగర్‌కు వెళ్తున్న మెట్రో ట్రైన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పంజాగుట్ట దగ్గర ఆ ట్రైన్‌ను దాదాపు 27 నిమిషాల పాటు ఆపేశారు. రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు కాసేపు ఇబ్బంది పడ్డారు. ఎందుకు ఆగిపోయింది. ఏం జరిగింది? ఎప్పటికి వెళ్తుంది? ఇలాగైతే ఎలా? అనుకుంటూ ప్రయాణికులు... తమలో తామే సమస్యపై రకరకాలుగా స్పందించుకున్నారు. ఐతే... 27 నిమిషాల తర్వాత ఆ ట్రైన్‌ను లూప్‌లైన్‌లో పెట్టి... మిగతా రైళ్లు వెళ్లేందుకు వీలు కల్పించారు. దాంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరినట్లైంది.
ఓ పెద్ద ప్రాజెక్టు చేపట్టాక... ఇలాంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తుతుండటం సహజమే. మెట్రో రైళ్లే లేకపోతే... హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ సమస్యలు మరింత పెరిగేవే. ఇప్పటికే మెట్రో రైళ్లు రోజూ దాదాపు 3 లక్షల మందిని తరలిస్తున్నా... రోడ్లపై ట్రాఫిక్ జామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఆ రైళ్లే లేకపోతే... రోడ్లపై నరకమే కనిపించేది. మెట్రో రైళ్లు, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, MGBS, అమీర్ పేట, హైటెక్ సిటీ, మియాపూర్ వంటి కీలక ప్రాంతాల్ని కలుపుతూ పోతుండటంతో... ఎంతో మంది అవి సౌలభ్యంగా మారాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.