Android TV: ప్రస్తుతం అన్ని డివైజ్‌లు స్మార్ట్‌గా మారుతున్నాయి. టెక్నాలజీ ద్వారా డివైజ్‌లకు మరిన్ని ఫీచర్లను యాడ్ చేస్తున్నారు. ఇప్పటికే స్మార్ట్ వాచ్‌లు, టీవీలు వంటివి మార్కెట్లోకి వచ్చాయి. చాలా కంపెనీలు ఆండ్రాయిడ్ టీవీలను(Android TVs) లాంచ్ చేస్తున్నాయి. కానీ టీవీ పర్ఫార్మెన్స్ను మెరుగుపరిచే అప్డేట్లు మాత్రం ఎక్కువగా రావట్లేదు. అయితే ప్రస్తుతం గూగుల్(Google) తన ఆండ్రాయిడ్ టీవీ/గూగుల్ టీవీ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేస్తోంది. అనేక ఛేంజెస్, ఇంప్రూవ్‌మెంట్స్‌ను అందించేందుకు పని చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి స్మార్ట్ టెలివిజన్లు కొత్త స్పెసిఫికేషన్లతో రానున్నాయి.
అనేక బ్రాండ్లు కొత్త ప్రొడక్టులను లాంచ్ చేస్తున్నప్పటికీ, వాటిని సురక్షితంగా ఉంచేలా లేటెస్ట్ అప్డేట్లను అందించడంపై దృష్టి పెట్టడం లేదు. ఈ కారణాలతో మార్కెట్లో ఆండ్రాయిడ్ టీవీలకు ఆశించిన స్థాయిలో డిమాండ్ లభించడం లేదు. అయితే ఆండ్రాయిడ్ టీవీలను అప్డేట్ చేయడంపై దృష్టి పెట్టింది గూగుల్. కోడ్ స్థాయిలో మార్పులను తీసుకురానుంది. టీవీలు స్లో అవుతున్నాయనే బాధ లేకుండా.. ప్రజలు మరిన్ని యాప్‌లను స్టోర్ చేసే అవకాశం కల్పించనుంది. మొబైల్ , టీవీ యాప్‌ల కోసం గూగుల్ ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (APKలు)ని ఉపయోగించింది. అయితే 2023లో ఆండ్రాయిడ్ యాప్ బండిల్ (AAB) లాంచింగ్‌తో ఇవి మారుతాయి.
స్టోరేజ్ సమస్యలు
స్మార్ట్ టీవీలు కేవలం 8GB స్టోరేజ్‌తో వస్తాయి. దీంతో కొత్త యాప్‌ను ఇన్స్టాల్ చేసే ముందు కొన్ని యాప్‌లను రిమూవ్ చేయాల్సిన పరిస్థితిని వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందిని దూరం చేయడానికి, గూగుల్ 2020 నవంబర్‌లో యాప్ బండిల్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు సంవత్సరాల తర్వాత ఇది టీవీ తయారీదారులకు ప్రామాణికంగా మారనుంది.
యాప్‌ల రీడిజైన్‌పై గూగుల్ నోటీసు
ఆండ్రాయిడ్ టీవీలలో అందిస్తున్న అప్డేట్లను ఈ వారం గూగుల్ ధ్రువీకరించింది. ఇప్పటికే ఉన్న ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా మార్పులు వర్తిస్తాయి. యాప్ డెవలపర్లు తమ యాప్‌లను మరింత తేలికగా మార్చేందుకు రీడిజైన్ చేసుకోవాలని గూగుల్ వారికి ఆరు నెలల నోటీసును ఇస్తోంది. APK నుంచి AABకి మార్పును ఇంజనీర్లు మూడు రోజుల్లో చేయగలరని గూగుల్ భావిస్తోంది. కొత్త ప్రమాణాలకు అనుగుణంగా లేని యాప్ ఏదైనా టీవీ ఇంటర్ఫేస్ నుంచి హైడ్ అవుతుందని కంపెనీ హెచ్చరించింది.
ఈ మార్పులన్నీ స్మార్ట్ టీవీలను ఎక్కువ కాలం, మరింత స్పీడ్‌తో పని చేసేలా చేస్తాయి. తరచూ అందే అప్డేట్లు దాడుల నుంచి టీవీని రక్షిస్తాయి. టీవీ ప్లాట్‌ఫారమ్‌ను డెవలప్ చేయడంపై గూగుల్ దృష్టి పెట్టింది. కానీ ఇప్పుడు డెవలపర్లు, టీవీ బ్రాండ్లు కూడా జత కలిసి వినియోగదారులకు ప్రయోజనాలు అందించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android TV, Technology