ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ అలర్ట్. డర్టీ పైప్ (Dirty Pipe) అనే బగ్ కారణంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు పెను ప్రమాదంలో పడే అవకాశం ఉందని 9 టు 5 గూగుల్ నివేదిక హెచ్చరించింది. ఈ ప్రమాదం ఎక్కువగా ఆండ్రాయిడ్ 12తో నడుస్తున్న స్మార్ట్ఫోన్లలో గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. డర్టీ పైప్ అనే బగ్ ఆండ్రాయిడ్12తో నడుస్తున్న పలు స్మార్ట్ఫోన్లను అత్యంత తీవ్రంగా ప్రభావం చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ బగ్ కారణంగా శామ్సంగ్ గెలాక్సీ S22 సిరీస్, గూగుల్ పిక్సెల్6 సిరీస్ వంటి మరిన్ని ఆండ్రాయిడ్12- స్మార్ట్‌ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ బగ్ ద్వారా ఫోన్ క్రంటోలింగ్ అంతా హ్యాకర్ల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని పేర్కొంది. అంతేకాదు, రీడ్ ఓన్లీ ఫైల్స్‌లో డేటాను ఓవర్‌రైట్ చేసే అవకాశం కూడా ఉందని తెలిపింది. జర్మన్ వెబ్ డెవలప్మెంట్ కంపెనీలో భద్రతా పరిశోధకుడిగా పనిచేస్తున్న మాక్స్ కెల్లర్‌మాన్ ‘డర్టీ పైప్’ బగ్‌ను గుర్తించారు. ఆయన దీన్ని మొదటగా లైనక్స్ కెర్నల్లో గుర్తించారు. దీనికి 'CVE-2022-0847' కోడ్‌ను కేటాయించారు. కెల్లర్‌మాన్ ప్రకారం, ఈ సమస్య లైనెక్స్ 5.16.11, 5.15.25, 5.10.102లో పరిష్కరించినప్పటికీ, వెర్షన్ 5.8 లైనక్స్ కెర్నల్లో ఇంకా సమస్య ఉన్నట్లు తెలిపారు. ఇది 2018లో వచ్చిన ‘డర్టీ కౌ’ బగ్‌ను పోలి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆండ్రాయిడ్ యూజర్లను ఈ బగ్ ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ సమయంలో గూగుల్ సెక్యూరిటీ ప్యాచ్‌ను విడుదల చేయడంతో ఈ లోపాన్ని వెంటనే పరిష్కరించగలిగింది.
లైనక్స్ కెర్నల్ 5.8లోని బగ్ రీడ్- ఓన్లీ ఫైల్‌లలో డేటాను ఓవర్‌రైటింగ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ డర్టీ పైప్ బగ్ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ స్పీకర్లు, టీవీ, మరెన్నో ఆండ్రాయిడ్- ఆధారిత పరికరాలకు ముప్పును కలిగిస్తుంది. ఈ 'డర్టీ పైప్' హాని సంభావ్యత చాలా ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు.
డర్టీ పైప్ ఎక్స్‌ప్లోయిట్ ఎలా పని చేస్తుంది?
డర్టీ పైప్ బగ్ సహకారంతో హ్యాకర్లు సులువుగా ఆయా ఆండ్రాయిడ్ ఫోన్లపై విరుచుకుపడే అవకాశం ఉంది. ఆయా స్మార్ట్‌ఫోన్ సిస్టమ్‌లోని రీడ్ ఓన్లీ ఫైళ్లలో డేటాను ఓవర్‌రైట్ చేయడానికి హ్యాకర్లకు యాక్సెస్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ సిస్టమ్‌కు లైనక్స్ కెర్నల్‌ను కోర్గా ఉపయోగిస్తుంది. దీంతో ఆయా స్మార్ట్‌ఫోన్ యూజర్లపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్క్రిప్టెడ్ వాట్సాప్ సందేశాలను చదవడానికి, ఓటీపీ మెసేజ్‌లను క్యాప్చర్ చేయడానికి ఈ బగ్ హ్యాకర్లకు ఉపయోగపడనుంది.
అంతేకాకుండా, స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసిన బ్యాంకింగ్ యాప్స్‌ను రిమోట్‌గా నియంత్రించేందుకు వారికి అనుమతి లభిస్తుంది. ఈ బగ్ నుంచి రక్షణ పొందడానికి.. ఆండ్రాయిడ్ 12 OSలో నడుస్తున్న కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలోని లైనక్స్ కెర్నల్ వెర్షన్‌ను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ ఫోన్లోని సెట్టింగ్‌లు > అబౌట్ ఫోన్ > ఆండ్రాయిడ్ వెర్షన్‌కు వెళ్లండి. డర్టీ పైప్ బగ్‌ను పరిష్కరించే వరకు కొత్త యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.