Andhra Pradesh: ఐటీ హబ్ గా ఏపీ కేపిటల్.. త్వరలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్శిటీ ఏర్పాటు

ఐటీ కేంద్రంగా విశాఖ

ఆంధ్రప్రదేశ్ లో ఐటీ పెట్టుబడులపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ముఖ్యంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా నిర్ణయించిన నేపథ్యంలో.. ఐటీ రాజధానిగా కూడా చేయాలని నిర్ణయించింది.

  • Share this:
    కేవలం సంక్షేమ పథకాలపైనే ఇంతకాలం ఫోకస్ చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు పెట్టుబడుల ఆకర్షణ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఐటీ కంపెనీలు ఏర్పాటకు అవకాశాలను కల్పిస్తోంది. మౌలిక వసతులు కల్పిస్తోంది. దీంతో పలు ఐటీ కంపెనీలు తమ యూనిట్లను విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖను ఐటీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, ప్రస్తుత సాంకేతిక అవసరాలతోపాటు విద్యార్థులకు అవసరమైన ఐటీ పరిజ్ఞానం, నైపుణ్యాలు అందుతాయి. అంతేకాకుండా వివిధ అంతర్జాతీయ, దేశీయ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఐటీ రంగంలో వస్తున్న కొత్త కోర్సులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందిస్తారు. ఈ వర్సిటీలో రెగ్యులర్, పార్ట్‌టైమ్‌ ఐటీ డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ కోర్సులను ప్రవేశపెడతారు. మొత్తంగా రాష్ట్ర చిత్రపటంలో విశాఖ మెగా ఐటీ హబ్‌గా అవతరించనుంది.

    విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయడానికి గత టీడీపీ ప్రభుత్వం 2014–20కి ఐటీ పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా ఏకంగా 5 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. ఒక మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ సిగ్నేచర్‌ టవర్‌ను నెలకొల్పాలని భావించింది. మధురవాడలోని 21 ఎకరాల స్థలంలో ఈ సిగ్నేచర్‌ టవర్‌ను ఏర్పాటు చేసేందుకు ఒక కన్సల్టెన్సీని కూడా నియమించింది. కొన్నికారణాల వల్ల అది ప్రతిపాదనల దశలోనే ఆగిపోయింది.

    ఇప్పుడు విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఐటీ అభివృద్ధికి కూడా విశాఖనే కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏకంగా ఐటీ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. విశాఖలో ఐటీ అభివృద్ధికి గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విశేషకృషి చేశారు. ఆయన హయాంలోనే విశాఖపట్నానికి టెక్‌ మహీంద్రా, విప్రో, మెరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ వంటి 14 కంపెనీలు వచ్చాయని వైసీపీ నేతలు చెబుతున్నా.. చంద్రబాబు కారణంగానే అవి వచ్చాయని టీడీపీ నేతలు వాధిస్తారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఇప్పుడు ముఖ్యమంజత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖను ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ ద్వారా ఐటీ కంపెనీలకు అవసరమైన మానవవనరులు అందుబాటులోకి వస్తాయి. మన విద్యార్థులకు కూడా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వెంటనే అందించే అవకాశం ఉంటుంది.

    సాంకేతిక రంగంలో ఎప్పటికప్పుడు మారుతున్నటెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ప్రస్తుతం విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్నాక.. మళ్లీ ఆయా కంపెనీల అవసరాలకనుగుణంగా బయట ప్రైవేటుగా ఐటీ కోర్సులను నేర్చుకోవాల్సి వస్తోంది. ఇది వారికి ఆర్థికంగా భారంగా మారుతోంది. అంతేకాకుండా కాలేజీ నుంచి వచ్చిన వెంటనే అనేక మందికి ఉద్యోగాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయడం, మారుతున్న అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను రూపొందించడం, విద్యార్థులు మంచి ఉద్యోగాలు పొందేలా తర్ఫీదు ఇవ్వడమే లక్ష్యంగా ఐటీ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రత్యేక యూనివర్సిటీ ద్వారా దేశ, విదేశాల్లో మన విద్యార్థులకు అపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి కూడా విశాఖలో ఏర్పాటు చేయబోయే రీసెర్చ్‌ యూనివర్సిటీ ద్వారా సహకారం అందించనున్నారు.
    Published by:Nagesh Paina
    First published: