Squid Game: ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తోన్న స్క్విడ్ గేమ్ యాప్.. ఇలా జాగ్రత్త పడండి..

ప్రతీకాత్మక చిత్రం

స్క్విడ్ గేమ్‌పై మక్కువతో చాలామంది ఆ సిరీస్ వాల్‌పేపర్స్ డౌన్‌లోడ్ చేసుకుంటారని ఊహించిన నేరగాళ్లు వాల్‌పేపర్‌ యాప్స్ విడుదల చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ప్లేస్టోర్ వేదికగా ప్రత్యక్షమైన స్వ్కిడ్‌ గేమ్‌ వాల్‌పేపర్‌ 4కే హెచ్‌డీ యాప్ స్మార్ట్‌ఫోన్‌లలో మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తోందని ఈఎస్ఈటీ సైబర్ నిపుణుడు లుకాస్ స్టెఫాంకో గుర్తించారు.

  • Share this:
స్క్విడ్ గేమ్‌.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న వెబ్‌సిరీస్‌! గత కొద్ది వారాలుగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ఈ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో అనేక స్మార్ట్ ఫోన్ యాప్‌లు, వాల్‌పేపర్స్, హలోవిన్ కాస్ట్యూమ్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు వెబ్‌సిరీస్‌ పాపులారిటీని ఉపయోగించుకొని మోసాలకు తెరలేపుతున్నారు. ఇటీవలే ఈ నేరగాళ్లు ‘స్వ్కిడ్‌ గేమ్‌ వాల్‌పేపర్‌ 4కే హెచ్‌డీ (Squid Game Wallpaper 4K HD)’ అనే యాప్‌ను ప్లేస్టోర్‌లోకి తీసుకొచ్చారు. అయితే ఈ యాప్ అనేక ఆండ్రాయిడ్ ఫోన్‌లలో జోకర్ మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తోందని ఈఎస్ఈటీ (ESET) సైబర్ సెక్యూరిటీ నిపుణులు కనుగొన్నారు.

స్క్విడ్ గేమ్‌పై మక్కువతో చాలామంది ఆ సిరీస్ వాల్‌పేపర్స్ డౌన్‌లోడ్ చేసుకుంటారని ఊహించిన నేరగాళ్లు వాల్‌పేపర్‌ యాప్స్ విడుదల చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ప్లేస్టోర్ వేదికగా ప్రత్యక్షమైన స్వ్కిడ్‌ గేమ్‌ వాల్‌పేపర్‌ 4కే హెచ్‌డీ యాప్ స్మార్ట్‌ఫోన్‌లలో మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తోందని ఈఎస్ఈటీ సైబర్ నిపుణుడు లుకాస్ స్టెఫాంకో గుర్తించారు. అనంతరం ఈ విషయాన్ని గూగుల్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో అప్రమత్తమైన గూగుల్ తన యాప్ మార్కెట్ నుంచి “స్క్విడ్ గేమ్ వాల్‌పేపర్ 4K HD” యాప్‌ను తొలగించింది. కానీ అప్పటికే యూజర్లు దీన్ని సుమారు 5,000 సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Whatsapp: వాట్సాప్​ చాటింగ్​ నిజంగా సేఫేనా?..డేటా భద్రతపై అనుమానాలు?..ఎందుకంటే..

యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన యూజర్లు ఎస్సెమ్మెస్‌ ట్రాప్‌లో పడుతున్నారు. ఈ మోసపూరితమైన ఎస్సెమ్మెస్‌ ట్రాప్‌లో పడితే బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ యాప్ స్థానిక లైబ్రరీలు, ఏపీకే పేలోడ్‌లను డౌన్‌లోడ్ చేసి ఫోన్‌లోని సున్నితమైన సమాచారాన్ని దొంగలించగలదు. గూగుల్ ప్లే స్టోర్‌లో స్క్విడ్ గేమ్ ఆధారంగా 200కు పైగా యాప్‌లు ఉన్నాయని స్టెఫానో తెలిపారు.

జోకర్ మాల్‌వేర్‌ చాలా ఏళ్లుగా ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్ చేస్తోంది. ఈ మాల్‌వేర్‌ ఖరీదైన సేవలను అందించే సర్వీసులకు యూజర్లకు తెలియకుండానే వారి బ్యాంకు ఖాతా ద్వారా సబ్‌స్క్రైబ్‌ చేయిస్తుంది. ఫలితంగా ప్రతి నెలా యూజర్ల బ్యాంక్ ఖాతా నుంచి భారీ మొత్తంలో డబ్బులు కట్ అవుతుంటాయి.

* ఇలా జాగ్రత్త పడండి
నెట్‌ఫ్లిక్స్ షో పాపులారిటీ వల్ల సైబర్ నేరగాళ్ల నుంచి సామాన్య యూజర్లకు ముప్పు పొంచి ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్విడ్ గేమ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేదా అసలు వాటి జోలికి వెళ్లవద్దని యూజర్లను హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు స్క్విడ్ గేమ్ ఆధారంగా 200 అప్లికేషన్లు గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి వచ్చాయి. పది రోజుల వ్యవధిలోనే ఈ అప్లికేషన్ల డౌన్‌లోడ్స్ 10 లక్షలకు చేరుకున్నాయి. ఈ తరహా క్రేజ్ ను గమనించిన నేరగాళ్లు యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి బిగ్ దివాళీ సేల్... ఈసారి ఆఫర్స్ ఇవే

అందుకే యూజర్లు చాలా జాగ్రత్త వహించాలని సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇప్పటికే స్క్విడ్ గేమ్ అప్లికేషన్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లైతే వాటిని వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తున్నారు. వీలైతే మొబైల్ ఫోన్లో విశ్వసనీయ యాంటీ మాల్‌వేర్‌ అప్లికేషన్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.
Published by:Sambasiva Reddy
First published: