Alibaba electric bike: ఒకటే చక్రం... అయినా స్పీడ్ ఎక్కువే.. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ రేటెంతంటే..

ఒక్క చక్రంతో నడిచే బైక్

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా ఓ ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేసింది. ఇది మామాలు ద్విచక్ర వాహనం కాదు. కేవలం ఒక్క చక్రంతో నడిచే చిన్న ఎలక్ట్రిక్ బైక్. దీనిపై ఒకరు మాత్రమే ప్రయాణించవచ్చు. చూడటానికి పెద్ద స్పోర్ట్స్ బైక్‌లో...

  • Share this:
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా ఓ ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేసింది. ఇది మామాలు ద్విచక్ర వాహనం కాదు. కేవలం ఒక్క చక్రంతో నడిచే చిన్న ఎలక్ట్రిక్ బైక్. దీనిపై ఒకరు మాత్రమే ప్రయాణించవచ్చు. చూడటానికి పెద్ద స్పోర్ట్స్ బైక్‌లో సగం మాత్రమే ఉంటుంది. తమ సంస్థ రూపొందించిన బ్యాటరీ వాహనాల్లో ఇది ప్రత్యేకమని అలీబాబా సంస్థ ప్రకటించింది. కంపెనీ అవసరాల కోసం దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. ఇది కేవలం 40 కేజీల బరువు మాత్రమే ఉంటుంది.

ఈ వినూత్న బైక్‌పై గంటకు అత్యధికంగా 48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని సంస్థ పేర్కొంది. ఈ బ్యాటరీ వెహికిల్‌ను ఎలక్ట్రిక్ యూనీ సైకిల్ అని పిలుస్తున్నారు. దీని బ్యాటరీని ప్యానసోనిక్ కంపెనీ తయారు చేసింది. దీని సామర్థ్యం 1.36 కిలో వాట్లు. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి మూడు నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. బ్యాటరీని ఒకసారి ఛార్జింగ్ చేస్తే గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని సంస్థ వెల్లడించింది.

ప్రత్యేకమైన డిజైన్
బైక్ డిజైనింగ్ ఆకట్టుకునేలా ఉంది. వెనుక నుంచి చూస్తే డుకాటీ బైక్ మాదిరిగానే కనిపిస్తుంది. దీని బాడీని స్టీలుతో తయారు చేశారు. బండికి ఫ్యూయెల్ ట్యాంకును కూడా డిజైన్‌ చేశారు. ఒకే చక్రం ఉన్నప్పటికీ బైక్‌ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. దీన్ని నిలిపి ఉంచడానికి స్టాండ్ అవసరం లేదు. బైక్‌ను నడిపేవారు బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. బైక్ హ్యాండిల్ బార్ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ హ్యాండిల్ బార్‌కు బ్రేకులు కూడా ఉన్నాయి.

నడపడం కష్టమే
ఈ చిన్న బైక్‌ను చాలా నెమ్మదిగా నడపాల్సి ఉంటుంది. దీని బరువు తక్కువగా ఉండటం వల్ల, వేగాన్ని పెంచితే బండి బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంది. దీనికి తోడు ఒకే చక్రంతో నడుస్తున్నప్పుడు ఒకేసారి పూర్తిగా బ్రేక్ వేస్తే రైడర్ ముందుకు పడిపోయే అవకాశం ఉంది. అందుకే సరైన శిక్షణ లేకుంటే దీన్ని నడపడం సాధ్యం కాదు. ఈ బైక్‌ను రైడర్ నడుపుతున్న వీడియోను అలీబాబా సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విద్యుత్ బైక్‌ను ఇంకా మార్కెట్లోకి విడుదల చేయలేదు. దీన్ని కస్టమర్లకు అమ్మే అవకాశాలు లేవు. కానీ దీని విలువ 1,850 డాలర్ల వరకు ఉండవచ్చు. మన కరెన్సీలో బైక్ ధర రూ.1.34 లక్షల వరకు ఉండవచ్చు.
First published: