WhatsApp Chat Leaks: వాట్సప్ యూజర్లకు అలర్ట్​​... మీ చాట్స్ లీక్ అవ్వకుండా ఇలా జాగ్రత్త పడండి

WhatsApp Chat Leaks: వాట్సప్ యూజర్లకు అలర్ట్​​... మీ చాట్స్ లీక్ అవ్వకుండా ఇలా జాగ్రత్త పడండి (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Chat Leaks | వాట్సప్ ఛాట్స్ లీక్ అవుతున్నాయన్న ఆందోళన యూజర్లలో నెలకొంది. మీకు కూడా అలాంటి అనుమానం ఉందా? మీ ఛాట్స్ లీక్ (Chat Leaks) అయి ఇతరుల చేతుల్లోకి వెళ్తున్నాయని అనుమానిస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి.

  • Share this:
మీరు వాట్సాప్ (WhatsApp) వినియోగిస్తున్నారా? అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మీ వాట్సాప్ చాట్ లీకయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో వాట్సాప్‌ లీక్‌లకు సంబంధించి అనేక పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలో వాట్సాప్ యూజర్లు ఆందోళన పడుతున్నారు. మరోపక్క యూజర్ల మెసేజ్‌లకు ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (end to end encryption) భద్రత కల్పిస్తున్నామని వాట్సాప్ చెబుతోంది. యూజర్ల చాట్ హ్యాకర్లకు చిక్కుదని, థర్డ్ పార్టీ అప్లికేషన్లకు దొరకదని, ఫేస్‌బుక్ యాక్సెస్ చేయదని వాట్సాప్ ఇప్పటికే స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ యూజర్ల అజాగ్రత్త వల్ల వాట్సాప్ చాట్ లీకయ్యే అవకాశాలు ఎక్కువ. మరి ఎలాంటి అజాగ్రత్తల వల్ల లీక్స్ జరుగుతాయి? వాటి నుంచి ఎలా జాగ్రత్త పడాలి? వంటి విషయాలు తెలుసుకుందాం.

వాట్సాప్ చాట్​లీక్స్ ఎలా జరుగుతాయి?


వాట్సాప్ మెసేజ్‌లను పంపించిన వారు, పొందిన వారు తప్ప మిగతా ఎవరూ వాటిని చదవలేరు. అయితే ఫోన్ ఎలా యూజ్ చేస్తున్నారనే దానిపై వాట్సాప్ లీక్స్ ఆధారపడి ఉంటాయని సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. మీరు మీకు తెలియకుండానే నేరగాళ్లతో చాట్ చేసి ఉండొచ్చు. లేదా ఏదైనా నిషేధిత కంటెంట్ షేర్ చేయొచ్చు. చట్టవిరుద్ధమైన పనులు చేసే వారితో కాంటాక్ట్ లో ఉండి ఉండొచ్చు. ఒకవేళ మీరు చాట్ చేస్తున్న ఫలానా వ్యక్తి అధికారులకు చిక్కితే.. మీరు కూడా ఆ ఉచ్చులో పడే ప్రమాదం ఉంది.

WhatsApp New Feature: వాట్సప్ బిజినెస్ అకౌంట్​లో కొత్త ఫీచర్... ఎలా పనిచేస్తుందంటే

వాట్సాప్ ద్వారా షేర్ చేసిన మీ సమాచారం మొత్తం మీ ఫోన్‌లో లేదా క్లౌడ్ డ్రైవ్‌లో స్టోర్ అవుతుంది. ఏదైనా తప్పు లేదా నేర ప్రవర్తన అనుమానం ఉన్నప్పుడు.. వాట్సాప్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆ సమాచారాన్ని అధికారులకు అందిస్తుంది. అందుకే అజ్ఞాత వ్యక్తులతో ఎప్పుడూ కూడా చాట్ చేయకూడదని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ చాట్ లీక్‌లు మరో రకంగా కూడా జరగొచ్చు. మీరు వాట్సాప్ పర్సనల్ చాట్‌ను క్లియర్ చేయకపోతే.. అవి లీకయ్యే ప్రమాదం ఉంది.

మీకు తెలిసిన వారే రహస్యంగా మీ ఫొటోలు, వాట్సాప్ సంభాషణలను స్క్రీన్‌షాట్‌ తీసి వాటిని లీక్ చేయగలరు. ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌ను దొంగలించినప్పుడు లేదా పోగొట్టుకునప్పుడు చాట్ లీక్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మీ మెసేజ్‌లను మీరు తప్ప ఎవరూ చూడకుండా లాక్ పెట్టుకోవాలి. లేదా వ్యక్తిగత విషయాలను వాట్సాప్ ద్వారా మాట్లాడుకోకపోవడం ఉత్తమం. కొందరు వాట్సాప్ యూజర్లు తరచుగా హానికరమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తుంటారు. వీటిలో మాల్‌వేర్‌ ఉండొచ్చు. ఫలితంగా డబ్బులతో పాటు వ్యక్తిగత సమాచారం నేరగాళ్ల చేతుల్లో పడే ప్రమాదం ఉంది.

Flipkart Big Diwal Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ మొదలైన సేల్... రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్, ఇతర సురక్షిత ప్లాట్‌ఫామ్‌ల్లో తప్ప వేరే సైట్లలో అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేయకండి. హానికరమైన అప్లికేషన్లు మారువేషంలో గూగుల్ ప్లే స్టోర్ లోకి వస్తున్నాయి. ఇలాంటి కొత్త అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకోకపోవడమే శ్రేయస్కరం. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో చర్చించే విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కింద పేర్కొన్న ఐదు జాగ్రత్తలను పాటించండి.

1. నేరంగా పరిగణించే అంశాల గురించి సరదాకైనా వాట్సాప్‌లో మాట్లాడకండి. డ్రగ్స్, పోర్న్, వేధింపుల వంటి విషయాల గురించి మాట్లాడకుండా జాగ్రత్తపడండి. అవతలి వ్యక్తి ఇలాంటి చట్టవిరుద్ధమైన విషయాలు మాట్లాడుతుంటే వెంటనే బ్లాక్ చేసేయండి.

2. మీకు సంబంధించినలేదా ఇతరుల సీక్రెట్ ఫొటోలు గానీ వీడియోలను గానీ వాట్సాప్ ద్వారా సెండ్ చేయకండి. చట్టవిరుద్ధమైన మెసేజ్‌లను పంపించకండి.

3. వాట్సాప్‌లో ఆర్థిక లావాదేవీల గురించి చర్చించకండి. చాట్‌లో మీ బ్యాంకు ట్రాన్సాక్షన్ల విషయాలను షేర్ చేయకండి.

4. ఎవరైనా వ్యక్తులు మీరు ఇటీవల వెళ్లిన ప్రదేశాల గురించి అడిగినప్పుడు వాట్సాప్‌లో చర్చించండి. క్షణికావేశంలో అనాలోచితంగా మీకు సంబంధించిన సున్నితమైన విషయాలను డిస్కస్ చేయకండి.

5. వాట్సాప్‌లోనైనా లేదా నిజజీవితంలోనైనా నిర్లక్ష్యాన్ని వీడి ఒకటికి రెండుసార్లు ఆలోచించి తెలివిగా వ్యవహరించడం చాలా ముఖ్యం.
Published by:Santhosh Kumar S
First published: