అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ దిగ్విజయంగా తన తొలి అంతరిక్ష యాత్రను పూర్తిచేశారు. మంగళవారం తన సొంత వ్యోమనౌక ‘న్యూ షెపర్డ్’ లో రోదసిలోకి వెళ్లొచ్చిన ఆనందంలో ఆయన భారీ ప్రకటన చేశారు. 100 మిలియన్ డాలర్ల అవార్డును ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్‌కు ప్రదానం చేశారు. సాహసోపేతమైన యాత్ర అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన రూ.745 కోట్ల అవార్డు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసే వ్యక్తులను గుర్తించి వారిని కరేజ్ అండ్ సివిలిటీ అవార్డుతో సత్కరిస్తారు. అయితే మానవతావాదిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న చెఫ్ జోస్ ఆండ్రెస్‌ను.. జెఫ్ బెజోస్ కరేజ్ అండ్ సివిలిటీ అవార్డుతో సత్కరించారు.
సీఎన్ఎన్ రాజకీయ సహకారి, డ్రీమ్ కార్ప్స్ వ్యవస్థాపకుడు వాన్ జోన్స్ కు కూడా 100 మిలియన్ డాలర్ల అవార్డు ప్రదానం చేశారు. 'అవార్డు గెలుచుకున్న డబ్బుని జోస్ ఆండ్రెస్, వాన్ జోన్స్ తమ సొంత చారిటీ సంస్థలకు డొనేట్ చేయొచ్చు లేదా చాలామందికి పంచవచ్చు. అదంతా వారి ఇష్టం' అని జెఫ్ బెజోస్ చెప్పుకొచ్చారు.
నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన జోస్ ఆండ్రెస్ తాజాగా గెలుచుకున్న అవార్డు డబ్బును వరల్డ్ సెంట్రల్ కిచెన్‌కు విరాళంగా ఇస్తారని తెలుస్తోంది. 2010లో లాభాపేక్షలేని వరల్డ్ సెంట్రల్ కిచెన్‌ను స్థాపించిన వారిలో జోస్ ఒకరు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తుల బాధితులకు ఆహారం అందించి అండగా నిలుస్తుంది. జర్మనీలో కుంభవృష్టి కారణంగా వరదలు ముంచెత్తడంతో చాలామంది ప్రజల పరిస్థితి దుర్భేద్యంగా మారింది. దీంతో వరల్డ్ సెంట్రల్ కిచెన్ సంస్థ స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. వరద బాధితులకు ఆహారం అందించి అండగా నిలిచింది. ఫ్లోరిడాలోని మియామీలో భవనం కూలిపోయిన తరువాత అత్యవసర సిబ్బందికి ఫుడ్ అందించేందుకు స్థానిక ట్రక్కుల సహాయం తీసుకుంది. ఈ విధంగా ప్రకృతి విపత్తులలో బాధితులైన వారికి వరల్డ్ సెంట్రల్ కిచెన్ అండగా నిలుస్తోంది.
జెఫ్ బెజోస్ అవార్డు ప్రదానం చేసిన అనంతరం జోస్ ఆండ్రెస్ ఒక ప్రకటన విడుదల చేశారు. "ఈ అవార్డు ప్రదానం చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జెఫ్ బెజోస్ కుటుంబం నుంచి అద్భుతమైన మద్దతు లభించింది.
ఈ అవార్డు ఒక్కటే ప్రపంచానికి ఆహారం అందించలేదు. కానీ ఇది మాకు ఒక అధ్యయనానికి తొలిమెట్టు. మేము ఎదుర్కొంటున్న పెద్ద సవాళ్ళను దాటి ఆలోచించటానికి ఇటువంటి అవార్డులు సహాయం చేస్తాయి. ప్రపంచ ప్రజలందరూ పెద్ద మనసుతో ఆలోచించి ఆకలి సమస్యను పరిష్కరించే సమయం వచ్చింది" అని ఆండ్రెస్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jeff Bezos