ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) వచ్చిన మోసపూరిత ప్రకటనను చూసి ఐఫోన్ (iPhone) కొనేందుకు ప్రయత్నించిన యూజర్‌ని సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. తక్కువ ధరకే ఐఫోన్ పొందండి అంటూ అత్యాశపడి ఏకంగా రూ.29 లక్షలు నష్ట పోయాడు. డబ్బులు చెల్లించినప్పటికీ ఫోన్ డెలివరీ కాకపోవడంతో మోసపోయానని గ్రహించి ఢిల్లీ సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో సోషల్ మీడియా మానవుడి జీవనశైలిలో భాగమైపోయింది. ఎక్కువసేపు వీటిల్లో గడుపుతుండటంతో సైబర్ నేరగాళ్లు అదనుగా భావించి రెచ్చిపోతున్నారు. యాడ్స్ ద్వారా బురిడీ కొట్టించి భారీగా దోచుకుంటున్నారు. ఢిల్లీకి చెందిన వికాస్ కఠియార్ ఘటనే ఇందుకు ఉదాహరణ. ఇన్‌స్టాగ్రామ్ బ్రాజ్ చేస్తుండగా వికాస్‌కి ఐఫోన్ యాడ్ కనిపించింది. తక్కువ ధరకే ఐఫోన్‌ని సొంతం చేసుకోవచ్చనే ప్రకటన చూసి వికాస్ ఆశ్చర్యపోయాడు. ఐఫోన్ వాడాలనే కోరికతో సదరు అడ్వర్టైజర్లను సంప్రదించి ఫోన్ బుక్ చేశాడు.
* అనుమానం రాలేదా?
ఇన్‌స్టా పేజీలో యాడ్ చూశాక మొదట్లో వికాస్ కాస్త అనుమానించాడు. ఇది ఫేక్ అయి ఉండొచ్చు కదా అని ఆలోచించాడు. అనుమానాన్ని నివృతి చేసుకోవడానికి పేజీలో ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన పాత కొనుగోలు దారులను సంప్రదించాడు. వారు కూడా వికాస్‌కి ఓకే అని చెప్పారు. ఈ పేజీ నుంచి ఆర్డర్ చేయొచ్చని హామీ ఇచ్చారు. తాము కూడా అలాగే చేశామని, ఫోన్ గ్యారంటీగా డెలివరీ అవుతుందని నమ్మించారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 6న వికాస్ ప్రకటనదారులకు కాల్ చేసి ఐఫోన్‌ని ఆర్డర్ చేశాడు.
మొదట్లో చేసిన ఐఫోన్ ఆర్డర్ క్యాన్సిల్ అయిందని, మళ్ళీ బుక్ చేస్తే మొదట చేసిన పేమెంట్ అమౌంట్ రిడీమ్ చేసుకోవచ్చని చెప్పి వికాస్‌ను సైబర్ కేటుగాళ్లు నమ్మించారు. ఇలా వికాస్ నుంచి రూ.28,69,850 రాబట్టారు. అయినప్పటికీ ఐఫోన్ డెలివరీ చేయలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన వికాస్.. ఢిల్లీ సౌత్ వెస్ట్ డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. పోలీసులు అగంతకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : అదిరిపోయే ఫీచర్.. ఈ స్మార్ట్‌ఫోన్లలో శాటిలైట్ టెక్నాలజీ..!
* ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
వికాస్ కఠియార్ ఘటన వెలుగులోకి రావడంతో సైబర్ నిపుణులు నెటిజన్లకు, సోషల్ మీడియా యూజర్లకు సూచనలు చేస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే ఆర్డర్స్ చేసుకోవాలని చెప్పారు. సోషల్ మీడియాల్లో వచ్చే ప్రకటనల్లో వంద శాతం నిజం ఉండకపోవచ్చని అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా ఆన్‌లైన్ పేమెంట్ చేసే సమయంలో వెబ్‌సైట్ డొమైన్ సరిగా ఉందో? లేదో? చెక్ చేసుకోవాలని సూచించారు. ఏ కంపెనీ కూడా నేరుగా సోషల్ మీడియా యాడ్స్ ద్వారా పేమెంట్స్‌ని స్వీకరించబోదని తెలిపారు. సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారంలలో వచ్చే ప్రకటనలతో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CYBER CRIME, Iphone, Tech news