Home /News /sports /

ZIMBABWE CRICKETER RYAN BURL TWEET PUMA MADE ZIMBABWE TEAM SURPRISED JNK

Cricket: జింబాబ్వే క్రికెటర్ ఆవేదన.. జట్టు మొత్తానికి సర్‌ప్రైజ్ ఇచ్చిన పూమా కంపెనీ

ఒక్క ట్వీట్ జింబాబ్వే జట్టు రాతను ఎలా మార్చిందో తెలుసా?

ఒక్క ట్వీట్ జింబాబ్వే జట్టు రాతను ఎలా మార్చిందో తెలుసా?

జింబాబ్వే క్రికెటర్ ర్యాన్ బర్ల్ చేసిన ఒక ట్వీట్‌లో ఆ క్రికెట్ జట్టు మొత్తానికి కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించడానికి పూమా ముందుకు వచ్చింది. ఇంతకు అసలు ఏం జరిగింది?

    జింబాబ్వే (Zimbabwe Cricket) జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మాన్ ర్యాన్ బర్ల్ (Ryan Burl) చేసిన చిన్న రిక్వెస్ట్ ఏకంగా ఆ జట్టుకే పెద్ద ప్రయోజనాన్ని చేకూర్చింది. ఒకప్పుడు ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్, అలిస్టర్ క్యాంప్ బెల్, డేవ్ హాటన్, హీత్ స్ట్రీక్, నీల్ జాన్సన్ వంటి దిగ్గజ క్రికెటర్లతో మేటి జట్టుగా ఉన్న జింబాబ్వే కాల క్రమంలో అనామక జట్టుగా మారిపోయింది. వరుస ఓటములతో కనీసం చిన్న జట్లకు కూడా పోటీ ఇవ్వలేక పోవడంతో టెస్టు హోదాను కూడా తప్పించారు. అయితే ఈ మధ్య జింబాబ్వే జట్టులో యువ క్రికెటర్లు బాగానే రాణిస్తున్నారు. అయితే జింబాబ్వే క్రికెట్ బోర్డు వద్ద సరిపడా నిధులు లేకపోవడంతో క్రికెటర్లకు కూడా పెద్దగా వేతనాలు ఉండవు. ఈ అనామక జట్టును స్పాన్సర్ (Sponser) చేయడానికి కూడా పెద్దగా ఎవరూ రారు. ఈ క్రమంలో క్రికెటర్లు ప్రతీ సిరీస్‌లో వాడిన కిట్లనే తిరిగి వాడుతుంటారు. షూలు చినిగి పోయినా బంకతో అతికించుకొని మరీ ఆడుతుంటారు. జింబాబ్వే క్రికెటర్ ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌ ముగిసిన వెంటనే తన చినిగి పోయిన షూను అతికించుకుంటున్న ఫొటోలు పెట్టాడు. 'మాకు ఎవరైనా స్పాన్సర్ దొరికితే ప్రతీ సిరీస్ తర్వాత ఇలా మా షూలకు బంక అతికించుకోవాల్సిన పని ఉండదు' అని ఆ ఫొటోతో పాటు సందేశాన్ని జత చేశాడు. ఒక వైపు కొన్ని క్రికెట్ జట్లు రూ. కోట్లలో స్పాన్సర్‌షిప్ పొందుతుంటే జింబాబ్వే జట్టు క్రికెటర్లు కనీసం షూలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక కష్టపడుతున్నారు.

    కాగా, ర్యాన్ పోస్టుకు ప్రముఖ స్పోర్ట్స్ అప్పారెల్ బ్రాండ్ పూమా (Puma Apparel) స్పందించింది. 'ఇక ఆ బంకను పక్కన పెట్టండి. మీ పాదాలకు మేము రక్షణ ఇస్తాము' అంటూ రీట్వీట్ చేసింది. ర్యాన్ చేసిన ఒక్క ట్వీట్‌తో జింబాబ్వే జాతీయ జట్టు మొత్తానికి కిట్‌ను స్పాన్సర్ చేయడానికి పూమా ముందుకు వచ్చింది. పూమా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జింబాబ్వే క్రికెట్ బోర్డుతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నది. ఈ విషయం తెలుసుకున్న ర్యాన్ వెంటనే మరో పోస్టు పెట్టాడు. 'నేను పూమా క్రికెట్ టీమ్‌తో చేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది. మా జట్టును సపోర్ట్ చేసిన ఫ్యాన్స్‌కు చాలా ధన్యవాదాలు.' అని ట్వీట్ చేశాడు. కాగా, ఇప్పుడు పూమా చేసిన సాయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డబ్బున్న జట్టుతో ఒప్పందాలు కాకుండా ఇలాంటి పేద జట్లను సపోర్ట్ చేసి పూమా అందరి మనసులను గెలుచుకున్నదని అందరూ పొగుడుతున్నారు.







    జింబాబ్వే జట్టుకు 1983 వరల్డ్ కప్‌కు ముందు వన్డే స్టేటస్, 1992లో టెస్ట్ స్టేటస్ లభించింది. కాగా, 2019లో జింబాబ్వే క్రికెట్ బోర్డుపై అక్కడి ప్రభుత్వం పెత్తనం సాగిస్తుండటంతో ఆ జట్టుపై ఐసీసీ నిషేధం విధించింది. ఇటీవల ఆ జట్టు వన్డేలు ఆడటం మొదలు పెట్టింది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Cricket, Sports, Zimbabwe

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు