హోమ్ /వార్తలు /క్రీడలు /

Yuvraj Singh: అభిమానులు పండగ చేసుకునే విషయం చెప్పిన యువీ.. ఈ మాట చాలంటూ ఫ్యాన్స్ భావోద్వేగం

Yuvraj Singh: అభిమానులు పండగ చేసుకునే విషయం చెప్పిన యువీ.. ఈ మాట చాలంటూ ఫ్యాన్స్ భావోద్వేగం

యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్

ఇండియన్ క్రికెట్‌లో యువరాజ్ సింగ్ స్థాయే వేరు. క్యాన్సర్ నుంచి మనో ధైర్యంతో కోలుకున్నా, ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టినా యువీకే చెల్లింది. యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించి రెండేళ్లయింది.

  ఇండియన్ క్రికెట్‌లో యువరాజ్ సింగ్ స్థాయే వేరు. క్యాన్సర్ నుంచి మనో ధైర్యంతో కోలుకున్నా, ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టినా యువీకే చెల్లింది. యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించి రెండేళ్లయింది. ఇక యువీ ఆట చూడలేమని భావించిన ఫ్యాన్స్‌కు తాజాగా ఈ సిక్సర్ల చిచ్చర పిడుగు శుభవార్త చెప్పాడు. ఇన్‌స్టాగ్రాం వేదికగా తాను మళ్లీ మైదానంలో బ్యాట్ ఝళిపించబోతున్నట్లు చెప్పకనే చెప్పేశాడు.

  కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 150 పరుగులతో దుమ్మురేపిన యువీ తాజాగా తన ఇన్‌స్టాగ్రాంలో ఆ మ్యాచ్‌లో తన బ్యాటింగ్ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు జత చేసిన పోస్ట్ యువరాజ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడని సంకేతాన్నిచ్చింది. ప్రజలు, అభిమానుల డిమాండ్ మేరకు.. అన్నీ కలిసొస్తే.. వచ్చే ఫిబ్రవరిలో పిచ్‌లో కాలు పెట్టనున్నట్లు యువీ పోస్ట్ చేశాడు.  దేవుడు గమ్యాన్ని నిర్దేశిస్తాడని చెప్పిన యువీ తన గమ్యాన్ని చేరుకోవాలంటే మళ్లీ స్టేడియంలోకి దూకాలని మాత్రం ఫిక్సయినట్లు చెప్పకనే చెప్పేశాడు. నిజమైన అభిమానులు కష్ట సమయంలో మనకు మద్దతుగా ఉంటారని, ఇన్నాళ్లూ మీరు చూపిన ప్రేమకు కృతజ్ఞుడినని పోస్ట్ చేశాడు. కష్టకాలంలో టీమిండియాకు అండగా నిలవాలని యువీ కోరాడు. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా జట్టు పేలవ ఆటతీరుతో పాక్, న్యూజిలాండ్ చేతిలో వరుస ఓటముల పాలైన నేపథ్యంలో క్రికెటర్స్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. యువీ మళ్లీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడన్న విషయం తెలిసిన అభిమానుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ‘నువ్వు వీడి వెళ్లాక మిడిల్ ఆర్డర్ అప్పటిలా లేనే లేదు’ అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. ‘వెల్‌కమ్ బ్యాక్ యువీ’ అని మరో అభిమాని కామెంట్ చేశాడు.

  ఇది కూడా చదవండి: T20 World Cup 2021 : ఇదీ ఆటేనా.. వ‌రుస ట్వీట్‌లతో టీం ఇండియాను ట్రోల్ చేసి ఇంగ్లండ్ మాజీ క్యాప్టెన్‌

  మొత్తానికి రిటైర్మెంట్ తర్వాత యువీ చేసిన ఈ ప్రకటన టీమిండియా ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. ‘రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్’లో భాగంగా ఈ సంవత్సరం మార్చిలో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ టీమిండియా తరపున చివరిగా ఆడాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ 2011 వన్డే వరల్డ్ కప్‌‌ను ఇండియా గెలుచుకున్న సమయంలో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ను సొంతం చేసుకున్నాడు. యువీ మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు, 304 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 11,778 పరుగులు చేసి 148 వికెట్లు కూడా తీశాడు. యువీ చేసిన తాజా ప్రకటనతో తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Cricket, Instagram post, Team India, Yuvaraj singh

  ఉత్తమ కథలు