యువ రెజ్లర్ సాగర్ దండక్ (Sagar Dhandak) హత్య కేసులో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ (Susheel Kumar) ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మే 4న ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియం పార్కింగ్ ప్రదేశంలో హాకీ స్టిక్కులు, బేస్ బాల్ బ్యాట్లతో సుశీల్ కుమార్ అతడి స్నేహితులు దాడి చేయడంతో సాగర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయిన సుశీల్ దాదాపు మూడు వారాల తర్వాత సోనేపట్ సమీపంలో పోలీసులకు చిక్కాడు. తర్వాత అతడిని రోహిణి కోర్టు తీహార్ జైలుకు (Tihar Jail) రిమాండ్ ఖైదీగా పంపింది. జైలుకు వెళ్లిన కొత్తలో తనకు డైట్ ఫుడ్ కావాలని.. ప్రోటీన్లతో కూడిన అథ్లెటిక్ ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశాడు. తాను ఒక రెజ్లర్‌ను కాబట్టి తనకు డైటీషియన్ సజెస్ట్ చేసిన ఆహారం ఇవ్వాలని కోరారు. అయితే తీహార్ జైలు అధికారులు అతడి విన్నపాన్ని తిరస్కరించారు. అవసరం అయితే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటే ప్రత్యేక ఆహారం అందిస్తామన్నారు. కాగా రోహిణి కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు కొట్టేసింది. జైలులో అందరు ఖైదీలకు అందించిన విధంగానే సాధారణ ఆహారాన్ని అందిస్తామని పేర్కొంది. ప్రత్యేక వసతులు కల్పించబడవని చెప్పింది.
తాజాగా జైలులో మరోసారి సుశీల్ కుమార్ తన డిమాండ్ల చిట్టాను విప్పాడు. తన గదిలో టీవీ కావాలంటూ జైలు అధికారులను డిమాండ్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రెజ్లింగ్ పోటీలు జరుగుతున్నాయి... వీటితో పాటు టోక్యో ఒలింపిక్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. ఒక అథ్లెట్‌గా తనకు ఆ మ్యాచ్‌లు చూడటం చాలా అవసరం. అంతర్జాతీయ వేదికలపై జరుగుతున్న క్రీడలను తప్పకుండా చూడాలి కాబట్టి తన గదిలో టీవీ ఏర్పాటు చేయాలని సుశీల్ డిమాండ్ చేశాడు. అయితే జైలు అధికారులు మరోసారి అతడి డిమాండ్‌ను తిరస్కరించారు. నిబంధనల ప్రకారం జైలులో ఖైదీలకు న్యూస్ పేపర్లు మాత్రమే అందిస్తామని పేర్కొన్నారు. ఒక వేళ అదనంగా టీవీ కావాలంటే కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలని తేల్చి చెప్పారు.
భారత కీర్తి ప్రతిష్టలను రెజ్లింగ్ క్రీడ ద్వారా అంతర్జాతీయ వేదికలపై చాటిన సుశీల్ కుమార్ ఇప్పుడు ఒక హంతకుడిగా ముద్రపడి జైలులో గడుపుతుండటం క్రీడా వర్గాలను జీర్ణించుకోలేకుండా చేశాయి. ఈ ఒక్క ఘటనతో సుశీల్ కుమార్ తన పేరును మొత్తం చెడగొట్టుకున్నాడని పలువురు వ్యాఖ్యానించారు. భారత రెజ్లింగ్‌కు ఇది మాయని మచ్చ అని రెజ్లింగ్ సమాఖ్య స్వయంగా వ్యాఖ్యానించింది. అయితే తాను ఈ హత్య చేయలేదని సుశీల్ కుమార్ ఇంకా వాదిస్తూనే ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Susheel kumar, Tihar, Wrestling