RCB vs DC Live Scores : తొలిసారి జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023)లో మరో ఆసక్తికర సమరానికి సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య కీలక పోరు జరగనుంది. స్మృతి మంధాన (Smriti Mandhana) నాయకత్వలోని ఆర్సీబీ.. మెగ్ ల్యానింగ్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. బ్రబోర్న్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన స్మృతి మంధాన ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లకు కూడా ఇదే తొలి మ్యాచ్ కావడంతో ఇందులో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది. బ్యాటింగ్ వికెట్ కావడంతో పరుగుల వరద పారే అవకాశం ఉంది.
శుభారంభం చేయాలని
ఐపీఎల్ తో పోలిస్తే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరిగే వ్యవధి చాలా తక్కువ. కేవలం 3 వారాల పాటు మాత్రమే ఈ టోర్నీ జరగనుంది. లీగ్ లో 5 జట్లు మాత్రమే ఉన్నాయి. దాంతో ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ప్రతి జట్టు కూడా నిలకడగా రాణించాల్సి ఉంది. ప్లే ఆఫ్స్ కు నాలుగు జట్లు కూకుండా కేవలం 3 జట్లు మాత్రమే చేరుకుంటాయి. అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ మ్యాచ్ ను ఆడతాయి. ఈ క్రమంలో మరికాసేపట్లో జరిగే ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని అటు ఆర్సీబీ, ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ పట్టుదలగా ఉంది.
ఇక జట్టు బలాబలాల విషయానికి వస్తే ఇరు జట్లు కూడా సమానంగా ఉన్నాయి. ఆర్సీబీకి స్మృతి మంధాన, పెర్రీ, రిచా ఘోష్, సోఫీ డివైన్, రేణుక సింగ్ లు కీలకం కానున్నారు. ఇక ఢిల్లీ విషయానికి వస్తే మెగ్ ల్యానింగ్, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, క్యాప్, రాధా యాదవ్ లతో బలంగా ఉంది. ఇటీవలె ముగిసిన మహిళల టి20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాను ప్రపంచ చాంపియన్ గా నిలిపిన ఘనత మెగ్ ల్యానింగ్ ది. కెప్టెన్సీ విషయంలో అనుభవం ఉన్న ప్లేయర్ ఢిల్లీ సొంతం. ఈ మ్యాచ్ మాత్రం హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఢిల్లీ తరఫున తెలంగాణ అమ్మాయి అరుంధతి రెడ్డి బరిలోకి దిగనుంది.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్
మెగ్ ల్యానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానె క్యాప్, జెమీమా రోడ్రిగ్స్, అలైస్ క్యాస్పీ, జెస్ జొనాసెన్, తానియా భాటియా, అరుంధతి రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్, టారా నోరిస్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, దిషా కసత్, ఎలీస్ పెర్రీ, రిచా ఘోష్, హీథర్ నైట్, కనిక అహుజ, ఆశా, మేగాన్ షుట్, రేణుక సింగ్, ప్రీతి బోస్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, Royal Challengers Bangalore, Smriti Mandhana, WPL 2023